ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - May 28, 2020 , 06:41:19

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

  • అర్హులందరికీ ఉపాధి కల్పించాలి
  • పెండింగ్‌లో ఉన్న ఇంకుడు గుంతల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలి 
  • కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

పెద్దపల్లి రూరల్‌:  పల్లె ప్రగతి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. పల్లె ప్రగతి నిర్మాణ పనులపై  సం బంధిత అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం అదనంగా ఉపాధి హామీ పనులకు బడ్జెట్‌ కేటాయించిందని తెలిపారు. అర్హులందరికీ ఉపాధి కల్పించాలని సూచించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేయించాలని ఆదేశించారు. కూలీలకు ఓఆర్‌ఎస్‌, మజ్జిగ ప్యాకెట్లు అందించా లని సూచించారు. మే నెలలో ఉపాధి హామీలో  58 వేల మందికి ఉపాధి కల్పించాల్సిన లక్ష్యం ఉండగా, ఇప్పటి దాకా 41,817మందికి కల్పించామని వెల్లడించారు. పల్లెప్రగతి పనులకు సంబంధించిన భూ సమస్యలను తహసీల్దార్లు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పరిష్కరించాలని సూచించారు. ఎస్సారెస్పీ నీళ్లు వచ్చే పరిస్థితులు ఉన్నాయని, కాలువల మరమ్మతు వెంటనే చేపట్టాలన్నారు. జిల్లాలో డీ83, 86, మైనర్‌ డిస్ట్రిబ్యూటరీ కాలువల కింద 205గ్రామ పంచాయతీల పరిధిలో 816 పనులు మంజూరు కాగా 391 పూర్తి చేశామని తెలిపారు. 4,755 ఫీడర్‌చానల్‌ పనులు మంజూ రు కాగా 2,800 పూర్తి చేశామని, మిగతా పనులన్నీ జూన్‌ చివరి నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు సాగాలన్నారు. జిల్లాలో 267 గ్రామ పంచాయతీలకు 183 కంపోస్ట్‌ షెడ్ల నిర్మాణాలు మంజూరు చేశామని తెలిపారు. మిగతా గ్రామాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పూర్తి చేయాలన్నారు. జిల్లాకు 73,311 ఇంకుడు గుంతలు మంజూరుకాగా, 54,245 పూర్తి అయ్యాయని వివరించారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి ఇన్‌చార్జి అధికారి వినోద్‌, జిల్లా పంచాయతీ అధికారి వేముల సుదర్శన్‌ పాల్గొన్నారు.