ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Jun 30, 2020 , 02:35:40

ఈ సమయంలో సమ్మె తగునా..?

ఈ సమయంలో సమ్మె తగునా..?

  • ఆర్జీ-1 జీఎం కే నారాయణ

గోదావరిఖని: కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో వేలాది పరిశ్రమలు  ఉత్పత్తులను నిలిపివేశాయని, బొగ్గు సరఫరా కూడా సగానికిపైగా పడిపోయిందని, ఈ సమయంలో కొన్ని కార్మిక సంఘాలు మూడు రోజుల పాటు తలపెట్టిన సమ్మె సముచితమేనా అని ఆర్జీ-1 జీఎం నారాయణ ప్రశ్నించారు. సోమవారం ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో సమ్మెకు కార్మికులు దూరంగా ఉండాలని కోరుతూ వాల్ పోస్టర్, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని జాతీయ సంఘాలు సింగరేణిలో మూడు రోజుల పాటు దేశ వ్యాప్త సమ్మె చేయాలని చూస్తున్నాయన్నారు. ఈ సమయంలో సమ్మె చేయడంతో బొగ్గు ఉత్పత్తిలో మరింత వెనుకంజలో ఉంటామన్నారు. విదేశీ బొగ్గు మనకన్నా తక్కువ ధరకు మార్కెట్‌లో దొరుకుతుందని, దీంతో మార్కెట్‌లో పోటీ ఏర్పడిందన్నారు. వినియోగదారులతో పారిశ్రామిక సంబంధాలు పెంచుకోవడానికి నాణ్యమైన బొగ్గు సకాలంలో అందిస్తామని హామీలు ఇస్తూ కొత్త ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఇలాంటి సమయంలో సమ్మెకు పోవడం సరి కాదన్నారు. కేంద్రం వేలానికి ఉంచిన 41 బ్లాకుల్లో సింగరేణి పరిధిలోని బ్లాకులు ఏమీ లేవని తెలిపారు. మన ప్రాంత బ్లాకులు మనకే కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖను కోరుతున్నామన్నారు. ఇప్పటికే ఒడిశా రాష్ట్రంలో 2 బ్లాకులు కేటాయించారన్నారు. కార్మికులు వాస్తవాలు గమనించి సమ్మెకు దూరంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌వో -2 జీఎం త్యాగరాజు, ఏజీఎం ఆంజనేయులు, పర్సనల్ మేనేజర్ రమేశ్, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ గంగాధర్, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి ఉన్నారు.