శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Jun 11, 2020 , 02:01:32

3,60,000 క్వింటాళ్లు కొనుగోలు

3,60,000 క్వింటాళ్లు కొనుగోలు

n రామగుండం నియోజకవర్గంలో పెరిగిన సాగు విస్తీర్ణం, దిగుబడి

n ధాన్యం సేకరణ ముగింపు

సకాలంలో ఎస్సారెస్పీ నీరు విడుదల చేయడం, ఎరువులు, విత్తనాలు అందడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అన్నింటినీ సద్వినియోగం చేసుకున్న రైతులు కంటికి రెప్పలా వరిని కాపాడుకోవడంతో దిగుబడి సమృద్ధిగా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి జీపీ పరిధిలో కొనుగోలు కేంద్రం పెట్టడంతో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను అధికార యంత్రాంగం పక్కాగా పూర్తి చేసింది. రామగుండంరూరల్‌: రామగుండం, అంత ర్గాం, పాలకుర్తి మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ముగిశాయి. ఖరీఫ్‌ సీజన్‌లో అనుకూల వర్షాలతోపాటు, శ్రీరాంసాగర్‌ ఆయకట్టుకు అధికంగా సాగునీరు సరఫరా కావడంతో ధాన్యం దండిగా పండింది. ఏప్రిల్‌ 2న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఒకేసారి అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు.  అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు పూర్తి అయ్యాయి. ఈ ఏడాది ముందస్తుగా ప్రభుత్వం ఐకేపీతోపాటు, కన్నాల, మేడిపల్లి పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో రామగుండం, అంత ర్గాం, పాలకుర్తి మండలాల్లో కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసింది. రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని గ్రామాల్లో 8, అంతర్గాంలో 13, పాలకుర్తిలో 20 కొనుగోలు కేంద్రాలు నిర్వహించారు. నియోజకవర్గంలో మొత్తం 41 కొనుగో లు కేంద్రాల్లో సుమారుగా 3,60,000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. గతేడాది రామగుండం, అంతర్గాం, పాలకుర్తిలో 24 కొనుగోలు కేంద్రాల్లో 2,20,000 క్వింటాళ్లు ధాన్యం కొనుగోలు చేశారు. ఈ ఏడాది అదనంగా 1.40,000 క్వింటాళ్లు సేకరించారు. ప్రతి గ్రామ పంచాయతీకి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పా టు చేయడంతో, రెండు నెలలుగా అధికారులు, సహకార సంఘం, ఐకేపీ సిబ్బంది, హమాలీలు మండుటెండలనూ లెక్కచేయకుండా ధాన్యం కొనుగోలు చేశారు. సమీపంలోని పెద్దపల్లి, సుల్తానాబాద్‌, గోదావరిఖనిలోని రైస్‌ మిల్లులకు తరలించారు.

అదనంగా పంట ..

రామగుండంలో గతేడాది 1851, అంతర్గాంలో 2290, పాలకుర్తిలో 5560 ఎకరాల్లో వరి పండించారు. మొత్తం మూడు మండలాల్లో కలిపి 9701 ఎకరాల్లో వరిసాగుచేయగా, ఈ ఏడాది రామగుండంలో 2508 ఎకరాలు, అంతర్గాం 3800, పాలకుర్తి 9200 ఎకరాల్లో సాగు చేశారు. రికార్డుస్థాయలో 15,508 ఎకరాల్లో సాగు అయింది. గతేడాది కంటే ప్రస్తుతం 5807 ఎకరాల్లో అదనంగా వరి వేశారు.

ఆటంకం కలుగకుండా..

మేడిపల్లి, కన్నాల పీఏసీఎస్‌లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులకు ఆటంకం కలుగకుండా ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాం. పలు చోట్ల అకాల వర్షంతో ధాన్యం తడిసినా ప్రభుత్వ సూచన మేరకు కోత, కట్టింగ్‌ లేకుండా సేకరించాం. వరుస క్రమంలో రైతులకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. 

- జయప్రకాశ్‌రెడ్డి, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌