బుధవారం 12 ఆగస్టు 2020
Peddapalli - Jul 04, 2020 , 02:46:07

రెండో రోజూ కొనసాగిన సమ్మె

రెండో రోజూ కొనసాగిన సమ్మె

గోదావరిఖని: బొగ్గు బ్లాకులను కేంద్రప్రభుత్వం ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ జాతీయ కార్మిక సం ఘాలు తలపెట్టిన దేశవ్యాప్త 72 గంటల సమ్మె సింగరేణిలో రెండో రోజూ కొనసాగింది. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ గురువారం ఒక్కరోజు సమ్మెకు పిలుపునివ్వగా, సింగరేణి వ్యాప్తంగా సమ్మె సంపూర్ణమైంది. జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన మూడు రోజుల సమ్మెలో భాగంగా శుక్రవారం ఆర్జీ-1లో యథావిధిగా కొనసాగింది. మేడిపల్లి ఓసీపీలో ఉదయం షిఫ్టులో ఆపరేటర్లు విధులకు హాజరు కాకపోవడంతో బొగ్గు ఉత్పత్తికి విఘా తం కలిగింది. అలాగే భూగర్భ బొగ్గు గనుల్లో సైతం కార్మికులు హాజరు కాలేదు. శ్రీరాంపూర్ ఏరియాలో ఏఐటీయూసీ నాయకుడు సీతారామయ్య అరెస్టు ఘటనతో పలు ఏరియాల్లో ఆ సంఘం నాయకులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆర్జీ-1 పరిధిలోని బొగ్గు గనులపై ఆందోళనలు చేపట్టిన నాయకులు అనంతరం బైక్ ర్యాలీలు తీశారు. బొగ్గు గనులపై పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. మూడో రోజూ శనివారం సమ్మె ఇలాగే కొనసాగితే ఆదివారం కూడా సింగరేణిలో సెలవు దినం కావడంతో నాలుగు రోజులు బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపనుంది. రెండో రోజు ఆర్జీ-1లో 244 టన్నుల బొగ్గు మాత్రమే ఉత్పత్తి జరిగింది. ఆర్జీ-1లోని భూగర్భ, మేడిపల్లి ఓసీపీ బొగ్గు గనిలో శుక్రవారం మొదటి షిఫ్టులో 2540 మంది కార్మికులకు గానూ  988 మంది, రెండో షిఫ్టులో 1019 మంది కార్మికులకు గానూ 304 మంది హాజరయ్యారు. జీడీకే-1, 3 గనిలో మొదటి షిప్టులో 331 మంది కార్మికులకు 46 మంది, 2,2ఏ గనిలో 484 మంది కార్మికులకుగానూ 82 మంది, 5వ గనిలో 24 మంది కార్మికులకు 8 మంది, 11వ గనిలో 589 మంది కార్మికులకు 91 మంది, మేడిపల్లి ఓసీపీలో 225 మంది కార్మికులకు 115 మంది కార్మికులు హాజరయ్యారు. అలాగే రెండో షిఫ్టులో జీడీకే 1,3 గనిలో 175 మంది కార్మికులకుగానూ 24 మంది, 2,2ఏ గనిలో 247 మంది కార్మికులకు 60 మంది, 5వ గనిలో ముగ్గురు కార్మికులకు ముగ్గురు, 11వ గనిలో 324 మంది కార్మికులకు 61 మంది, మేడిపల్లి ఓసీపీలో 72 మంది కార్మికులకు 30 మంది హాజరయ్యారు. 

నల్లబ్యాడ్జీలతో నిరసన

జ్యోతినగర్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎన్టీపీసీ లేబర్‌గేట్‌లో ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. విధులకు వెళ్తున్న కాంట్రాక్టు కార్మికులకు నల్లబ్యాడ్జీలు పెట్టారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కరోనా సాకుతో కేంద్రం కార్మిక వర్గంపై దాడికి పాల్పడుతున్నదని ఆరోపించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి కార్మిక కుటుంబానికి నెలకు రూ. ఏడు వేల నగదు, నిత్యావసరాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. వలస కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని రద్దు చేయాలని, 12 గంటల పని దినాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూసీ అనుబంధ ఎన్టీపీసీ కాంట్రా క్టు కార్మిక సంఘాల నాయకులు నాంసాని శంకర్, రామాచారి, లక్ష్మారెడి, శంకర్, లక్ష్మణ్, రాఘవరెడ్డి, మల్లేశ్, రాజ్‌కుమార్, నారాయణరెడ్డి ఉన్నారు.   

ఆర్జీ-2లో పాక్షికం..

యైటింక్లయిన్ కాలనీ: కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ జాతీయ సం ఘాలు ఇచ్చిన సమ్మె రెండో రోజు ఆర్జీ-2లో పాక్షికంగా జరిగింది. డివిజన్ పరిధిలోని బొగ్గు గనులు, ఓసీపీ ప్రాజెక్టుల్లో మొదటి షిఫ్టులో 2350 మంది కార్మికులకుగానూ 792, రెండో షిఫ్టులో 920 మంది కార్మికులకు గానూ 309 మంది హాజరయ్యారు. ఆర్జీ-2 ఏరియాలో మొదటి షిఫ్టులో 21,300 టన్నుల బొగ్గు ఉత్పత్తికి గానూ 3160 టన్నుల బొగ్గు వెలికితీశారు. జాతీయ సంఘాల పిలుపునకు కార్మికులు అంతంతమాత్రంగానే స్పందించారు.  

కోల్‌సిటీ:  జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపునకు సీపీఐ నాయకులు మద్దతు ప్రకటించారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. 41 బొగ్గు బ్లాకులను ప్రైవేటు వ్యక్తులు అప్పగించేందుకు నిర్వహించిన వేలాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో నాయకులు గౌతం గోవర్ధన్, కనకరాజ్, ఆరెల్లి పోశం, మద్దెల దినేశ్, రమేశ్ కుమార్, రాజారత్నం, రంగు శ్రీను, మహేశ్, రాజమౌళి, అశోక్, నరేశ్, ప్రీతం, నాగేందర్, విజయ్ తదితరులున్నారు. 

తాజావార్తలు


logo