శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Jun 15, 2020 , 01:41:29

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే..

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే..

గోదావరిఖని: సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌ పేర్కొన్నారు. సింగరేణి ఇల్లందు క్లబ్‌లో ఆదివారం సింగరేణిలోని 11 ఏరియాల కమిటీలతో సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సమావేశంలో టీబీజీకేఎస్‌ భవిష్యత్‌ కార్యాచరణ, యూనియన్‌ పటిష్టతకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో  మాట్లాడారు. గత ఎన్నికల ముందు గుర్తింపు సంఘం కాల పరిమితి నాలుగేండ్లు ఉండేదని, ఎన్నికల అనంతరం కేంద్ర కార్మిక శాఖ జోక్యం చేసుకొని రెండేళ్లకు కుదించిందని గుర్తు చేశారు. ఈ విషయమై తాము కోర్టుకు వెళ్లామని తెలిపారు. కోర్టు తీర్పు ఎలా వచ్చినా తాము స్వాగతించి మళ్లీ గుర్తింపు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలతో భవిష్యత్‌లో సింగరేణి సంస్థకు ముప్పు వాటిల్లకుండా కాపాడుకునేందుకు చేపట్టబోయే కార్యాచరణపై త్వరలో సీఎం కేసీఆర్‌ కలువనున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం కరోనా ప్యాకేజీ పేరుతో దేశ వ్యాప్తంగా 50 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు  టీబీజీకేఎస్‌ నాయకులు, కార్యకర్తలు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చా రు. సింగరేణిలో మరో కార్మిక సంఘానికి తావులేదని, కార్మికులు ఇప్పటికే నిరూపించారని వివరించారు. ఇది జీర్ణించుకోలేని ఇతర జాతీయ సంఘాలు తమ యూనియన్‌పై తప్పుడు ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. జాతీయ సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాల రూపంలో సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎంతోమంది యువకులు ఉద్యోగాల్లో చేరారని, ఆ కార్మిక కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయన్నారు. కారుణ్య నియామకాలు కొనసాగాలంటే తమను గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని పేర్కొన్నారు. తమ యూనియన్‌లో విభేదాలు లేవని, నిబంధనలు ఎవరు అతిక్రమించినా ఉపేక్షించేది లేదన్నారు.  సమావేశంలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఏరియాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.