మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Apr 27, 2020 , 01:39:51

ఎదిగిన ఎవుసం..

ఎదిగిన ఎవుసం..

  • పెరిగిన సాగు విస్తీర్ణం.. దిగుబడి.. 
  • ఎకరానికి సరాసరి 30 క్వింటాళ్ల ధాన్యం
  • పంట కోత ప్రయోగాల్లో వెల్లడి
  • సిరులు కురిపించిన కాళేశ్వరం జలాలు 

కాళేశ్వరం జలాలతో ధాన్యం సిరులు పండుతున్నాయి. రెండేళ్లలో సాగు విస్తీర్ణంతోపాటు దిగుబడి పెరిగినట్లు ప్రణాళిక శాఖ నిర్వహించిన పంటకోత ప్రయోగాల్లో వెల్లడైంది. ఒకప్పుడు నీళ్లు లేక యాసంగిలో నెర్రలు బారిన భూములు ఇప్పుడు ధాన్యం సిరులు కురుస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లాలో కాళేశ్వరం జలాలు అందిన ప్రాంతాల్లో ఎకరాకు సరాసరి 30 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చినట్లు ప్రణాళిక శాఖ అధికారులు వెల్లడించారు.  

- కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

కరీంనగర్‌ జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు ఈసారి కాళేశ్వరం జలాలు వచ్చాయి. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, ఓగులాపూర్‌, ముదిమాణిక్యం, ముల్కనూర్‌, రేకొండ లాంటి గ్రామాలతోపాటు సైదాపూర్‌ మండలంలోని దుద్దెనపల్లి వరకు ఈసారి కాళేశ్వరం జలాలు అందాయి. దీంతో ఈ గ్రామాల్లో ధాన్యం సిరులు పండాయి. ఇటు చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, చొప్పదండి, రామడుగు మండలాల్లోని చెరువులు, కుంటలు నింపడంతో ఒక్క ఎకరం కూడా ఎండి పోకుండా పంటలు చేతికొచ్చాయి. ఎల్‌ఎండీ దిగువ ఆయకట్టు పరిధిలోని మానకొండూర్‌, శంకరపట్నం, వీణవంక, హుజూరాబాద్‌ మండలాల్లోనూ పుష్కలంగా సాగైంది. దీంతో ఈ ప్రాంతాల్లోనూ భారీగా వరి సాగు పెరిగింది. రెండేళ్లలో గణనీయంగా సాగు విస్తీర్ణం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. నిరుటి యాసంగి కంటే ఈసారి యాసంగి విస్తీర్ణం భారీగా పెరిగింది. గతేడాది యాసంగిలో 1,10,064 ఎకరాల్లో సాగవగా ఈసారి 1,95,752 ఎకరాల్లో వరిసాగు చేశారు. ధాన్యం దిగుబడులు పరిశీలిస్తే గతేడాది 2.27 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రాగా ఇప్పుడు 4.39 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రావచ్చని అధికారుల అంచనా వేశారు. 

ఊరూరా ధాన్యం సిరులు

కాళేశ్వరం జలాల రాకతో రెండేళ్లుగా ఏ యేటికాయేడు వ్యవసాయ వృద్ధి కనిపిస్తోంది. పంట దిగుబడిలో ఎదుగుదల ఉంది. జిల్లా ప్రణాళిక, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పంట కోత ప్రయోగాల్లో ఈ విషయం నిర్ధారణకు వస్తోంది. ఈసారి యాసంగిలో వరిపై 648 పంట కోత ప్రయోగాలు నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు ఇప్పటికే 445 పూర్తి చేశారు. ఇందులో సాగు నీటి వసతి ఉన్న ఆయకట్టు ప్రాంతాల్లో ఎకరాకు సరాసరి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి పూర్ణచందర్‌ తెలిపారు. తిమ్మాపూర్‌, చిగురుమామిడిలోని నీళ్లు అందని కొన్ని గ్రామాలు, గన్నేరువరం మండలాలు మినహాయిస్తే మిగతా మండలాల్లో సరాసరి దిగుబడి పెరిగిందని వివరించారు. ఈ మండలాల్లో ఎకరాకు సరాసరి దిగుబడి 24 నుంచి 25 క్వింటాళ్లు ఉంటోందని, ఈసారి కాళేశ్వరం జలాలు అందిన గంగాధర, చొప్పదండి, రామడుగు మండలంలోని కొన్ని గ్రామాలు, మానకొండూర్‌, కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి మండలంలోని కొన్ని గ్రామాలు, శంకరపట్నం, వీణవంక, హుజూరాబాద్‌, జమ్మికుంట, ఇల్లందకుంటలోని కొన్ని గ్రామాల్లో సరాసరి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నట్లు సీపీఓ వివరించారు. 

ఆనందంలో అన్నదాతలు

కాళేశ్వరం జలాల రాకతో రైతులు ఆనందంగా కనిపిస్తున్నారు. గంగాధర మండలంలోని నారాయణపూర్‌ రిజర్వాయర్‌కు మూడేళ్లుగా ఎల్లంపల్లి నుంచి నేరుగా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ ప్రాంతంలోని పలు గ్రామాల్లో ఇప్పుడు రైతుల ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో యాసంగి సీజన్‌లో సాగు చేసిన పంటలు చేతికి వచ్చేది నమ్మకం లేని పరిస్థితి ఉండేది. ఈ యాసంగిలో అడుగు పెడదామంటే సందు లేని రీతిలో పంటలు సాగు చేశారు. నిరుటి కంటే ఈసారి ఎక్కువ వరి సాగైంది. ఇక మొదటిసారిగా కాళేశ్వరం నీళ్లు వచ్చిన ప్రాంతం చిగురుమామిడి, సైదాపూర్‌ మండలాల్లో అయితే రైతుల ఆనందానికి హద్దులు లేదు. చిగురుమామిడిలోని ఇందుర్తి, ఓగులాపూర్‌, ముదిమాణిక్యం, ముల్కనూర్‌, రేకొండ, సైదాపూర్‌ మండలంలోని దుద్దెనపల్లికి కూడా వచ్చాయి. నడి ఎండ కాలంలో ఈ గ్రామాల్లోని చెరువులు, కుంటలు నింపడంతో బావుల్లో భూగర్భ జలాలు పెరిగాయి. ఫలితంగా రైతులు ధాన్యం సిరులు పండించగలిగారు. ఈ గ్రామాల్లో నిర్వహించిన పంట కోత ప్రయోగాల్లో గతానికి ఇప్పటికి పెరిగిన దిగుబడులు స్పష్టంగా కనిపించాయి. పంట కోత ప్రయోగాలకు ఎంచుకున్న ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఎండిన పంటలే కనిపించేవి. ఈసారి అందుకు భిన్నంగా ధాన్యం సిరులతో నిండిన పొలాలు కనిపించాయని అధికారులు చెప్పడం విశేషం.