శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Jun 29, 2020 , 01:09:45

సమస్యల పరిష్కారంలో ఎన్టీపీసీ విఫలం

సమస్యల పరిష్కారంలో ఎన్టీపీసీ విఫలం

జ్యోతినగర్‌: భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో ఎన్టీపీసీ విఫలమైందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ విమర్శించారు. ఆదివారం ఎన్టీపీసీలోని  39వ డివిజన్‌ ఖాజిపల్లిలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్టీపీసీ ప్లాంటు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన  కాలనీల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. ఎన్టీపీసీ సీఎస్‌ఆర్‌ నిధులను  ఇతర జిల్లాలకు తరలిస్తూ ఇక్కడి అభివృద్ధిని వదిలేస్తున్నట్లు ఆరోపించారు. భూ నిర్వాసితుల సమస్యలపై ఎన్టీపీసీకి పట్టింపులేదన్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో  ఎన్టీపీసీ యాజమాన్యం ఇంకా నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించకతప్పదన్నారు. కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులో స్థానికులకు  ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. మహిళలకు శిక్షణ కేంద్రాలను  ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు చూపించాలన్నారు. ఇక్కడ  రామగుండం నగర మేయర్‌ అనిల్‌కుమార్‌, కార్పొరేటర్లు జెట్టి జ్యోతి రమేశ్‌,  కుమ్మరి శ్రీనివాస్‌ ఉన్నారు.

ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ 

గోదావరిఖని: దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ప్రపంచం గౌరవించేలా దేశానికి కీర్తి తెచ్చిన ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ నర్సింహారావు అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తొలి తెలుగు ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సింహారావు దేశానికి ఒక దిక్సూచిలా నిలిచారన్నారు.  తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించిన సీఎం కేసీఆర్‌ ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. రాబోయే కాలంలో కేసీఆర్‌ ప్రధాని అవడం ఖాయమని, దేశ ప్రజలకు కేసీఆర్‌ పాలనపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. కార్యక్రమంలో నగర మేయర్‌ అనిల్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. 

దస్‌ భజే దస్‌ మినట్‌లో ..

 ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మేయర్‌ అనిల్‌కుమార్‌తో కలిసి గోదావరిఖని తిలక్‌నగర్‌లోని ఉన్న తమ ఫంక్షన్‌హాల్‌లోని నీళ్లను శుభ్రపరిచారు. నీళ్లు నిల్వ ఉన్న చోట దోమలు వృద్ధి చెంది అనేక వ్యాధులు సంక్రమిస్తాయని, ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండాచూడాలని కేటీఆర్‌ ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.