మంగళవారం 26 మే 2020
Peddapalli - May 21, 2020 , 05:33:53

బీళ్లన్నీ సాగు కావాలి

బీళ్లన్నీ సాగు కావాలి

కాళేశ్వరం జలాలు ముద్దాడిన తొలి జిల్లా కరీంనగర్‌

రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌ 

వ్యవసాయ ప్రణాళికపై అధికారులతో సమీక్షా సమావేశం

25 నుంచి నీటి విడుదల చేయాలని ఆదేశం

జిల్లాలోని చెరువులన్నింటినీ నింపి, బీడు భూములను సాగులోకి తేవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో వానకాలం పంటల సాగుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వ్యవసాయ ప్రణాళిక వివరాలు వెల్లడించారు.   

(కరీంనగర్‌, నమస్తే తెలంగాణ)

జిల్లాలోని చెరువులను నింపేందుకు అవసరమైతే ఈ నెల 25 నుంచి ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేయాలని మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌ ఆదేశించారు. వానకాలం పంటల సాగుపై కరీంనగర్‌ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మంత్రి ఈటల మాట్లాడుతూ, వాన కాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్‌ ప్రారంభించిన వెంటనే మొదట ఆయా ప్రాజెక్టుల పరిధిలోని చెరువులన్నింటినీ నింపాలని ఆదేశించారు. అవసరమైతే ఈ నెల 25 నుంచి నీటిని విడుదల చేయాలని సూచించారు. పంజాబ్‌లోని బాక్రానంగల్‌ ప్రాజెక్టు ద్వారా వేసవిలో నీరు విడుదల చేస్తారని, తెలంగాణలో ఇప్పుడు ఈ పరిస్థితిని చూస్తున్నామన్నారు. ప్రాజెక్టుల కాల్వల నుంచి అవసరమైన తూములు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, చెరువులకు నీరు అందించడానికున్న అడ్డంకులపై చర్చించేందుకు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

చెరువులు నింపడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని, ఫలితంగా బోర్ల ద్వారా కూడా సాగు చేయవచ్చని తెలిపారు. ఎల్‌ఎండీ నుంచి దిగువకు నీరందించడానికి ప్రస్తుతమున్న కాలువ కేవలం ఆరువేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో ఉందని, దీనిని 9 వేల క్యూసెక్కులకు పెంచేందుకు ప్రస్తుతం ఉన్న కాలువను విస్తరించడమా? సమాంతరంగా మరో కాలువ నిర్మించడమా? అనే విషయాన్ని ఈఎన్‌సీల కమిటీ తేలుస్తుందన్నారు. వరద కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలని, వరద కాలువలపై ఓటీల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. అత్యవసరమైన సాగునీటి పనులకు కావాల్సిన అనుమతులు ఇవ్వడానికి సీఈ నుంచి ఈఈ వరకు అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తుందని, సీఈ రూ.50 లక్షలు, ఎస్‌ఈ రూ.25 లక్షలు, ఈఈ రూ.5 లక్షల వరకు పనులకు అనుమతులు ఇవ్వవచ్చన్నారు. 15 రోజుల్లోగా అన్ని ప్రాజెక్టులపై కొత్తగా గేజ్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతమున్న గేజ్‌లు చాలా కాలం క్రితం ఏర్పాటు చేసినవే కాబట్టి చాలా ప్రాజెక్టుల్లో పూడిక వల్ల గేజ్‌లు సరిగా చూపెట్టడం లేదన్నారు. కొత్తగా గేజ్‌లు ఏర్పాటు చేసి కచ్చితమైన అంచనా వేయాలని, ప్రాజెక్టుల నిర్మాణానికి ఇంకా ఎక్కడైనా భూ సేకరణ మిగిలి ఉంటే తక్షణం పూర్తి చేయాలని, దీనికి కావాల్సిన నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయని, అన్ని చెరువులనూ కాకతీయ, వరద కాలువలతో నింపుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆలోచనలతో కాకతీయ కాలువలకు తూములు నిర్మించామని, ప్రతి నియోజకవర్గంలో కాలువ లైనింగ్‌, కల్వర్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో అధికారులతో సమావేశాలు నిర్వహించి, సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. చెరువులు నింపడం వల్ల రైతులకు వ్యవసాయంపై నమ్మకం, ధైర్యం పెరుగుతుందని, గతంలో ఆరుతడి పంటలకు కాలువలను డిజైన్‌ చేశామని, చెరువులన్నీ నింపడంతో బావుల్లో, బోర్లలో నీటి నిల్వలు పెరుగుతాయన్నారు. తెలంగాణలో చెరువులు, కుంట లు ఏడాదంతా నిండుకుండలా ఉండేలా వ్యూహం అవలంబించామని స్పష్టం చేశారు.logo