శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Jun 15, 2020 , 00:37:47

సెప్టెంబర్‌లోనే కిసాన్‌ యూరియా

సెప్టెంబర్‌లోనే కిసాన్‌ యూరియా

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/ఫెర్టిలైజర్‌సిటీ/జ్యోతినగర్‌: రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో వచ్చే సెప్టెంబర్‌ నుంచి కిసాన్‌ బ్రాండ్‌ యూరియా ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. 1985లో మూతబడ్డ ఎఫ్‌సీఐ స్థానంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నిర్మాణం పూర్తి చేసుకుంటున్నదని చెప్పారు. రూ.6,120.5 కోట్లతో చేపట్టిన ఈ ఫ్యాక్టరీ పనులు ఇప్పటికే 99.6శాతం పూర్తయినట్లు వివరించారు. ఆదివారం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సహా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, జడ్పీ చైర్మన్‌ మధూకర్‌, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, టీఎస్‌టీస్‌సీ చైర్మన్‌ రాకేశ్‌తో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను సందర్శించారు. ముందుగా మంత్రులకు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఈడీ థాపర్‌, జీఎం విజయ్‌కుమార్‌ బంగారు స్వాగతం పలికారు. కర్మాగారంలోని అమ్మోనియా, గ్యాస్‌ ప్లాంట్‌, తదితర విభాగాలను మంత్రులు పరిశీలించారు.

ఎరువుల కర్మాగారం నిర్మాణ పురోగతిపై సంస్థ ప్రతినిధులు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. అనంతరం ప్లాంట్‌ అధికారులతో సమీక్షించి, మాట్లాడారు. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 15 వరకే ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉండగా, కరోనాతో ప్లాంట్‌ కమిషన్‌ పనులు ఆలస్యమయ్యాయని చెప్పారు. లేదంటే ఈ వానకాలం పంటకే కిసాన్‌ బ్రాండ్‌ ఎరువులు అందుబాటులోకి వచ్చేవని వివరించారు. విదేశాల నుంచి నిపుణుల సహకారం, సాంకేతిక వినియోగానికి ఇటలీ, డెన్మార్క్‌ నుంచి ప్రతినిధులు రావాల్సి ఉందన్నారు. జూలై చివరి కల్లా అమ్మోనియా ప్లాంట్‌, ఆగస్టు చివరినాటికి యూరియా ప్లాంట్‌ను నెలకొల్పి సెప్టెంబర్‌లో ఉత్పత్తిలోకి తేవాలని ఆదేశించారు. ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే ప్రతి రోజూ 2,200 మెట్రిక్‌ టన్నుల అమ్మోనియా, 3,850మెట్రిక్‌ టన్నుల యూరియా ఉత్పత్తిలోకి వస్తుందని, తెలంగాణ రైతాంగానికి ఎరువుల కొరతే ఉండదని, పుష్కలంగా అందుబాటులో ఉంటాయన్నారు.

రైతు వేదికలు దేశానికే దిక్సూచి

రైతులను సంఘటితం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్మిస్తున్న రైతు వేదికలు దేశ రైతాంగానికే దిక్సూచిగా నిలువనున్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీపీసీ మేడిపల్లిలో 20 గుంటల స్థలంలో  రైతు వేదిక ఏర్పాటుకు భూమిపూజ చేసి విలేకరులతో మాట్లాడారు. లాభసాటి పంట దిగుబడి, సాగులో వస్తున్న నూతన పద్ధతులపై శాస్త్రీయ అవగాహనకు వేదికలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. అనంతరం ప్రపంచ రక్తదాన దినోత్సవం పురస్కరించుకొని, మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు విజయమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఖనిలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి హాజరయ్యారు. ఇక్కడ 30 మంది యువకులు రక్తదానం చేయగా, అభినందించడంతోపాటు ఫౌండేషన్‌ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో మేయర్‌ అనిల్‌కుమార్‌, సీపీ సత్యనారాయణ, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌ రావు, బల్దియా కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, ఏసీపీ ఉమేందర్‌, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ చీఫ్‌ మేనేజర్‌ సోమన, ఇన్‌చార్జి డీఆర్వో నరసింహారెడ్డి, డీఏవో తిరుమలప్రసాద్‌, సహకార అధికారి చంద్రపకాశ్‌రెడ్డి, కార్పొరేటర్‌ పద్మ, జడ్పీటీసీ నారాయణ, తహసీల్దార్‌ రవీందర్‌ ఉన్నారు.