శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - May 06, 2020 , 01:54:34

ఆరుగురికి నెగెటివ్‌..

ఆరుగురికి నెగెటివ్‌..

  • నలుగురిని ఐసోలేషన్‌కు తరలింపు

జగిత్యాల ప్రతినిధి/ధర్మపురి, నమస్తే తెలంగాణ/మేడిపల్లి : తక్కళ్లపల్లికి చెందిన ఓ వ్యక్తికి కొవిడ్‌ 19 పాజిటివ్‌ రావడంతో ఉలిక్కిపడ్డ జగిత్యాల జిల్లా, బాధితుడితో ఫస్ట్‌ కాంటాక్టులోకి వెళ్లిన ఆరుగురికి నెగెటివ్‌ రిపోర్ట్‌ రావడంతో ఊపిరి పీల్చుకుంది. మల్యాల మండలం తక్కళ్లపల్లికి చెందిన 65ఏళ్ల వృద్ధుడికి కొవిడ్‌ 19 పాజిటివ్‌ అని ఈ నెల 3న తేలిన విషయం తెలిసిందే. క్యాన్సర్‌ పేషెంటైన బాధితుడు అంతకు ముందు వైద్యం కోసం జగిత్యాల పట్టణంలోని ఓ నర్సింగ్‌ హోమ్‌కు రెండుసార్లు వెళ్లాడని, తర్వాత మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ దవాఖానలో ఐదురోజులు ఇన్‌పేషెంట్‌గా ఉన్నాడని తెలియడంతో అధికారులు అప్రమత్తం కాగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. బాధితుడి కుటుంబసభ్యులను, వైద్యులను, బాధితుడి కాంటాక్ట్‌లోకి వెళ్లిన వారందరిని అధికారులు హోం క్వారంటైన్‌ చేశారు. ముగ్గురు కుటుంబ సభ్యులతో పాటు, వృద్ధుడిని కరీంనగర్‌, జగిత్యాలకు తీసుకువెళ్లిన ఆటో డ్రైవర్‌, ఇద్దరు వైద్యుల రక్త నమునాలను సేకరించి, పరీక్షలకు పంపగా ఆరుగురికీ మంగళవారం వచ్చిన రిపోర్ట్‌లో నెగెటివ్‌ రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ముందుస్తు జాగ్రత్తగా బాధితుడి కుటుంబసభ్యులు ముగ్గురిని, ఆటో డ్రైవర్‌ను జగిత్యాల దవాఖానలోని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. ఇద్దరు వైద్యులను, హాస్పిటల్‌ సిబ్బందిని హోం క్వారంటైన్‌కు పంపించారు. వృద్ధుడు జగిత్యాల దవాఖానలో చికిత్సకు వెళ్లిన 17, 24తేదీల్లో ధర్మపురి మండలం కమలాపూర్‌కు చెందిన ఓ మహిళ, ధర్మపురికి చెందిన ఓ యువకుడు, బుగ్గారం మండలం వెల్గొండకు చెందిన మరో ముగ్గురు, మేడిపల్లి మండలం గోవిందారం, పోరుమల్ల, వెంకట్రాపేటకు చెందిన పలువురు అదే హాస్పిటల్‌కు వైద్యం కోసం వెళ్లారని గుర్తించి వైద్య సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి మంగళవారం పరీక్షలు చేశారు. లక్షణాలు ఏమీ లేకున్నా హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.