ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Jun 12, 2020 , 03:23:19

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి

  • n మంత్రి ఈశ్వర్‌..
  • n వెల్గటూర్‌ మండలంలో  అభివృద్ధి పనులకు  శంకుస్థాపన
  • n టీఆర్‌ఎస్‌లో చేరికలు
  • n కార్యకర్తలు సైనికుల్లా  పని చేయాలని పిలుపు

ధర్మపురి: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. వెల్గటూర్‌ మండలంలోని కిషన్‌రావ్‌పేటలో 1కోటీ 80లక్షల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్‌ పాలనలో పల్లెల రూపురేఖలు మారాయన్నారు. ప్రతి పల్లె అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేశారన్నారు. కిషన్‌రావ్‌పేటలో రూ.1 కోటీ 80 లక్షలతో సీసీ రహదారులు, మురుగుకాలువలు, కప్పార్రావ్‌పేట నుంచి కిషన్‌రావ్‌పేట వర కు బీటీ రోడ్డు, మహిళాసంఘ, మున్నూరుకాపు సంఘ భవనాలకు శంకుస్థాపన చేశారు.

పథకాలు ప్రతి గడపనూ ముద్దాడాలి..

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ సర్కారు దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం పేదప్రజల గడపను ముద్దాడాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వెల్గటూర్‌ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన టీపీసీసీ సభ్యుడు, మాజీ సర్పంచ్‌ చుక్క శంకర్‌రావు, చర్లపల్లి, జగదేవ్‌పేటలోని ఆయన అనుచరులు దాదాపు 400 మంది గురువారం మంత్రి ఈశ్వర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారన్నారు. సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. 

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

వెల్గటూర్‌ మండలంలోని అంబారిపేట, జగదేవ్‌పేట, ముత్తునూర్‌, పడకల్‌, పైడిపల్లి, పాశిగామా గ్రామాలకు చెందిన ఏడుగురు లబ్ది రూ.7లక్షల 812 కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ‘ఫర్‌ ద పీపుల్‌' ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు లింగంపల్లి చందు తాత లింగంపల్లి రాజయ్య జ్ఞాపకార్థం 50 మంది భవన నిర్మాణ కార్మికులకు ఐదేళ్ల వరకు ఉచిత ఇన్సూరెన్స్‌తో కూడిన లేబర్‌కార్డులను మంత్రి ఈశ్వర్‌ అందజేశారు. భవన నిర్మాణ కార్మికుడు బొంగోని దేవయ్య ఇటీవల మృతి చెందగా..ఆయన భార్య లక్ష్మికి డెత్‌ బెనిఫిట్‌ కింద రూ.1లక్షా30వేల చెక్కును అందజేశారు. కిషన్‌రావ్‌పేటకు చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త పాదం రవీందర్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ఆయన భార్య లక్ష్మికి పార్టీ తరఫున రూ.2లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమాల్లో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పొనుగోటి శ్రీనివాసరావు, ఎంపీపీ లక్ష్మీ, జడ్పీటీసీ సుధారాణి, నాయకులు జగన్‌ తదితరులున్నారు.