మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Jul 04, 2020 , 02:46:06

ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలి

ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలి

  •  l రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి
  •  l      మద్యం, ఓవర్ స్పీడ్‌తోనే అనేక ప్రమాదాలు
  •  l     జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, సీపీ సత్యనారాయణ

మంథని టౌన్: ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. మంథని పోలీస్‌స్టేషన్ ఆవరణలో రామగుండం సీపీ సత్యనారాయణతో కలిసి శుక్రవారం రోడ్డు ప్రమాదాల నివారణ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా వరకు ప్రమాదాలు ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తోనే జరుగుతున్నాయన్నారు. ప్రమాదాల నివారణ కోసం  రామగుండం సీపీ సత్యనారాయణతో చర్చించి పార్టీలకతీతంగా నాయకులను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని కోరామన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. మద్యం సేవించి, ఓవర్ స్పీడ్‌గా బైక్‌లు నడపడం, ఓవర్‌టేక్ చేయడంతోనే ఎక్కువ ప్రమాదాలు సంభవిన్నాయన్నారు. ఇసుక లారీలు ఒక్కటే ప్రమాదాలకు కారణం కాదన్నారు. రాష్ర్టానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఇసుక మన ప్రాంతం నుంచి రవాణా అయితేనే హైదరాబాద్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని, వీటి ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు టాక్స్ రూపంలో వస్తాయన్నారు. ఇసుక క్వారీల ద్వారా కోట్లాది రూపాయల సీనరేజ్ నిధులు రావడంతో పాటు అనేక మంది స్థానికులకు ఉపాధి లభిస్తున్నదన్నారు. బెల్టు షాపుల నిర్వహణ వద్దని గ్రామ సభలో తీర్మానం చేసి పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు ఇస్తే వాటిని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటారన్నారు. 

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు ..

రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ఇసుక లారీల వేగాన్ని నియంత్రించడంతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాల ద్వారానే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా యువత మద్యం మత్తులో, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. బైకులు నడిపే వారికి లైసెన్స్, ధ్రువపత్రాలు లేక పోవడంతో  ఇన్సూరెన్స్ కోసం భారీ వాహనాలపైనే కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. లైసెన్స్ లేకుండా రోడ్డెక్కే బండ్లను సీజ్ చేసి కోర్టుకు అప్పగిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఉండకూడదని కోరారు. ఇష్టానుసారంగా  సోషల్ మీడియాలో పోస్టుపెట్టవద్దన్నారు. 

మొక్కలు నాటిన జడ్పీ చైర్మన్, సీపీ 

మంథని పోలీస్‌స్టేషన్ ఆవరణలో జడ్పీ చైర్మన్, రామగుండం పోలీస్ కమిషనర్, మంథని మున్సిపల్ చైర్‌పర్సన్ పుట్ట శైలజ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. రాష్ర్టాన్ని హరితవనంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీలు ఆరెల్లి దేవక్క, కొండా శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత, జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు రవీందర్, సంజీవ్‌కుమార్, ఉమేందర్, సీఐలు ఆకునూరి మహేందర్, శ్రీనివాస్‌రావు, ఎస్‌ఐలు ఓంకార్‌యాదవ్, మహేందర్, నరసింహారావు, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, పోలీసులు, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.