మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - May 29, 2020 , 01:33:36

పల్లె నుంచి ప్రపంచస్థాయికి..

పల్లె నుంచి ప్రపంచస్థాయికి..

బహుముఖ ప్రజ్ఞతో రాణిస్తున్న యువకుడు

 సామాజిక చైతన్యమే ధ్యేయంగా కార్టూన్లు

 ఎలక్ట్రీషియన్‌గా అసమాన నైపుణ్యం

అతడిది ఓ చిన్న గ్రామం.. మధ్యతరగతి కుటుంబం. అయినప్పటికీ, సామాజిక చైతన్యం కోసం తన వంతుగా కృషి చేయాలని సంకల్పించాడు. అందుకు చిత్రకళను ఎంచుకున్నాడు. వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్‌గా పనిచేసుకుంటూనే కార్టూన్లు గీస్తూ జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రదర్శనలిస్తూ రాణిస్తున్నాడు. తన ప్రతిభ, నైపుణ్యాలతో మట్టిలో మాణిక్యం అనే సామెతకు నిదర్శనంగా నిలిచాడు. - హుజూరాబాద్‌ టౌన్‌

హుజూరాబాద్‌ మండల చెల్పూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని తోకలపల్లికి చెందిన కొండ రవిప్రసాద్‌ హుజూరాబాద్‌ పట్టణంలోని డీసీఎంఎస్‌ కాంప్లెక్స్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తుంటాడు. రోజంతా పనిలో బిజీగా ఉన్నప్పటికీ రెండు మూడు గంటలైనా పెన్సిల్‌ పట్టనిదే నిద్రపోడు. దినపత్రికలు, వారపత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురితమయ్యే కార్టూన్లను గమనిస్తూ నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. తాను గీసిన కార్టూన్లు వార, మాస పత్రికల్లో ప్రచురితం కావడంతో తన ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటూ అంతర్జాతీయ కార్టూన్ల పోటీల్లోనూ విజేతగా నిలిచాడు.

రవిప్రసాద్‌ ప్రతిభా పాటవాలు..

2004లో ఇరాన్‌లో ‘అడిక్షన్‌-2’ పేరిట నిర్వహించిన కార్టూన్‌ పోటీల్లో, 2005లో పోలాండ్‌లో జరిగిన కరీఫిక్‌ కార్టూన్‌ పోటీల్లో ఉత్తమ కార్టూనిస్టుగా ఎంపికయ్యాడు. అదే యేడాదిలో చైనాలోని థర్డ్‌ఎల్‌ఎం కార్టూన్‌ పోటీల్లో ఎక్స్‌లెన్స్‌ అవార్డు అందుకున్నాడు. 2006లో చైనాలో నిర్వహించిన కార్టూన్‌ పోటీల్లో మళ్లీ ఉత్తమ కార్టూనిస్టుగా ఎంపికయ్యాడు. ప్రపంచ క్యారికేచర్‌ పోటీలు గతేడాది చైనాలో నిర్వహించగా, బ్రాంజ్‌ మెడల్‌ అందుకున్నాడు. ప్రొఫెసర్‌ లావోజి క్యారికేచర్‌ గీయగా, 600 యూఎస్‌ఏ డాలర్లు బహుమతిగా పొందాడు. ఈ పోటీకి 2000 చిత్రాలు రాగా, అందులో కొండా రవిప్రసాద్‌ మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఇవే కాక రాష్ట్రంలోనూ వివిధ ప్రాంతాల్లో జరిగిన పోటీలు, కార్యక్రమాల్లో తన కార్టూన్లు ప్రదర్శించి అనేక బహుమతులు, ప్రముఖుల ప్రశంసలు పొందాడు.

సామాజిక చైతన్యమే ప్రధానాంశం 

కొండా రవిప్రసాద్‌ కార్టూన్లు ప్రధానంగా ప్రజలను సామాజికంగా చైతన్యపరిచేలా ఉంటా యి. ఈ కార్టూన్లను ప్రత్యేకంగా ఆయన సోషల్‌మీడియా ద్వారా ప్రచారం చేస్తారు. మద్యపానం, ధూమపానం, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలతో కలిగే అనర్థాలను కళ్లకు కట్టేలా కార్టూన్లు గీశారు. అలాగే మహిళల కోసం ఏర్పడిన షీటీంలు, తాగు, సాగునీటి సంరక్షణ, మొక్కల పెంపకం ఆవశ్యకతను తన కళ ద్వారా చాటుతున్నారు.

బుల్లి మిక్సీ రూపకర్త..

కార్టూనిస్టుగానే కాక 2016లో ప్రపంచంలోనే అతి చిన్న మిక్సీని రూపొందించి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు కొండా రవిప్రసాద్‌. రెండు ఇంచుల పరిమాణంలో, 5 సెంటీమీటర్ల పొడ వు, 5 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఈ మిక్సీ 15 మిల్లీ గ్రాముల పరిమాణం గల వస్తువులను గ్రైండింగ్‌ చేస్తుంది.

ప్రోత్సహిస్తే మరింత ప్రతిభ

ప్రతిభకు పదును పెట్టాలంటే జీవనోపాధి కష్టతరంగా మారుతున్నది. నా సంపాదన మీదే భార్య, కొడుకు బతుకుతారు. ఆర్థిక స్థోమతలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న. ఎన్నో సార్లు జాతీయ, అంతర్జాతీయ కార్టూన్‌ ఎగ్జిబిషన్‌లకు ఆహ్వానం అందినా వెళ్లలేకపోయిన. ప్రభుత్వం గానీ, దాతలు గానీ ఆదుకుని ప్రోత్సహిస్తే రాష్ర్టానికి, దేశానికి ఖ్యాతి తెస్త.     

- కొండ రవిప్రసాద్‌