ఆదివారం 06 డిసెంబర్ 2020
Peddapalli - Jun 09, 2020 , 02:23:31

కాంట్రాక్ట్‌ కార్మికుల సమ్మెకు మద్దతు

కాంట్రాక్ట్‌ కార్మికుల సమ్మెకు మద్దతు

nసమస్యలు తెలుసుకున్న ఎంపీ బొర్లకుంట, ఎమ్మెల్యే కోరుకంటి

nకేశోరాం ప్లాంట్‌ హెడ్‌తో సుదీర్ఘచర్చలు 

nలాక్‌డౌన్‌ వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ 

nరెండ్రోజుల్లో పరిష్కరిస్తామని హామీ 

పాలకుర్తి : బసంత్‌నగర్‌ కేశోరాం సిమెంట్‌ కర్మాగారం కాంట్రాక్ట్‌ కార్మికులు ఐదురోజులుగా చేస్తున్న సమ్మెకు  సోమవారం పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మద్దతుగా నిలిచారు. లాక్‌డౌన్‌కాలం వేతనం చెల్లించాలని, మూడేళ్లుగా నిలిచిపోయిన పదోన్నతులు, బేసిక్‌ రేట్లు ఇవ్వాలని, నెలకు 25 రోజులు పని  కాంట్రాక్ట్‌ కార్మికులు ఆరురోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. కర్మాగారంలోని రెండు యూనియన్ల అధ్యక్షులు ఎం.ఎస్‌.రాజ్‌ఠాకూర్‌, కౌశిక హరి, స్థానిక ఎంపీపీ వ్యాల్ల అనసూర్య, టీఆర్‌ఎస్‌ నాయకులు కార్మికులు మద్దతుగా నిలిచి అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపినా సానుకూలత రాలేదు. దీంతో సమస్య తీవ్రతను గుర్తించిన ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ స్పందించి, స్వయంగా కర్మాగారానికి వచ్చి సుమారు 3 గంటల సేపు కేశోరాం ప్లాంట్‌ హెడ్‌ రాజేగర్గ్‌, హెచ్‌ఆర్‌ జీఎం గోవిందరావుతో చర్చలు జరిపారు. కార్మికులకు లాక్‌డౌన్‌ వేతనం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కర్మాగారం సీఎఫ్‌వో, డైరెక్టర్‌తో మాట్లాడారు. ఈ తర్వాత, రెండురోజులు గడువు కావాలని, లాక్‌డౌన్‌ వేతనం అందజేస్తామని అధికారులు కార్మికుల సమక్షంలో హామీ ఇచ్చారు. కార్మికులు సమ్మె విరమించాలని కర్మాగారం అధికారులు కోరారు. చర్చల్లో రామగుండం మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, ఎంపీపీ వ్యాల్ల అనసూర్య, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, వైస్‌ ఎంపీపీ ఎర్రం స్వామి, సర్పంచ్‌ దుర్గం జగన్‌, ఎంపీటీసీ దుర్గం కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తంగెడ అనిల్‌రావు, వ్యాల్ల రాంరెడ్డి, దేవి లక్ష్మీనర్సయ్య, మాదాసు అరవింద్‌, ఆడేపు నగేశ్‌ తదితరులు పాల్గొన్నారు. అయితే, మూడేళ్లలో పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అప్పటివరకు సమ్మె విరమించేది లేదని, ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని యూనియన్‌ నాయకులు స్పష్టం చేశారు. 

సింగరేణిలో..

గోదావరిఖని : రామగుండం రీజియన్‌లోని సింగరేణి ఓసీపీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుతో కలిసి కాంట్రాక్ట్‌ కార్మికులతో సమావేశం నిర్వహించారు. కార్మికుల సమస్యలపై ఓబీ కాంట్రాక్ట్‌లతో చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ కార్మికులు తమకు గతం కంటే మెరుగైన ఒప్పందం కావాలని చెప్పారన్నారు. కార్మికులకు నామమాత్రంగా ఉన్న వసతులను మెరుగుపర్చడంతోపాటు వేతనాల పెంపు, వైద్య సదుపాయం, క్యాంటీన్‌ తదితర అంశాలపై చర్చించారు. ఈ నెల 13న జరిగే సమావేశంలో కాంట్రాక్ట్‌ కార్మికులు కోరుకున్న విధంగా ఒప్పందం జరుగుతుందన్నారు. ఒక్కో కుటుంబానికి రూ. 40 లక్షల పరిహారంతోపాటు కాంట్రాక్ట్‌ ఉద్యోగం ఇప్పించడంలో సఫలీకృతం అయ్యామన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్‌, సాగంటి శంకర్‌, దాసరి రాయలింగు, సత్యనారాయణ, కాంట్రాక్ట్‌ సంఘాల నాయకులు ఉన్నారు.