బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Jun 17, 2020 , 02:12:57

కూనారం.. విత్తన వైభవం

కూనారం.. విత్తన వైభవం

lనూతన వరి వంగడాల తయారీలో విజయం l‘కేఎన్‌ఎం 118’తో సరికొత్త చరిత్ర 

lజాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు lరైతన్న ఇంట సిరుల పంట lతాజాగా ‘కేఎన్‌ఎం 733’కి రాష్ట్ర కమిటీ ఆమోదం lచిరు సంచుల దశలో ‘కేఎన్‌ఎం 1638’ 

వందల వంగడాలపై పరిశోధనలు.. మేలు రకం నూతన ఆవిష్కరణలతో కూనారం వరి పరిశోధనా స్థానం విత్తన వైభవాన్ని చాటుతున్నది. సరికొత్త విత్తనాల తయారీతోపాటు నిత్య సలహాలు, సూచనలతో జిల్లా రైతులకు విశిష్ట సేవలందిస్తున్నది. ఇప్పటికే ‘ఎంటీయూ 1010’కు ప్రత్యామ్నాయంగా కూనారం సన్నాలు ‘కేఎన్‌ఎం 118’ను తెచ్చి దిగుబడుల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. తాజాగా మరో రకం ‘కేఎన్‌ఎం 733’ను తీసుకువచ్చి, రైతన్న ఇంట సిరులు కురిపిస్తున్నది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే పరిశోధనా స్థానం సిగలో ‘కేఎన్‌ఎం 1638’ పేరిట మరో నగ వచ్చి చేరబోతున్నది.    - కాల్వశ్రీరాంపూర్‌ 

2007 నుంచి సేవలు.. 

పెద్దపల్లి జిల్లాలో అధికంగా సారవంతమైన నల్లరేగడి, ఎర్ర నేలలు ఉన్నాయి. వరితో పాటు ఆగ్రో ఫారెస్ట్‌పై పరిశోధనలు చేసి వాటి ద్వారా వచ్చే కొత్త వంగడాలను రైతులకు అందించేందుకు ఈ ప్రాంతంలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటి (ఆచార్య ఎన్‌జీ రంగ వ్యవసాయ విశ్వ విద్యాలయం) నేటి ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయంవారి ఆధ్వర్యంలో కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని కూనారం గ్రామ శివారులో 2007లో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రభుత్వం 150ఎకరాల భూమిని కేటాయించింది. అయితే పరిశోధనా కేంద్రంలో 10 నుంచి 15ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తూ రకరకాల విత్తనాలపై పరిశోధనలు చేస్తున్నారు. 

చిరు సంచుల దశలో ‘కేఎన్‌ఎం 1638’.

 శాస్త్రవేత్తలు మరో కొత్త వరి వంగడం ‘కేఎన్‌ఎం 1638’ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 130 రోజుల పంట కాలం కలిగిన ఈ రకం వంగడం రెండో ఏడాది చిరుసంచుల పరీక్షలో ఉంది. స్వల్పకాలిక సన్నగింజ రకం కలిగిన ఈ వంగడం వర్షాకాలంలో జూన్‌20 నుంచి జులై రెండో వారం వరకు, యాసంగిలో అయితే నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 20 దాకా నార్లు పోసుకోవచ్చు. ఈ రకం తక్కువ గింజరాలే గుణం కలిగి ఉండి, తక్కువ చేనుమీద పడిపోయే గుణం కలిగి ఉంటుంది. కొంతవరకు ఉల్లి కోడు, అగ్గి తెగులును తట్టుకుంటుంది. నేల సారవంతాన్ని బట్టి ఎకరాకు 28-34క్వింటాళ్ల దిగుబడి ఇవ్వడమే కాకుండా తక్కువ నూకశాతం , అన్నం రుచి కలిగి ఉంటుంది.  ఇవేగాక వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో వర్షమాపిని, సీడ్‌ ప్రాసెసింగ్‌ మిషన్‌ ఉంది. నెల వారీగా వర్షపాతం వివరాలను అధికారులకు తెలియజేస్తున్నారు. సీడ్‌ ప్రాసెసింగ్‌ మిషన్‌ ద్వారా కేంద్రంలో పండించిన పంటను ప్రాసెసింగ్‌, విత్తన శుద్ధి చేసి జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల రైతులకు విక్రయిస్తుండగా, రైతులు అధిక దిగుబడి సాధించి, ఎక్కువ ఆదాయం పొందుతున్నారు.

‘బీపీటీకి 5204’కు ప్రత్యామ్నాయంగా ‘కేఎన్‌ఎం 733’ 

కూనారం పరిశోధనా స్థానంలో మరో విత్తనం అందుబాటులోకి వచ్చింది.‘బీపీటీకి 5204’కు ప్రత్యామ్నాయంగా పరిశోధించి రూపొందించిన ‘కేఎన్‌ఎం 733’ వరి రకం రైతన్నకు అధిక దిగుబడులు తెచ్చిపెడుతున్నది. ‘కేఎన్‌ఎం 733’కు రాష్ట్ర స్థాయి ఇటీవలే విత్తన కమిటీ ఆమోదం తెలుపగా,  ఇది ప్రస్తుతం కూనారం రైస్‌ 1 పేరుతో రైతులకు అందుబాటులో ఉంచారు. ఇది కూడా బీపీటీ కంటే నెల రోజులు ముందుగా అంటే 120 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. వానాకాలం, యాసంగి పంటలకు అనువైన ఈ రకాన్ని వర్షాకాలం అయితే జూన్‌20 నుంచి జులై 20 తేదీ దాకా, యాసంగిలో అయితే నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 20వ తేదీ దాకా నారు పోసుకునేందుకు అనుకూలం. పంట కాలం 125 నుంచి 130రోజులు కలిగిన ఈ సన్న గింజ రకం అగ్గి తెగులు తట్టుకుంటూ, అన్నం నాణ్యత బాగుండి, పంట చేన్లో పడిపోకుండా ఉంటుంది. 

‘కేఎన్‌ఎం 118’తో సత్ఫలితాలు 

 కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల పరిశోధనకు ఫలితం దక్కింది. ‘ఎంటీయూ 1010’కు ప్రత్యామ్నాయంగా 2015లో కనుగొన్న ‘కేఎన్‌ఎం 118’ (కూనారం సన్నాలు)సన్న రకంతో  రైతులు  అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఈ విత్తనానికి అప్పట్లోనే జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్రంలో ఎన్నోఏళ్లుగా రైతులు సాగు చేస్తున్న ‘ఎంటీయూ 1010’ వరి రకంతో పలు రకాల సమస్యలున్నప్పటికీ గత్యంతరం లేక వాడాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో ఈ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చీడపీడలను తట్టుకునే శక్తి ఉన్న ‘కేఎన్‌ఎం-118’ తయారు చేశారు. దీని పంట కాలం 120 రోజులు, వానకాలంలో అయితే 130 రోజులు ఉంటుంది. ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి నిస్తూ, అగ్గి తెగులు, సుడిదోమ, చలిని సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ రకం విత్తనం జిల్లానేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. పెద్ద సంఖ్యలో రైతులు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. 

విత్తనోత్పత్తిలో మెళకువలు  పాటించాలి

రైతులు ప్రతి సంవత్సరం తమకు కావాల్సిన అధిక దిగుబడులనిచ్చే వరి రకాల విత్తనాలను కొనుగోలు చేసి వాడుతున్నారు. దీని వలన నాణ్యమైన విత్తనం దొరకక పోవడమే కాకుండా, వరి సాగుకు అవసరమైన పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. రైతులు ఆదరణ పొందిన వరి మేలు రకాల విత్తనాన్ని ఉత్పత్తి చేయడానికి కావాల్సిన మెళకువలను తెలుసుకుంటే వారికి కావాల్సిన విత్తనాన్ని వారే తయారు చేసుకుని, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించే అవకాశముంటుంది.- డాక్టర్‌ సిద్ధి శ్రీధర్‌, వ్యవసాయ శాస్త్రవేత్త