శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - Jun 28, 2020 , 02:59:55

పీవీ సాబ్ చాలా సాదాసీదా మనిషి

పీవీ సాబ్ చాలా సాదాసీదా మనిషి

  • l ఆయన ఆప్యాయతే వేరు 
  • lమంథనికి ఎడ్లబండిపై వచ్చేవారు 
  • lఇక్కడి ప్రజలంటే చాలా ప్రేమ
  • lమా కల్వచర్లలో అందరి పేర్లూ తెలుసు
  • lప్రధాని అయినా.. పలకరింపులో  ఎలాంటి తేడా ఉండేది కాదు 
  • lపీవీతో అనుంబంధాన్ని గుర్తు చేసుకున్న  కల్వచర్ల మాజీ సర్పంచ్  బొల్లవరం భాస్కర్

పీవీ ఎంత ఎదిగినా.. ఎన్ని పదవులు అలంకరించినా నేను వెళ్లిన ప్రతిసారి ఆత్మీయ ఆలింగనం చేసుకొని ఏమయ్యా.. భాస్కర్ ఏం కావాలయ్యా.. అని అడిగేదని సగర్వంగా చెబుతున్నరు రామగిరి మండలం కల్వచర్లకు చెందిన మాజీ సర్పంచ్ బొల్లవరం భాస్కర్ ఎప్పుడు కలిసినా మాట తీరులో తేడానే కనబడేదికాదని భారత మాజీ ప్రధాని పీవీతో తనకున్న అనుబంధాన్ని ‘నమస్తే తెలంగాణ’తో ఇలా పంచుకున్నరు. ఆయనమాటల్లో.. - పెద్దపల్లి, నమస్తే తెలంగాణ

మా ఊళ్లో అందరి పేర్లూ తెలుసు.. 

అది 1957. పీవీ సాబ్ మంథని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకు రెండేళ్ల ముందే 1955లో గ్రామ పంచాయతీ చట్టం వచ్చింది. అప్పుడు ప్రభుత్వం నన్ను కల్వచర్ల నామినల్ సర్పంచ్ ఎంపిక చేసింది. ఆ తర్వాత 1958ల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన. 1988 దాకా పనిచేసిన. పీవీ కార్యకర్తలతో చాలా ఆప్యాయంగా ఉండేవారు. ఆయన హుజూరాబాద్ నుంచి మంథనికి ఎడ్ల బండిపై పెద్దపల్లి మీదుగా వచ్చేవారు. దారి వెంట కల్వచర్లలోని మా ఇంటికి తప్పకుండా వచ్చేవారు. ఊళ్లో అందరిని ఎంతో ఆప్యాయంగా పలుకరించేవారు. ప్రతి రైతునూ పేరు పెట్టే పిలిచేవారు. చిన్నా.. పెద్దా తేడా లేకుండా అందరితో ప్రేమగా మాట్లాడేవారు. ఆయన వస్తున్నాడంటే.. మా ఊర్లో సందడే సందడి.. వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు మా ఇంటికి వచ్చుడు మాత్రం మరువకపోయేది. అలా పీవీతో నాకు ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది. పీవీ వెంట ఆయన తమ్ముడు పీవీ మనోహర్ ఈఎల్ రాజు, అప్పటి నాయకులు మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వర్ సుల్తానాబాద్ సమితి ప్రెసిడెంట్ పూసుకూరి రాంచందర్ పనకంటి కిషన్ గులుకోట శ్రీరాములు, చంద్రుపట్ల రాజిరెడ్డి, మాజీ ఎంపీ వెంకటస్వామి, గుంజపడుగు రాజన్న, బేగంపేట బాపన్న, ఊరశ్రీనివాసరావు, చంద్రుపట్ల సీతరాంరెడ్డి, తోట నారాయణ, హర్కాల సత్యనారాయణ, తాడిచర్ల సత్యనారాయణరావు వచ్చేది. రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక పీవీ మంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఆయన ఏపీఆర్-6 అనే జీపులో మంథనికి వచ్చేవారు. ఎడ్ల బండిపై వచ్చినా.. జీపులో వచ్చినా కల్వచర్లకు రాకుండా మాత్రం ఉండేవారు కాదు. అలాంటి నాయకుడిని చూడలే.. 

కేంద్రమంత్రిగా.. ప్రధానమంత్రిగా పనిచేస్తున్నప్పుడు సైతం నేను ఢిల్లీ వెళ్లి పీవీ సాబ్ కలిసిన. ఆయన లోపల ఎలాంటి మార్పు నాకు కనిపించలేదు. నన్ను కల్వచర్లలో ఏ విధంగా ఆప్యాయతతో పలకరించారో అక్కడా ఆయన నివాసంలో అంతే ప్రేమతో మాట్లాడేవారు. వారం రోజులు నన్ను ఆయన వెంటే ఉండమన్నరు. ప్రతి రోజూ రాత్రి నాతోనే కలిసి భోజనం చేసేవారు. అక్కడ కూడా ఇక్కడి మాదిరి సాధారణ భోజనమే. అదీ మంథని వంట మనిషే వండేది. అప్పుడు కూడా ‘భాస్కర్ ఏమి కావాలయ్యా’ అని అడిగారు. మీ ఆరోగ్యం కావాలయ్యా అన్న. ‘నా దగ్గరికి చాలా మంది వస్తున్నరు. పెట్రోల్ బంక్ కావాలని, గ్యాస్ ఏజెన్సీలు కావాలని అడుగుతున్నరు. నువ్వేంటయ్యా..’ అని నవ్వారు. మీరు బాగుంటే చాలయ్యా అని అన్నాను. చాలా సంతోషంగా ఆలింగనం చేసుకున్నారు. ఆయన కురిపించిన ప్రేమను ఎన్నటికీ మర్చిపోలేను. ఎందుకో ఆయన చూపించే ప్రేమ ముందు ఏదీ అడగాలనిపించేది కాదు. ఆయనతో కలిసి పనిచేసిన నేను ఆ తర్వాత ఇక అలాంటి నాయకుడిని.. జ్ఞాన సంపన్నుడిని చూడలేదు.