సోమవారం 06 జూలై 2020
Peddapalli - Jun 03, 2020 , 03:29:02

ఆర్జీ3 పరిధిలోని ఓసీపీలో భారీ పేలుడు

 ఆర్జీ3 పరిధిలోని ఓసీపీలో భారీ పేలుడు

  • బ్లాస్టింగ్‌ కోసం మందుగుండు సామగ్రి  నింపుతుండగా ఒక్కసారిగా విస్ఫోటనం
  • అక్కడికక్కడే నలుగురి దుర్మరణం
  • మరో ఇద్దరికి తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం
  • నీళ్ల కోసమని వెళ్లి ప్రాణాలతో  బయటపడ్డ మరో ఆరుగురు
  • రామగిరి మండలంలో ఘటన
  • మృతులంతా సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికులే  
  • పరామర్శించిన ఎంపీ వెంకటేశ్‌, జడ్పీ చైర్మన్‌ మధు  

విధి వెంటాడింది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులను ఛిద్రం చేసింది.అప్పటిదాకా సరదాగా మాట్లాడుకుంటూ పనిచేసుకుంటున్న వారిని పేలుడు రూపంలో వచ్చిన ప్రమాదం కబలించింది. మంగళవారం రామగుండం రీజియన్‌ రామగిరి మండల పరిధిలోని ఓసీపీ1 ఫేజ్‌-2లో బ్లాస్టింగ్‌ కోసం మందుగుండు సామగ్రి కలుపుతుండగా, ప్రమాదవశాత్తూ భారీ పేలుడు సంభవించింది. ఇందులో నలుగురు సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికులు అక్కడికక్కడే మృత్యువాత పడగా, మరో ఇద్దరు పరిస్థితి విషమంగా మారింది. నీళ్లకోసమని వెళ్లి మరో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడగా, బంధువుల రోదనలతో గోదావరిఖని  దవాఖాన దద్దరిల్లింది. 

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/గోదావరిఖని/ ఫెర్టిలైజర్‌సిటీ/రామగిరి 

కోల్‌బెల్ట్‌ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రామగుండం రీజియన్‌లోని సింగరేణి ఉపరితల బొగ్గు గనిలో మంగళవారం జరిగిన భారీ పేలుడు నలుగురు సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికులను పొట్టనబెట్టుకున్నది. అధికారులు, కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి ఆర్జీ-3 రామగిరి మండల పరిధిలో ఓసీపీ-1 ప్రాజెక్టు ఉంది. బొగ్గు ఉత్పత్తిలో భాగంగా ఇక్కడ ఫేజ్‌-2లో కాంట్రాక్ట్‌ సంస్థ ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా ఓబీ వెలికితీస్తున్నారు. ఈ క్రమంలో రోజువారీ విధుల్లో భాగంగా 13 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు మంగళవారం ఉదయం 7గంటలకు పనిప్రదేశానికి వెళ్లారు. బ్లాస్టింగ్‌ కోసం సింగరేణి బాస్టింగ్‌ సైట్‌ ఇన్‌చార్జి డిప్యూటీ మేనేజర్‌ మధు సూచనలతో పని మొదలు పెట్టారు. వారికి కేటాయించిన పని ప్రకారం ఆ ప్రాంతంలో 80 హోల్స్‌ వేయాల్సి ఉండగా, ఉదయం 9:45 గంటల వరకు 32 హోల్స్‌ వేసి ఒక్కో రంధ్రంలో ఒక డిటోనేటర్‌తోపాటు పేలుడు పదార్థాలు నింపుతూ వస్తున్నారు. ఏడుగురు కార్మికులు 32వ హోల్‌లోనూ నింపుతుండగా భూమిలోని వేడి తీవ్రతకు భారీ పేలుడు సంభవించి, నలుగురు కాంట్రాక్ట్‌ కార్మికులు కమాన్‌పూర్‌ మండల కేంద్రానికి చెందిన బిళ్ల రాజేశం (45), దాసరిపల్లికి చెందిన బండ ఆర్జయ్య (42), గోదావరిఖనిలోని రమేశ్‌నగర్‌కు చెందిన బండారి ప్రవీణ్‌ (38), భగత్‌నగర్‌కు చెందిన బెల్కివార్‌ రాకేశ్‌ (28) అక్కడికక్కడే మృతిచెందారు. పేలు డు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపో యి, మాంసపు ముద్దలా తయారయ్యాయి. మరో ఇద్దరు కార్మికులు రామగిరి మండలం రత్నాపూర్‌కు చెందిన కొదురుపాక భీమయ్య, కమాన్‌పూర్‌ మండలం శాలపల్లికి చెందిన వెంకటేశ్‌కు తీవ్రగాయాలు కాగా, కమాన్‌పూర్‌ మండలం జూలపల్లికి చెందిన బండి శంకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సైట్‌ ఇన్‌చార్జి డిప్యూటీ మేనేజర్‌ మధు దూరంగా ఉండడంతో ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఘటనకు ఒక నిమిషం ముందు ఆరుగురు కార్మికులు మంచినీళ్లు తాగేందుకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న సీపీ సత్యనారాయణ, డీసీపీ రవీందర్‌, ఏసీపీ ఉమేందర్‌ సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా దవాఖానకు తరలించారు. ఇందులో కొదురుపాక భీమయ్య, వెంకటేశ్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌లోని దవాఖానకు తరలించారు. 

ప్రమాదంపై సమగ్ర విచారణ: సీపీ సత్యనారాయణ

ఓసీపీ -1లో జరిగిన ప్రమాద ఘటనపై సమగ్రం గా విచారణ చేస్తున్నట్లు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఘట నా స్థలాన్ని సందర్శించి విచారించారు. ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడం, ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉండడం దురదృష్టకరమన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ చేపడతామని చెప్పారు. బాధ్యులపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఏసీపీ, సీఐ స్థాయి అధికారులతో విచారణ చేయిస్తామని చెప్పారు.  

మిన్నంటిన బంధువుల రోదనలు..

దవాఖానలో రోదనలు మిన్నంటాయి. సమాచా రం అందుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, బం ధువులు హాస్పిటల్‌కు చేరుకోగా, ప్రాంగణం కిక్కిరిసింది. తమవారిని తలచుకుంటూ రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. 

ప్రముఖుల పరామర్శ..

ఎంపీ వెంకటేశ్‌నేతకాని, జడ్పీ చైర్మన్‌ మధు, ఎమ్మెల్యేలు చందర్‌, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, బీఎంఎస్‌ నాయకుడు కెంగర్ల మల్ల య్య, ఐఎన్‌టీయూసీ నేత జనక్‌ ప్రసాద్‌, జడ్పీటీసీ సంధ్యారాణి దవాఖానకు వచ్చి మృతుల కు టుంబాలను ఓదార్చారు. మృతదేహాలను పరిశీలించారు. క్షతగాత్రులను కలిసి ప్రమాదం జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాణపాయ స్థితిలో ఉన్న కార్మికులకు అత్యవసర ఉన్నత వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.  

విచారకరం: ఎమ్మెల్యే

కాంట్రాక్ట్‌ కార్మికులు మృతి చెందడం విచారకరమని ఎమ్మెల్యే చందర్‌ పేర్కొన్నారు. గోదావరిఖని ఏరియా దవాఖానలో మృతదేహాలను పరిశీలించి, మాట్లాడారు. ఓసీపీ-1లో పనులు నిర్వహిస్తున్న మహాలక్ష్మీ కాంట్రాక్ట్‌ సంస్థతో పాటు సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే ప్రమాదం జరిగిందన్నారు. మృతుల కుటుంబాలకు ఆదుకుంటామని, న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పారు.

నీళ్లకు పోయి బతికిన..

ఈ రోజు 15మందికి బదులుగా 13మందిమే డ్యూటీకి వచ్చినం. నేను నా  బామ్మర్ది రాకేశ్‌తో కలిసి వచ్చిన. మా పని చేసే ఇంకో ఇద్దరు ఇయ్యాల రాలె. అందరం కలిసి బ్లాస్టింగ్‌ పాయింట్‌ వద్దకు పోయినం. అక్కడ రోజు లెక్కనే ఫైర్‌ ఓల్స్‌ వేసి డిటోనేటర్‌ను వేసినం. ఆ సమయంలో నేనూ ఇంకో ఆరుగురం కలిసి నీళ్లు తాగడానికి పోయినం. నీళ్లు తాగి అక్కడనే కూసున్నం. అంతే భారీ శబ్దం వచ్చింది. అక్కడ మాతో పనిచేసే టోళ్లు నలుగురు మాంసం ముద్దలుగా మారిపోయిన్రు. పని వద్దే ఉన్న నా బామ్మర్ది రాకేశ్‌ చనిపోయిండు. నేను నీళ్లు తాగేందుకు పోకపోతే ఇయ్యాల నేను గూడ సచ్చిపోదు. 

వినోద్‌, భగత్‌నగర్‌ (గోదావరిఖని)
logo