శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - Jul 01, 2020 , 03:28:17

సంక్షేమమే సర్కారు లక్ష్యం

సంక్షేమమే సర్కారు లక్ష్యం

  •  ప్రాజెక్టుల నిర్మాణంలో దేశానికే ఆదర్శం
  •  రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 
  •  అక్కపెల్లి చెరువు మత్తడిపై కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన

ధర్మపురి/ధర్మారం: సంక్షేమ పథకాల అమలు, ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, సంక్షేమమే సర్కారు లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ కాకతీయుల కాలం నాటి చెరువులను పునరుద్ధరించి పూర్వ వైభవం తెచ్చార ని చెప్పారు. మంగళవారం ధర్మపురి మండలం బుద్దేశ్‌పల్లిలో రూ.25 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో అక్కపెల్లి చెరువు మత్తడిపై కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో రూ.12 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ధర్మారం మండల పరిషత్‌ ఆవరణలో 63 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు   రూ.63,7,048 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కొత్తపల్లిలో ఉపాధి హామీ కింద నిర్మించిన వైకుంఠధామం, ఏడు సీసీ రోడ్లను ప్రారంభించి మొక్కలు నాటారు. ఎస్జీఎఫ్‌ నిధులు రూ. 5 లక్షలతో నిర్మించనున్న వాటర్‌ ట్యాంక్‌ వద్ద ప్రహరీ, ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పాలనలో దశలవారీగా చెరువులన్నీ పునరుద్ధరించడంతో భూగర్భ జలాలు రికార్డుస్థాయిలో పెరగడంతో ఊరూరా ధాన్యపు రాశులు పండాయని పేర్కొన్నారు. అక్కపెల్లి చెరువుకు ఎత్తిపోతల పథకం నిర్మించి గోదావరి నుంచి నీరందించేందుకు యత్నిస్తామన్నారు. త్వరలోనే గంగనాల ప్రాజెక్టు, యశ్వంతరావ్‌పేట చెరువుల పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. రోళ్లవాగు నుంచి అక్కపెల్లి చెరువుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా నీరందించేందుకు రూ. 90లక్షల ఎస్సారెస్పీ నిధులతో దోనూర్‌ వెల్‌గల్‌ చెరువు నుంచి అక్కపెల్లి చెరువు వరకు గల కాలువ మరమ్మతు పనులు చేయించినట్లు గుర్తుచేశారు. అక్కపెల్లి చెరువు పునరుద్ధ్దరణకు ప్రతిపాదనలు పంపగా తొందరలోనే నిధులు మంజూరవుతాయని చెప్పారు. కరోనా ఆపత్కాలంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌ సర్కారుకే దక్కిందని మంత్రి ఉద్ఘాటించారు. కొత్తపల్లికి ఎస్సారెస్పీ కాల్వ నిర్మాణానికి టెండర్లు ఖరారైన నేపథ్యంలో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ధర్మారం మండలం కొత్తూరు పర్యటనకు వచ్చిన మంత్రి కొద్దిసేపు అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో మామిడి తోటలు అధికంగా ఉన్నందున మ్యాంగో ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీలు బాదినేని రాజేందర్‌, బత్తిని అరుణ, పూస్కూరు పద్మజ, ఎంపీపీలు చిట్టిబాబు, ముత్యాల కరుణశ్రీ, వైస ఎంపీపీలు మేడవేని తిరుపతి, మహిపాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్లు అయ్యోరి రాజేశ్‌కుమార్‌, గుర్రం మోహన్‌రెడ్డి, విండో చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకటరెడ్డి, సర్పంచులు పూస్కూరు జితేందర్‌రావు, కోమటిరెడ్డి లలిత, తాళ్ల మల్లేశం, ఎంపీటీసీలు తుమ్మల రాంబాబు, గాగిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, తాళ్లపల్లి భద్రమ్మ, తహసీల్దార్‌ సంపత్‌తోపాటు తదితరులు ఉన్నారు.