ఆదివారం 06 డిసెంబర్ 2020
Peddapalli - Jul 02, 2020 , 03:41:12

సమ్మెను విజయవంతం చేయాలి

సమ్మెను విజయవంతం చేయాలి

  • గేట్ మీటింగ్‌లో టీబీజీకేఎస్ 
  • ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి

యైటింక్లయిన్ కాలనీ: బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపు మేరకు ఒక రోజు సమ్మెను విజయవంతం చేయాలని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి కోరారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బుధవారం ఓసీపీ-3 బేస్ వర్క్‌షాప్ వద్ద గేట్ మీటింగ్‌లో రాజిరెడ్డి మాట్లాడుతూ, జాతీయ కార్మిక సంఘాలు సింగరేణిలో ఐదేళ్లుగా ఏటా మూడురోజుల సమ్మెకు పిలుపునిస్తూ కోలిండియాలో సమ్మె చేయకుండా ఇక్కడి కార్మిక వర్గా న్ని మోసం చేస్తున్నదని ఆరోపించారు. జాతీయ సం ఘాలకు చిత్తశుద్ధి ఉంటే దేశ వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టాలని సూచించారు. అప్పుడు టీబీజీకేఎస్ కూడా నిరవధిక సమ్మెకు కలిసివచ్చి కేంద్ర నిర్ణయాన్ని తిప్పికొడుతుందన్నారు. టీబీజీకేఎస్ గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు కోలిండియాకు భిన్నంగా సింగరేణి కార్మికులకు 18రకాల హక్కులను బహుమానంగా ఇచ్చిందని గుర్తు చేశారు. ఇన్నాళ్లూ గుర్తింపు సంఘంగా ఉన్న జాతీయ సంఘాలు ఏం సాధించాయని ప్రశ్నించారు. కోలిండియాలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభు త్వం సింగరేణి కార్మికులకు ఎన్నో సదుపాయాలను కల్పిస్తున్నదన్నారు. సమావేశంలో నాయకులు ఐలి శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి, ప్యారేమియా, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్ నాయక్, సత్యం, బానాకర్, సిరంగి శ్రీనివాస్, పైడిపల్లి ప్రభాకర్, కర్క శ్రీనివాస్, కొప్పుల స్వామి, బేతి చంద్రయ్య, రవీందర్, మల్లేశ్, రాజమల్లు, వెంకటేశ్వర్లు ఉన్నారు. 

జయప్రదం చేయండి

గోదావరిఖని: బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన 72 గంటల దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆర్జీ-1 పరిధిలోని జీడీకే-2ఏ గనిపై బుధవారం జరిగిన గేట్ మీటింగ్‌లో జేఏసీ నాయకులు రాజారెడ్డి మాట్లాడారు. కేంద్రప్రభుత్వం 41బొగ్గు బ్లాకులను వేలం ద్వారా ప్రైవేటు శక్తులకు అప్పగిస్తుందని, ఆ బొగ్గు బ్లాకులకు, సింగరేణికి సంబంధం లేదంటూ అధికారులు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. బొగ్గు బ్లాకులకు సంబంధం లేకపోయినా భవిష్యత్‌లో సింగరేణి సంస్థ మనుగడ నిర్వీర్య మయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్ముందు ప్రభుత్వ రంగ బొగ్గు పరిశ్రమలను కూడా కేంద్రం ప్రైవేటుపరం చేసినా ఆశ్చర్యం లేదన్నారు. కార్మికులు సింగరేణి సంస్థను కాపాడుకోవాలంటే 72 గంటల సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఆయా సంఘాల జేఏసీ నాయకులు రామస్వామి, సదానందం, యాదగిరి సత్తయ్య, కనుకయ్య, మహేశ్, సార య్య, సత్తయ్య, రాములు, ప్రభాకర్, ఎస్ రవి, లక్ష్మణ్‌తోపాటు పలువురు ఉన్నారు.