మంగళవారం 27 అక్టోబర్ 2020
Peddapalli - Jun 10, 2020 , 04:00:28

అద్భుత నగరంగా తీర్చిదిద్దుతాం

అద్భుత నగరంగా తీర్చిదిద్దుతాం

lస్మార్ట్‌సిటీలో పెద్ద ఎత్తున  పనులు చేపడతాం

lకేసీఆర్‌ ఐలాండ్‌ పేరుతో  అల్గునూర్‌ చౌరస్తాను అభివృద్ధి చేస్తాం

lడ్యాం కట్ట ప్రాంతమంతా సుందరీకరిస్తాం 

lమంత్రి గంగుల కమలాకర్‌

కార్పొరేషన్‌ : రానున్న రోజుల్లో కరీంనగర్‌ను రాష్ట్రంలోనే అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్మార్ట్‌సిటీ అర్హత లేకున్నా సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌పై ఉన్న ప్రేమతో ప్రత్యేక చొరవ తీసుకొని స్మార్ట్‌సిటీ హోదా ఇప్పించారన్నారు. స్మార్ట్‌సిటీ పనుల్లో వరంగల్‌ కంటే ఎంతో ముందున్నామని తెలిపారు. స్మార్ట్‌సిటీ విషయంలో కొందరు రాష్ట్ర స్థాయి నుంచి ప్రధాన మంత్రి వరకు ఫిర్యాదు చేశారని, అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదంటేనే ఈ పనుల్లో ఎక్కడా అక్రమాలు జరగలేదని తెలుస్తుందన్నారు. సోమవారం జరిగిన స్మార్ట్‌సిటీ బోర్డు మీటింగ్‌లో పాత ఐదు ప్రాజెక్టులకు ఆమోదం తెలుపగా, కొత్తగా 5 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతుల ఇచ్చారని తెలిపారు. అల్గునూర్‌ చౌరస్తాను పవిత్ర స్థలంగా భావించి కేసీఆర్‌ ఐలాండ్‌గా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. మానేరుపై ఉన్న మూడు బ్రిడ్జిలను, ఎన్‌టీఆర్‌ చౌరస్తా వరకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని, మానేరు రివర్‌ ఫ్రంట్‌లో భాగంగా అల్గునూర్‌ బ్రిడ్జి నుంచి డ్యాం కట్ట వెంట పద్మనగర్‌ వరకు ఉన్న 4.5 కిలోమీటర్లను సుందరంగా మారుస్తామని స్పష్టం చేశారు. పద్మనగర్‌ నుంచి ఉజ్వల పార్కు వరకు కట్ట వెంట 20 ఫీట్లతో వాకింగ్‌ ట్రాక్‌ను, ఉజ్వల పార్కు నుంచి అల్గునూర్‌ బ్రిడ్జి వరకు వాటర్‌ బోటింగ్‌ అభివృద్ధి చేస్తామన్నారు. నగరంలో 24 గంటల మంచినీటి సరఫరా, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, నగరంలో ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలుకు పరిపాలనా అనుమతులు ఇచ్చారన్నారు. వీటితో పాటు రూ.3.20 కోట్లతో మల్టీపర్పస్‌ స్కూల్‌, రూ.7.70 కోట్లతో ఇంకుడు గుంతల నిర్మాణం చేస్తామన్నారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కింద నగరంలోని డంప్‌యార్డులో ఉన్న 2 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను, ప్రతి రోజూ వచ్చే 150 మెట్రిక్‌ టన్నుల చెత్తను క్లీనింగ్‌ చేస్తామని చెప్పారు. రూ.11.30 కోట్లతో ఈ-లర్నింగ్‌, స్మార్ట్‌ తరగతుల కోసం పనులు చేపడతామని తెలిపారు. నగరంలో రూ.21 కోట్లతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, రూ.5.60 కోట్లతో ట్రాఫిక్‌ సిగ్నల్‌ త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. రూ.53 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామన్నారు. నాణ్యత విషయంలో లోపాలు ఉన్నట్లు దృష్టికి తీసుకువస్తే విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో మేయర్‌ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌, కార్పొరేటర్లు  చాడగొండ బుచ్చిరెడ్డి, ఆకుల నర్మద, గందె మాధవి, వాల రమణారావు, ఐలేందర్‌ యాదవ్‌, నాంపెల్లి శ్రీనివాస్‌,వంగల శ్రీదేవి, దిండిగాల మహేశ్‌, బోనాలశ్రీకాంత్‌, యాదయ్య పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేత

అల్గునూర్‌ బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన గండి శ్రీనివాస్‌ కుటుంబానికి ఎస్సారార్‌ డిగ్రీ కళాశాల 1990-93 బ్యాచ్‌కు చెందిన డిగ్రీ మిత్రులు   రూ.4 లక్షల ఆర్థిక సహాయాన్ని మంగళవారం మంత్రి మీ సేవా కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్‌ చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో ఎస్సారార్‌ మిత్రబృందం వంగపల్లి ఉమ, స తీశ్‌, వేణుగోపాల్‌ రావు, శ్రీనివాస్‌,రామాంజనేయులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.


తాజావార్తలు


logo