ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - May 25, 2020 , 01:47:02

రోహిణి పంట..సిరులు ఇంట..

రోహిణి పంట..సిరులు ఇంట..

నేడు కార్తె ప్రవేశం.. సాగుకిదే సరైన సమయం

 తొలకరి కోసం చూడాల్సిన పనిలేదు

 ఉమ్మడి జిల్లాల్లో పుష్కలంగా జలాలు

 ఇప్పుడు సాగు ప్రారంభిస్తే మంచి దిగుబడులు

 నియంత్రిత సేద్యమే మేలు 

 డిమాండ్‌ ఉన్న పంటలు వేస్తేనే అధిక లాభాలు

కాలంతో పనిలేదు. తొలకరి కోసం చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా పుష్కలంగా జలాలు.. మండుటెండల్లో మత్తళ్లు దూకుతున్న చెరువులు.. గలగలా పారుతున్న కాలువలు.. నేడు రోహిణి కార్తె ప్రవేశం. వానకాలం సాగుకిదే సరైన సమయం. ఈ కార్తెలోనే ఎవుసం ప్రారంభించాలని, నియంత్రిత సేద్యంవైపు అడుగులు వేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు. ఇంకేం రైతాంగం సరికొత్తగా ‘సాగే’ందుకు సమాయత్తమైంది. నేటి నుంచి సాగును పండుగలా ప్రారంభించేందుకు ఉవ్విళ్లూరుతున్నది.

 కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: ముతక రకాల వరిసాగుకు అలవాటు పడిన రైతులను సన్న రకాల సేద్యానికి సన్నద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి మంచి ఫలితాన్నే ఇస్తున్నది. సన్న రకాలు సాగు చేయాలనుకునే రైతులు రోహిణి కార్తెలోనే నార్లు పోసుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఈ మేరకు కరీంనగర్‌ జిల్లాలో ఇప్పటికే సుమారు 10 వేల ఎకరాల్లో నార్లు పోసుకున్నట్లు ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు వెల్లడించారు. దీన్ని బట్టి రైతులు ముందస్తు సాగుకు సిద్ధమవుతున్నారని స్పష్టంగా తెలుస్తున్నది. జిల్లాలో ఈ వానకాలం సీజన్‌లో 2,22,199 ఎకరాల్లో వరి సాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చర్‌ కార్డును విడుదల చేసింది. ఇందులో 82,199 ఎకరాల్లో సన్న రకాలను సాగు చేయాలని ప్రణాళికలో స్పష్టం చేసింది. ఏ రకం ధాన్యం ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో కూడా జిల్లా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 23,554 ఎకరాల్లో తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048) రకం, 29,170 ఎకరాల్లో సాంబమసూరి (బీపీటీ 5204) 3,775 ఎకరాల్లో జేజీఎల్‌ 384, 3,018 ఎకరాల్లో జేజీఎల్‌ 1798, 4,470 ఎకరాల్లో హెచ్‌ఎంటీ సోనా, 4 వేల ఎకరాల్లో జైశ్రీరాం, మరో 14,212 ఎకరాల్లో ఇతర ఫైన్‌ క్వాలిటీ వరి సాగు చేయాలని కరీంనగర్‌ జిల్లా అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ఈ మేరకు అవసరమైన 19,950 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు. ఇక ముతక రకాల్లో 60 వేల ఎకరాల్లో ఎంటీయూ 1010, 38 వేల ఎకరాల్లో కేఎన్‌ఎం 118 రకాలను సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అగ్రికల్చర్‌ కార్డులో ఆమోదింపజేశారు.  

తొలకరితో పని లేదు..

గతంలో రైతులు పంటలు సాగు చేయాలంటే జూన్‌ వరకు ఆగాల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో గత యాసంగిలో నిరాటంకంగా సాగునీటిని వదిలారు. ఎస్సారెస్పీ దిగువ కాకతీయ కాలువ పరిధిలోని మానకొండూర్‌, శంకరపట్నం, హుజూరాబాద్‌, వీణవంక, సైదాపూర్‌, తదితర మండలాల్లో ఎక్కువ ఆయకట్టు విస్తరించి ఉంది. ఎగువ కాకతీయ కాలువ కింద చొప్పదండి, కరీంనగర్‌ రూరల్‌ మండలంలో ఆయకట్టు ఉంది. యాసంగిలో ఈ మండలాలకు ఆశించిన మేర నీళ్లు వెళ్లాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రామడుగు మండలం లక్ష్మీపూర్‌ పంప్‌హౌస్‌ నుంచి శ్రీ రాజరాజేశ్వర జలాశయంలోకి పెద్ద ఎత్తున నీటిని ఎత్తి పోయించారు. అక్కడి నుంచి ఎల్‌ఎండీకి విడుదల చేశారు. ఇప్పటికీ ఎల్‌ఎండీకి మానేరు ద్వారా నీటిని తరలిస్తున్నారు. మరో గొప్ప విషయం ఏమిటంటే మెట్ట ప్రాంతాలైన కొత్తపల్లి మండలంలోని 8 గొలుసుకట్టు చెరువులకు గతేడాది వాన కాలం నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. లక్ష్మీపూర్‌ నుంచి శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి నీటిని తరలించేందుకు వినియోగించిన వరద కాలువకు గంగాధర మండలం ఆచంపల్లి నుంచి కొత్తపల్లి మండలం నాగులమల్యాల చెరువుకు నీటిని తరలించేందుకు ఫీల్డ్‌ చానల్‌ ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఇటు బెజ్జంకి మండలంలోని తోటపల్లి రిజర్వాయర్‌ నుంచి చిగురుమామిడి, సైదాపూర్‌ మండలాలకు మొదటిసారి కాళేశ్వరం నీళ్లు వచ్చాయి. అనేక చెరువులు నింపి పెట్టారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నేరుగా గంగాధర మండలం నారాయణపూర్‌ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తున్నారు. దీంతో గంగాధర, రామడుగు మండలాల్లోని వందలాది ఎకరాలు సాగులోకి వచ్చాయి. వరద కాలువలకు ఏ విధంగానైతే ఓటీలు ఏర్పాటు చేసి చెరువులు, కుంటల్లోకి నీటిని మళ్లిస్తున్నారో? అదే విధంగా ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువలకు కూడా ఓటీలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు వచ్చినట్లు ఆదివారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. చివరి ఆయకట్టు వరకు కాలువలను ఆధునీకరించేందుకు 100 కోట్లు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వెల్లడించారు. జిల్లాలోని 90 శాతం చెరువులకు ప్రాజెక్టుల కాలువలతో అనుసంధానం జరుగనుంది. రైతులు నార్లు పోసుకునేందుకు వీలుగా ప్రాజెక్టుల నీళ్లు వదిలేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మంత్రులు వెల్లడించారు. దీంతో రైతన్నలు వర్షాల కోసం ఎదురు చూడకుండా ప్రాజెక్టు నీటిపై భరోసా పెంచుకుని సాగుకు సన్నద్ధమవుతున్నారు. 

రోహిణి ‘సాగు’తో లాభాలు 

రోహిణి కార్తెలో పంట సాగు ప్రారంభిస్తే అనేక లాభాలుంటాయి. ఈ కార్తెలో నార్లు పోసుకుని జూన్‌ 20 తర్వాత నాట్లు వేసుకుంటే సెప్టెంబర్‌ చివరి వారం, అక్టోబర్‌ మొదటి వారంలో పంటలు చేతికి వస్తాయి. పంట కాలం ముందుగా ప్రారంభించడం వల్ల చీడ పీడలు, తెగుళ్ల బెడద తక్కువ ఉంటుంది. రెండో పంట సాగు కోసం నెల రోజుల వ్యవధి ఉంటుంది. దీంతో నేలలో సారం పెరిగి రెండో పంట దిగుబడులు కూడా పెరిగే అవకాశాలుంటాయి. గతేడాది రోహిణి కార్తెలో నాలుగైదు వందల ఎకరాలు కూడా దాటని వరి నార్లు ఇప్పుడు ఏకంగా పది వేల ఎకరాలు దాటింది. నీటి వసతి పుష్కలంగా ఉన్న హుజూరాబాద్‌ డివిజన్‌లో ఎక్కువగా నార్లు పోసుకున్నారు. రోహిణి ప్రవేశంతో నార్లు పోసుకునే వారి సంఖ్య మరింత పెరగవచ్చు.

- వాసిరెడ్డి శ్రీధర్‌, డీఏవో (కరీంనగర్‌)

ముందుగా నాటేస్తే దండిగా పంట..  

ముందస్తుగా వరి నాటేస్తే దండిగా పంట పండుతది. రోహిణి కార్తెలో నాటేసేందుకు నారు అలుకుతున్న. రోహిణిలో సాగు చేసిన పంటకు ఢోకా ఉండదు. దిగుబడి ఎక్కువ వస్తది. కేసీఆర్‌ సారు దయతో ఎవుసానికి ఎనుకటి రోజులు వచ్చినయ్‌. కాళేశ్వరం నీళ్లతో ఆకాశం దిక్కు చూడకుండా సాగు పనులు మొదలు పెట్టచ్చు. కాకతీయ కాలువ తవ్వినప్పటి నుంచి పంటలకు ఆరునెలలు నీళ్లు రావడం ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. టీఆర్‌ఎస్‌ సర్కారు రైతుల బాగు కోసం తపిస్తున్న తీరు మరువలేనిది. 

-గోలి సమ్మిరెడ్డి, కందుగుల (హుజూరాబాద్‌)