బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Jun 15, 2020 , 01:39:41

పత్తి.. సన్న రకం వరి.. ఆయిల్‌పాం

పత్తి.. సన్న రకం వరి.. ఆయిల్‌పాం

పాలకుర్తి: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నియంత్రిత విధానంలో సాగు చేసేందుకు రైతాంగం సిద్ధమవుతున్నది. మూస ధోరణిలో పంటలు వేయకుండా డిమాండ్‌ ఉన్న వాటినే పండించేందుకు ముందుకు సాగుతున్నది. సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో.. వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. నియోజకవర్గంలోని రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాల్లో నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయించేందుకు మండలాల వ్యవసాయాధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. గత 10 రోజులుగా మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుల్లో వేయాల్సిన పంటలపై వివరించారు. ప్రతి గ్రామంలో 60 శాతం దొడ్డు, 40 శాతం సన్నరకం వరినాట్లు వేయాలని సూచించారు. దీనికితోడు పత్తి, పెసర్లు, కందులు, ఇతర కూరగాయలు సాగు చేయాలని తెలిపారు.

వినూత్నంగా పండించేందుకు..

ప్రధానంగా గోదావరినది తీరం వెంట ఉన్న గ్రామా ల్లో సుమారు 3 వేల ఎకరాల్లో వినూత్నంగా ఆయిల్‌పాం పండించేందుకు ఉద్యానవన శాఖ సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా మొదటి విడుతలో 500 ఎకరాలను గుర్తించింది. రామగుండంలో 250 ఎకరాలు, అంతర్గాంలో 125, పాలకుర్తిలో 125 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం రైతులను ఖమ్మం, అశ్వరావుపేటలో సాగవుతున్న ఆయిల్‌పాం తోటలకు ప్రత్యక్షంగా తీసుకెళ్లేందుకు ఎమ్మెలే కోరుకంటి చందర్‌ ముందుకు వచ్చారు. ఆయిల్‌పాం సాగుపై ఇప్పటికే ఎమ్మెల్యే జిల్లా ఉద్యానవన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. దీనితోపాటు ప్రధాన పంటలైన వరి, పత్తి సాగుకు మూడు మండలాల్లో మండల వ్యవసాయశాఖల అధికారులు  గ్రామాల వారీగా జాబితాలు సిద్ధం చేసుకున్నారు. 

ఆయా మండలాల్లో..

రామగుండం అర్బన్‌ ప్రాంతంలో వరి సన్న, దొడ్డురకం కలిపి 3వేల ఎకరాల్లో, పత్తి 200 ఎకరాలు, పెసర్లు, కందులు, కూరగాయలు 100 ఎకరాల్లో సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించారు. అంతర్గాం మండలంలో సన్నరకం వరి 1,765, దొడ్డురకం వరి 2,648 ఎకరాల్లో సాగు చేయనున్నారు. పత్తి 5,667 ఎకరాలు, కందులు 50 ఎకరాలు, కూరగాయలు, ఇతరపంటలు 25 ఎకరాల్లో సాగుచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. పాలకుర్తి మండలంలో సన్నరకం వరి 3,726, దొడ్డురకం వరి 5,589, పత్తి సమారు 6వేలు, పెసర 56, కంది 64 ఎకరాలు, కూరగాయలు 100 ఎకరాల్లో సాగు చేయాలని రైతులకు వివరించారు. పారిశ్రామిక నియోజకవర్గం అయినా పాలకుర్తి, అంతర్గాం మం డలాలతోపాటు, కార్పొరేషన్‌ పరిధిలోని 8 గ్రామాల్లో గతంలో అధిక సంఖ్యలో దొడ్డు రకం వడ్లు, పత్తి మాత్రమే వేసేవారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగానే సాగు చేసేలా రైతాంగానికి వ్యవసాయం అధికారులు అవగాహన కల్పిస్తూ, ప్రోత్సహిస్తున్నారు.