బుధవారం 08 జూలై 2020
Peddapalli - Jun 03, 2020 , 03:43:51

కాసులు కురిపించే ‘కడక్‌నాథ్‌'

కాసులు కురిపించే ‘కడక్‌నాథ్‌'

  • లాభాలనిస్తున్న నల్ల కోళ్ల పెంపకం 
  • ఉమ్మడి జిల్లాలో పలువురు యువకుల ఆసక్తి 
  • ఫాంలతో స్వయం ఉపాధి 

పోషక విలువలతోపాటు ఔషధ గుణాలున్న కడక్‌నాథ్‌ కోళ్ల పెంపకం, కాసులు కురిపిస్తున్నది. ఒకప్పుడు మధ్యప్రదేశ్‌ తదితర రాష్ర్టాలకే పరిమితమైన ఈ కాలామాసీ కోడి, ప్రస్తుతం మన దగ్గరా విస్తరించి, చేతి నిండా ఉపాధి చూపుతున్నది. పూర్తి నలుపురంగులో ఉండే ఈ కోడి మాంసానికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండడంతో ఉమ్మడి జిల్లాలోని పలువురు యువకులు ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీలు, పీజీలు చేసినా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా కోళ్లు పెంచుతూ లాభాలు గడిస్తున్నారు. 

పెద్దపల్లి జంక్షన్‌/వీర్నపల్లి

దేశీయంగా ఎంతో ఆదరణ పొందిన కడక్‌నాథ్‌ కోళ్ల పెంపకంలో ఉమ్మడి జిల్లాలోని పలువురు యువకులు రాణిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మం డలం బేగంపేటకు చెందిన పోలుదాసరి దేవేందర్‌ పీజీ దాకా చదివాడు. కోళ్ల పరిశ్రమపై మక్కువతో మొద ట నాటు, సీమ జాతి రకాన్ని పెంచాడు. కడక్‌నాథ్‌ కో ళ్లకు మార్కెట్‌లో మంచి రేటు ఉండడంతో వీటి వైపు మళ్లాడు. తమిళనాడు నుంచి 100 కడక్‌నాథ్‌  కోడి పిల్లలను కొనుక్కొచ్చి, పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌ శివారులోని మామిడి తోటను లీజుకు తీసుకొని షెడ్డు వేసి పెంచుతూ, లాభాలు పొందుతున్నాడు. 

చిన్నవయసులో పెద్ద ఆలోచన..

వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన ప్రవీణ్‌ పదో తరగతి దాకా చదివాడు. తన సోదరుడు వేణు, మిత్రుడు కర్నూలువాసి కడక్‌నాథ్‌ కోళ్ల పెంపకంలో లాభాలు సాధిస్తున్నాడని తెలుసుకున్నాడు. ఇదే ఉత్త మ మార్గమని భావించి కర్నూలు నుంచి 100 కోడి పిల్లలను కొనుగోలు చేసి ఇంటిపక్కనే పశువులపాక లో పెంచుతూ ఎదిగిన కోళ్లను మార్కెట్‌లో విక్రయి స్తూ ఉపాధి పొందున్నాడు. కోడిగుడ్లను పొదిగే ఇం క్యుబేటర్‌కు బయట మార్కెట్‌లో రూ.2లక్షలు అవుతుండడంతో తానే తయారు చేయాలని నిర్ణయించి సోదరుడు వేణు సాయంతో రూ.8వేలతోనే ఇంక్యుబేటర్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పాడు. అలాగే పెద్దపల్లి మండలం కాసులపల్లికి చెందిన అమిరిశెట్టి అరవింద్‌ సైతం ఇదే స్వయం ఉపాధిగా ఎంచుకున్నాడు. మైనింగ్‌ డిప్లొమా చేసిన అరవింద్‌ రెండేళ్లుగా తన ఇంటి ఆవరణలోనే నల్లకోళ్లను పెంచుతూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు. 

కోడి ప్రత్యేకత.. 

కడక్‌నాథ్‌ కోడి మధ్యప్రదేశ్‌ రాష్ర్టానికి చెందినది. ముదురు నలుపు, ముదురు నీలం రంగులో ఉండే దీని రక్తం, మాంసం, ఎముకలు కూడా నల్లగానే ఉండడం వల్ల కాలామాసీ అని కూడా పిలుస్తారు. ఇవి ఆరునెలల వయసుకే 1.5 కిలోల బరువు పెరగడంతోపాటు గుడ్లను పెట్టే ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. నెలకు సుమారు 40నుంచి 50 గుడ్లు పెడతాయి. బహిరంగ మార్కెట్లో కిలో కోడి రూ. 500 నుంచి రూ. 600 దాకా పలుకుతుండగా, ఒక్కో గుడ్డు రూ.40 నుంచి రూ.50 దాకా ఉంటుంది.  

పోషక విలువలు మెండు

కడక్‌నాథ్‌ కోడి మాంసంలో పోషక విలువలు, ఔషధగుణాలున్నాయి. మాంసకృత్తులు ఎక్కువ ఉండడంతోపాటు కొవ్వుశాతం తక్కువగా ఉం టుం ది. 18 రకాల అమైనో ఆమ్లాలు, విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, పాస్పరస్‌ వంటివి అధికంగా ఉంటాయి. 

మొదట భయపడ్డ

కడక్‌నాథ్‌ కోళ్లను పెంచేటప్పుడు మొదట కొంచెం భయపడ్డ. కోళ్లు పెరుగుతున్న కొద్దీ ఊరికోళ్లలెక్క మంచిగై నయ్‌. మాకు తెల్వనివాళ్లు సుతం కోళ్లు కొనేందుకు వస్తున్నరు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మాకు కొంచెం వ్యవసాయం కూడా ఉన్నది. అటు వ్యవసాయం చేసుకుంటూ సైడుకు ఏదో ఓ పనిచేయాలని కడక్‌నాథ్‌కోళ్లను పెంచుతున్న. మొదటి సారి 60కోళ్లను అమ్మిన. గుడ్లను కూడా ఇంక్యుబేటర్ల పొదిగిస్తే 40 కోడిపిల్లలు అయినయ్‌. గుడ్లకు కూడా మంచి గిరాకీ ఉంది. 

ఆకుల ప్రవీణ్‌, కోళ్లఫాం నిర్వాహకుడు, రంగంపేట (వీర్నపల్లి )


logo