బుధవారం 25 నవంబర్ 2020
Peddapalli - Jul 07, 2020 , 02:19:35

అల్లుకున్న జీవితం

అల్లుకున్న జీవితం

  • lఎనిమిది పదుల వయస్సులోనూ కులవృత్తితో ఉపాధి
  • lశానగొండలో ఆదర్శంగా నిలుస్తున్న రాయమల్లు దంపతులు

ప్రపంచీకరణ నేపథ్యంలో కులవృత్తులు ఒక్కొక్కటిగా అంతరించిపోతుండగా,  ఓదెల మండలం శానగొండకు చెందిన వృద్ధ దంపతులు ఇప్పటికీ మేదరి పనినే నమ్ముకున్నారు. ఎనిమిది పదుల వయస్సులోనూ ఎలాంటి అలుపులేకుండా వెదురుతో చాటలు తయారు చేసుకుంటూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు. - ఓదెల

ఓదెల మండలం శానగొండ గ్రామానికి చెందిన రాయమల్లు- రాజమ్మ దంపతులు కుల వృత్తితో ఉపాధి పొందుతున్నారు. ఎనిమిది పదుల వయస్సులోనూ ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా మేదరి పని చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. ఆధునీకరణ నేపథ్యంలో ఆనాడూ ఓ వెలుగు వెలిగిన వస్తువులన్నీ కనుమరుగై పోతుండగా, మహిళలు ఇంట్లో వాడే వెదురు చాటలకు మాత్రం క్రేజ్‌ తగ్గలేదు. మార్కెట్లో మంచి రేటు పలుకుతుండడంతో నాటి నుంచి నేటి దాకా ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు. రాజమ్మ వెదురు కర్రలను చీరి పెడితే.. రాయమల్లు చాటను తీర్చిదిద్దుతున్నాడు. ఇలా రోజుకు ఇద్దరూ కలిసి ఐదు నుంచి ఆరు చాటలు తయారు చేస్తూ రూ. 300 సంపాదిస్తున్నారు.

ఖాళీగా ఉంటే ఏమస్తది.. 

పిల్లలంతా ప్రయోజకులై మంచిగా బతుకుతున్నరు. మాకు ఏం ఇబ్బంది లేదు. కేసీఆర్‌ సారు నా పెనిమిటికి నెలకు రూ. 2016 పింఛినిత్తండు. మస్తు ఆసరైతున్నయ్‌. అయితే ఇంట్ల ఖాళీగా కూర్చుంటే ఏమస్తది. రెక్కలు మంచిగున్నన్ని రోజులు కుల వృత్తిని చేసుకుంట బతుకుతం 

- రాజమ్మ