శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - May 27, 2020 , 02:43:06

‘మత్స్య’ సిరులు

‘మత్స్య’ సిరులు

చెరువుల్లో పుష్కలంగా చేపలు 

ఒక్కోటి 3 నుంచి 6 కిలోల వరకు బరువు 

మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు

గంగాధర/ చిగురుమామిడి : మత్స్యకారులు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సిరులు కురిపిస్తున్నాయి. ప్రతి యేటా చేపపిల్లలను ఉచితంగా అందిస్తుండడంతో పాటు కాళేశ్వరం జలాలలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నింపుతుండడంతో చేపల పంట పండుతోంది. ఒ క్కోటి పది కిలోల వరకు బరువు పెరుగుతుండడంతో మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయి. 

‘నారాయణపూర్‌'లో చేపల పంట

గంగాధర మండలం నారాయణపూర్‌ రిజర్వాయర్‌లో ప్రభుత్వం గతేడాది 50 వేల చేప పిల్లలను వదిలింది. ఏడాది పొడవునా పుష్కలంగా నీరు ఉండడంతో ప్రస్తుతం ఇవి ఒక్కోటి 3 నుంచి 6 కిలోల వరకు పెరిగాయి. కొన్ని 10 కిలోల వరకు ఉన్నాయి. కాగా, సోమవారం ముదిరాజ్‌ సంఘం ఇస్లాంపూర్‌ నారాయణపూర్‌ ఆధ్వర్యంలో రిజర్వాయర్‌లో చేపలు పట్టగా, ఒక్క రోజే 15 క్వింటాళ్ల వరకు పడ్డాయి. ఇందులో బొమ్మె, బంగారుతీగె, బొచ్చె, రవ్వు, మొయ్య, బురుకలు, గురిజెసు, వాలుగు ఉన్నాయి. కరీంనగర్‌కు చెందిన వ్యాపారులు హోల్‌సేల్‌గా కిలో రూ.40 నుంచి రూ.50 చెల్లించి విక్రయించారు.

మెట్ట ప్రాంతంలోనూ మత్స్యసంపద

జిల్లాలో మెట్ట ప్రాంతమైన చిగురుమామిడి మండలంలో ఒకప్పుడు చెరువులు నెర్రెలు బారి కనిపించేవి. ఇక్కడ 11 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నా చేపల ద్వారా వచ్చిన ఆదాయం అరకొర మాత్రమే.. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గతేడాది నుంచి చెరువులు నింపుతుండడంతో జలకళను సంతరించుకుంటున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం 11 లక్షల చేపపిల్లలను వేయడంతో అవి ఇప్పుడు రెండు నుంచి ఐదు కిలోల వరకు పెరిగాయి. ఇందుర్తి, ముదిమాణిక్యం, ఓగులాపూర్‌, ముల్కనూర్‌, చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, నవాబ్‌పేట, సుందరగిరి, కొండాపూర్‌ గ్రామాల్లో మత్స్య సిరులు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సబ్సిడీతో ఇచ్చిన ద్విచక్ర వాహనాలను, టాటా ఏసీలను మత్స్యకారులు చేపలు విక్రయించుకునేందుకు వినియోగించుకుంటున్నారు. 

సర్కారు సాయంతోనే వెలుగులు

రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టిన పథకాలతోనే మా జీవితాల్లో వెలుగులు వచ్చాయి. గతంలో చెరువుల నీళ్లు లేక చేపలు ఉండకపోయేవి. తెలంగాణ సర్కారు వచ్చినంక కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులను నింపుతున్నది. ఉచితంగనే చేప పిల్లలను ఇస్తున్నది. రిజర్వాయర్లు, చెరువుల్లో ఏడాదంతా నీరుండేలా చూడడంతో చేపలు పెద్దగవుతున్నయి.. ఒక్కోటి 3 నుంచి 6 కిలోల వరకు పెరిగినయ్‌.

- దయ్యాల మొండయ్య,    ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు (గంగాధర)