మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - May 04, 2020 , 02:17:24

బియ్యం పోస్తూ.. ఆకలి తీరుస్తూ..

బియ్యం పోస్తూ.. ఆకలి తీరుస్తూ..

  • ఊరూరా ముందుకొస్తున్న రేషన్‌ కార్డుదారులు
  • అదనపు కలెక్టర్‌ ఆదేశాలతో చౌక దుకాణాల వద్ద హుండీల ఏర్పాటు
  • ఇప్పటివరకు 154.90 క్వింటాళ్లు సేకరణ
  • కార్డులేని పేదలకు 10 నుంచి 20 కిలోలు వితరణ
  • వినూత్న కార్యక్రమానికి అనూహ్య స్పందన 

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/హుజూరాబాద్‌: తెల్ల రేషన్‌ కార్డు లేని నిరుపేదల ఆకలి తీర్చేందుకు జిల్లా అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ ఆలోచనతో పౌర సరఫరాల శాఖ అధికారులు అన్ని రేషన్‌ దుకాణాల వద్ద బియ్యం హుండీ(రైస్‌ డొనేషన్‌ బాక్స్‌)లను ఏర్పాటు చేశారు. డీలర్లు, సామాజిక కార్యకర్తల ద్వారా కార్డుదారులు స్పందించేలా ప్రోత్సహిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని పొందుతున్న చాలా మంది తమకు తోచినంత హుండీలో పోస్తున్నారు. కొందరు తమకు వచ్చిన బియ్యం మొత్తాన్ని దానం చేస్తున్నారు. జిల్లాలోని 487 రేషన్‌ దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన హుండీల ద్వారా ఇప్పటివరకు 154.90 క్వింటాళ్ల బియ్యం సేకరించినట్లు, త్వరలో వీటిని కార్డు లేని నిరుపేదలకు పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి సురేశ్‌రెడ్డి తెలిపారు. మొదటి, రెండు రోజుల్లోనే హుజూరాబాద్‌ డివిజన్‌లోని ఐదు మండలాల్లో 62 క్వింటాళ్ల బియ్యాన్ని దాత లు వితరణగా ఇచ్చారు. కాగా, కరీంనగర్‌ మండలం బొమ్మకల్‌లో సేకరించిన బియ్యాన్ని స్థానికంగా ఉన్న నిరుపేద కుటుంబాలకు ఇప్పటికే పంపిణీ చేశారు. కార్డు లేని ఒక్కో కుటుంబానికి కనీసం 10 నుంచి 20 కిలోల బియ్యం అందించాలని చూస్తున్నారు.

నిరుపేదల ఆకలి తీర్చాలని..

లాక్‌డౌన్‌ సమయంలో స్థానికంగా తెలుపు రేషన్‌ కార్డు లేని నిరుపేదల ఆకలి తీర్చేందుకే బియ్యం హుండీలను ఏర్పాటు చేశాం. దీనికి జిల్లాలో అనూహ్య స్పందన వస్తోంది. ఈ మూడు రోజుల్లో 150 క్వింటాళ్లకు పైగా బియ్యం సేకరించాం. చాలా మంది కార్డుదారులు సాటి వారి కోసం దానం చేసేందుకు ముందుకొస్తున్నారు. కొందరు తమకు వచ్చిన మొత్తం బియ్యాన్ని దానం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో తోటి వారికి సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయం.

- జీవీ శ్యాంప్రసాద్‌ లాల్‌, కరీంనగర్‌ జిల్లా అదనపు కలెక్టర్‌