సోమవారం 23 నవంబర్ 2020
Peddapalli - May 04, 2020 , 02:28:23

వలస జీవులను ఆదుకుంటాం

వలస జీవులను ఆదుకుంటాం

  • రాబోయే రోజుల్లో గ్రీన్‌ జోన్‌గా కరీంనగర్‌
  • కేంద్రం స్పందించకున్నా రెండో విడుత బియ్యం పంపిణీ
  • రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌

టవర్‌సర్కిల్‌: జిల్లాలోని 20 వేల మంది వలస కూలీలకు అండగా ఉంటామని రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఉద్ఘాటించారు. హౌసింగ్‌బోర్డుకాలనీలో వలస కూలీలకు మేయర్‌ సునీల్‌రావుతో కలిసి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. మరికొన్ని రోజుల్లో కరీంనగర్‌ గ్రీన్‌జోన్‌ పరిధిలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారు తీసుకుంటున్న పకడ్బందీ చర్యలు, ప్రజల సహకారంతో జిల్లా కరోనా రహితంగా మారుతుందని చెప్పారు. నగరంలో 19 మంది కరోనా బాధితులు ఉంటే 18 మంది కోలుకున్నారని, ఒక్కరు మాత్రమే చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. కేంద్రం స్పందించకపోయినా రేషన్‌ లబ్ధిదారులకు రెండో విడుత రూ.1500, 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కొనుగోలు చేయని రీతిలో తెలంగాణ సర్కారు కేవలం 20 రోజుల్లోనే సుమారు 21 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించిందన్నారు. కాంగ్రెస్‌ నాయకులు తాలు పేరిట సొళ్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మండు టెండల్లో మత్తడులు దుంకుతున్న చెరువులను చూసి కాంగ్రెస్‌ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మరో 25 ఏండ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు. అనంతరం నగరంలో కొనసాగుతున్న స్మార్ట్‌సిటీ పనులను పరిశీలించి అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్‌, కార్పొరేటర్లు మాలతి, రమేశ్‌, నాయకులు చల్ల హరిశంకర్‌, సంపత్‌ ఉన్నారు.