బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - May 11, 2020 , 02:51:45

వీరంగం సృష్టించి.. కరెంటును పట్టుకొని..

వీరంగం సృష్టించి.. కరెంటును పట్టుకొని..

  • కోరుట్లలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఫ్యూజ్‌ను తాకి యువకుడి మృతి

కోరుట్లటౌన్‌: ఓ యువకుడు విచక్షణ మరిచి వీరంగం సృష్టించాడు. నడిరోడ్డుపై షాపులు, పాదచారులపై రాళ్లు విసురుతూ హల్‌చల్‌ చేశాడు. చివరకు తాను ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఫ్యూజ్‌ను పట్టుకొని ప్రాణాలు వదిలాడు. ఎస్‌ఐ సురేందర్‌రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని లింగ సముద్రం మండలం వెంగళాపురం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు (32) కొద్ది నెలల క్రితం కోరుట్లకు వచ్చి తమ బంధువుల ఇంట్లో ఉంటూ మేస్త్రీ పని చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం గోదాం రోడ్డు బాంబే దవాఖాన సమీపంలో రహదారిపై నానా హంగామా చేశాడు. పాదచారులు, ద్విచక్ర వాహనదారులను ఆపి దుర్భాషలాడాడు. దుకాణాలపై రాళ్లు రువ్వాడు. అక్కడే ఉన్న మతి స్థిమితం లేని మహిళను వెంబడిస్తూ రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌ ఫ్యూజ్‌లో వేలు పెట్టడంతో షాక్‌ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు సదరు యువకుడిని ఆటోలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.