మంగళవారం 14 జూలై 2020
Peddapalli - Jun 30, 2020 , 02:36:09

పచ్చనిపల్లె..పాలధార కటికెనపల్లిలో శ్వేతవిప్లవం

పచ్చనిపల్లె..పాలధార కటికెనపల్లిలో శ్వేతవిప్లవం

  • lపాడిలో రైతుల రాణింపు
  • lపాతికేళ్ల నుంచి ఆవులు, బర్ల పెంపకం   
  • lనిత్యం 345 లీటర్ల పాల ఉత్పత్తి
  • lగ్రామ పాలకేంద్రంలోనే విక్రయం
  • lఏడాదిలో లక్షా 43వేల లీటర్లు సరఫరా
  • lగతేడాది 43.49 లక్షల ఆదాయం 
  •  lఆదర్శంగా నిలుస్తున్న గ్రామస్తులు

వారందరూ సాధారణ రైతులే. కానీ, అందరిలా కాకుండా వినూత్నంగా ముందుకుసాగుతున్నారు. ఒకరి స్ఫూర్తితో మరొకరూ పాడివైపు దృష్టి సారించారు. తమకున్న భూముల్లో బంగారు పంటలు పండిస్తూనే, ఆవులు, బర్రెల పెంపకాన్ని చేపట్టారు. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకొని, అంచనాలకు మించి పాల దిగుబడిని సాధిస్తూ దండిగా రాబడి పొందుతున్నారు. తాము ఎంచుకున్న రంగంలో అసాధారణ విజయాలను సాధిస్తూ తమ ఊరిని పాడికి కేరాఫ్‌గా మార్చారు. - ధర్మారం

కటికెనపల్లి వ్యవసాయాధారిత గ్రామం.. ఎస్సారెస్పీ కాలువ నీళ్లు, చెరువు, కుంటల ఆధారంగా తరి భూముల్లో వరి సాగు చేస్తారు. మెట్ట భూముల్లో మామిడి తోటలు పెంచుతున్నారు. ఊరికి సమీపంలో గుట్టలు ఉండడం, గడ్డిని పెంచేందుకు అనుకూలమైన భూములు ఉండడంతో ఆవులు, గేదెల పెంపకంపై దృష్టి పెట్టారు. గ్రామానికి చెందిన మట్ట రాంరెడ్డి, తడుపునూరి సత్యనారాయణ 23 ఏళ్ల క్రితం జెర్సీ ఆవుల పెంపకానికి శ్రీకారం చుట్టారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన వారు సైతం పాడి వైపు మళ్లారు. పశువుల పెంపకం కొంత కష్టమైనా ఇష్టంతో ముందుకెళ్తూ ఆర్థిక స్వావలంబన సాధించారు. ప్రస్తుతం 200 జెర్సీ ఆవులు, 100 ముర్రా జాతి గేదెలను ప్రత్యేక షెడ్లలో పెంచుతున్నారు. వీటితోపాటు మరో 100 వరకు లోకల్ బర్రెలు, 20 వరకు సాధారణ ఆవులను సాదుతున్నారు. జెర్సీ, ముర్రా జాతి గేదెల మేత కోసం కోవన్ గడ్డిని పెంచుతున్నారు. పచ్చటి గడ్డికి తోడు వరి గడ్డి, దాణాను మేతగా అందిస్తున్నారు. దీంతో పశువులు అంచనాలకు మించి పాలు ఇస్తున్నాయని రైతులు చెబుతున్నారు. 

ప్రత్యేక కేంద్రం.. ఉత్పత్తి దారుల సంఘం..

గ్రామంలో పాల సేకరణ పెరగడంతో రైతులంతా కలిసి కరీంనగర్ డెయిరీకి అనుబంధంగా 2003-04 ఆర్థిక సంవత్సరంలో పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా స్థలాన్ని కొనుగోలు చేసి భవన నిర్మాణం కోసం తమవంతుగా 2008లో 50 వేలను కరీంనగర్ డెయిరీకి అందించగా, వారు లక్షా 82 వేల నిధులను మంజూరు చేశారు. దీంతో రైతులు మరికొంత సొమ్మును వాటాధనంగా వేసుకుని పాల కేంద్రం భవనాన్ని నిర్మించుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా రేండ్ల కోటయ్య ఎన్నిక కాగా, జంగిలి రాజయ్య ఒక ఏడాది, రేండ్ల శ్రీనివాస్ ఏడేళ్లు సంఘం చైర్మన్‌గా పని చేశారు. మళ్లీ రెండో దఫాలో ఏడేళ్ల నుంచి రేండ్ల కోటయ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 

నిత్యం 345లీటర్ల సేకరణ..

ఈ సంఘంలో 245 మంది సభ్యులు ఉండగా, ప్రస్తుతం 120 మంది రైతులు ఉదయం, సాయంత్రం పాలు పోస్తున్నారు. కరీంనగర్ డెయిరీకి ఎగుమతి చేయగా మిగిలిన పాలను గ్రామస్తులకు విక్రయిస్తున్నారు. జెర్సీ ఆవు పాలలో లీటర్‌కు 3 శాతం వెన్న ఉంటే 28, 5.5 శాతం ఉంటే 30, 6శాతం ఉంటే 35 చెల్లిస్తారు. ఇక గేదె పాలల్లో 5 శాతం వెన్న ఉంటే లీటర్‌కు 31, 7 శాతం ఉంటే 46, 9.10 శాతం ఉంటే 62 చొప్పున చెల్లిస్తారు. కేంద్రంలో ప్రత్యేకంగా కార్యదర్శి తోడేటి కోటయ్య, సహాయకుడు బల్లయ్య కనకయ్య తేమ శాతం నిర్ధారిస్తారు. ప్రతి రోజు ఉదయం 188 లీటర్లు, సాయంత్రం 157 లీటర్ల పాలను మొత్తం 345 లీటర్లను సేకరిస్తున్నారు. 

అంచనాకు మించి ఆదాయం..

ఈ గ్రామం నుంచి రికార్డుస్థాయిలో పాలను కరీంనగర్ డెయిరీకి అందిస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు) 182 మంది రైతులు ఒక లక్షా 43 వేల 971 లీటర్ల పాలను సరఫరా చేశారు. దీంతో ఆ పాలకు 43,49,728 డెయిరీ నుంచి చెల్లించారు. అందులో గూడ శంకర్‌రెడ్డి ఏడాది కాలంలో 7,823 లీటర్ల జెర్సీ ఆవు పాలను పోయగా, అతనికి 2 లక్షల 5వేల 934 ఆదాయం సమకూరింది. కలవేని నర్సయ్య 6,761 లీటర్లు పోయగా, అతనికి లక్షా 78 వేల ఆదాయం వచ్చింది. రామడుగు భాగ్యలక్ష్మి 5,748 లీటర్లు పాలు పోసి 1.50లక్షలు పొందింది. ముర్రా గేదె జాతి (5,878 లీటర్లు) పాలు పోసిన బల్ల నర్సింగంకు 2,24,790 వచ్చాయి. జెర్సీ ఆవు పాలు (4,245 లీటర్లు) పోసిన రేండ్ల శ్రీనివాస్‌కు లక్షా 12 వేల 164 వచ్చాయి. 

రోజుకు 30 లీటర్ల పాలు పోస్తున్న..

నేను పన్నెండేళ్లుగా ఏడు జెర్సీ ఆవులను సాదుతున్న. వీటి మేత కోసం కోవన్ గడ్డి పెంచుతున్న. ఆవులు మంచిగా పాలు ఇస్తున్నయి. రోజుకు 30 లీటర్ల పాలు గ్రామంలోని పాల కేంద్రంలో పోస్తున్న. లీటర్‌కు 30 ధర చెల్లిస్తున్నరు. నెలకు సుమారు 27 వేల ఆదాయం వస్తున్నది.  

 కలవేని నర్సయ్య 

మా ఊరు పాలకు పెట్టింది పేరు..

మా ఊరు పాలకు పెట్టిన పేరు. రైతులంతా ఎంతో కష్టపడి జెర్సీ ఆవులు, ముర్రా జాతి ఆవులు పెంచుతున్నరు. పాడితో మంచి లాభాలు వస్తున్నయి. మా గ్రామం నుంచి రికార్డుస్థాయిలో కరీంనగర్ డెయిరీకి పాలను పోస్తున్నం. నేను ఏడేళ్లుగా ఆవులు, గేదెల పెంపకందారులకు సహాయం చేస్తున్న.

- రేండ్ల కోటయ్య, పాల కేంద్రం చైర్మన్ (కటికెనపల్లి)


logo