మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - May 01, 2020 , 01:42:08

నేటి నుంచే రెండో విడత రేషన్‌

నేటి నుంచే రెండో విడత రేషన్‌

  • మరోసారి ఉచిత బియ్యం పంపిణీ
  • త్వరలో కార్డుపై కిలో కంది పప్పు 
  • సబ్సిడీపై మరిన్ని నిత్యావసరాలు
  • ఏఏవై కార్డులపై కిలో చక్కెర 
  • మున్సిపాలిటీల పరిధిలో గోధుమలు
  • అన్ని కార్డులపై కిలో ఉప్పు 
  • లబ్ధిదారుల ఖాతాల్లోకి 1,500 నగదు

లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. ఇప్పటికే ఏప్రిల్‌కు సంబంధించి తెల్ల రేషన్‌ కార్డులున్న కుటుంబాల్లో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం, ప్రతి కార్డుపై 1,500 ఆర్థిక సహాయాన్ని అందించింది. ఇదే తీరున మే నెలలో కూడా సహాయాన్ని నేటి నుంచి అందించబోతున్నది. ఈ విడతలో ఉచితంగా బియ్యంతోపాటు కిలో కంది పప్పును కూడా అందించనున్నది. కొన్ని నిత్యావసరాలను సబ్సిడీపై ఇవ్వనున్నది. అన్నపూర్ణ అంత్యోదయ కార్డులపై పంచదార, మున్సిపాలిటీల్లో గోధుమలు, అన్ని కార్డులపై ఉప్పును సబ్సిడీపై ఇవ్వనున్నది. 

 కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నేటి నుంచి అన్ని జిల్లాల్లో రేషన్‌ పంపిణీ చేస్తారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ సారి బియ్యంతోపాటు కిలో కంది పప్పును కూడా ఉచితంగా ఇవ్వనున్నారు. ఇవే కాకుండా గోధుమలు, చక్కెర, ఉప్పను సబ్సిడీపై అందిస్తారు. ఇందులో అన్నపూర్ణ అంత్యోదయ కార్డుదారులకు 13.50కే కిలో చక్కెర ఇస్తారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రతి కార్డుపై 2 కిలోల చొప్పున, హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో 7కే కిలో చొప్పున గోధుమలు ఇవ్వనున్నారు. ఇక జిల్లాలోని అన్ని కార్డులపై 5కే కిలో చొప్పున ఉప్పును అందించనున్నారు. కరీంనగర్‌ జిల్లాలో గత నెల అందించినట్లుగానే 95,516 క్వింటాళ్ల బియ్యాన్ని, 2,74,586 కిలోల కంది పప్పును పంపిణీ చేస్తామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సురేశ్‌రెడ్డి తెలిపారు. ఈ నెల కూడా ప్రతి కార్డుపై 1,500 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారని, అకౌంట్లు లేని వారికి పోస్టాఫీసుల ద్వారా, పోస్టాఫీసులకు రాలేని వారికి పోస్టు ద్వారా అందిస్తారని చెప్పారు.