శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Jul 05, 2020 , 00:57:02

మంథని రుచులను ఇష్టపడుతుండె..

మంథని రుచులను ఇష్టపడుతుండె..

  • l నన్ను పిలిపించుకొని వంట చేయిస్తుండె 
  • l‘నమస్తే’తో పీవీ పర్సనల్‌ కుక్‌ రంగి కిట్టు

 మంత్రిగా.. సీఎంగా.. ప్రధానిగా ఎంత ఎదిగినా రాజకీయ జన్మనిచ్చిన మంత్రపురి రుచులంటే పీవీ చాలా ఇష్టపడేవారు. విదేశాలకైనా.. మరెక్కడికైనా వెళ్తున్నారంటే ప్రత్యేకంగా కొన్ని ఐటమ్స్‌ ప్యాక్‌ చేయించుకొని మరీ తీసుకెళ్లేవారు. అదీ ముఖ్యంగా ఓ చేయితిరిగిన వంట మనిషి చేసినవే పట్టుకెళ్లేవారు. ఆయనెవరో కాదు మంథనికి చెందిన ప్రముఖ పాక శాస్త్ర ప్రావీణ్యుడు రంగి కిట్టు. ‘నాగ్‌పూర్‌ల చదువుకునే రోజుల్ల మా తాత చంటయ్య దగ్గర తినేది. మంథనికొచ్చినంక నాతో చేయించుకునేది’ అని సగర్వంగా చెబుతున్నాడు కిట్టు. పీఎం అయినంక ఢిల్లీకి పిలిపించుకొని మరీ పర్సనల్‌ కుక్‌గా సార్‌ పెట్టుకున్నరని పీవీతో ఆయనకున్న అనుబంధాన్ని చెబుతున్నడు. ఆయన మాటల్లో.. - పెద్దపల్లి, నమస్తే తెలంగాణ

పెద్దాయనకు మంథని రుచులంటే మస్తు ఇష్టం. నాగ్‌పూర్ల లా చదివే రోజుల్ల మా తాత రంగి చంటయ్య దగ్గరనే తింటుండెనట. ‘అప్పటి నుంచే పీవీకి మంథని వంటకాలంటే బాగా ఇష్టం’ అని మా తాత నాకు చెప్పిండు. ఇక ఈడికెళ్లి రాజకీయం చేసే టైంల నాతోనే వంటలు చేయించుకునేది. ఆయన కిష్టమైన పదార్థాలను తృప్తిగా తినేది. పెద్దసారుకు గుమ్మడి కాయ బరడా, చల్లా పులుసు, చప్పిడి పప్పు, బేసన్‌, దోసకాయ వడియం, ఉప్పిడి పిండి, ఉల్లిగడ్డ జుల్కా మస్తు ఇష్టం. పొద్దుగాల పెసరు మొలుకల నాస్త చేస్తుండె. ఇక భోజనంల రెండు కూరలు, పప్పు, సాంబార్‌, రసం, పులకలు, రాత్రిపూట ఎప్పుడోసారి అదీ ఉడకబెట్టిన కోడి గుడ్డును పచ్చ సొన తీసివేసి తింటుండె. బయటి దేశాలకు పోవాల్సత్తె సార్‌కు ఇష్టమైన ఐటంలు ముల్లెగట్టి పంపుదుం. ఇగ పీవీ సార్‌ ఇక్కడి నుంచి వోయి ప్రధాని అయినంక నన్ను ఢిల్లీకి పిలిపించుకున్నడు. అక్కడ రెండేళ్ల పాటు సార్‌కు పర్సనల్‌ కుక్‌గా పనిచేసిన. మా తాత, ఆ తర్వాత నేను చేసిన వంటలు పీవీ సాబ్‌ తినడం ఎప్పటికీ మర్చిపోను.