శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Apr 24, 2020 , 01:31:43

స్వీయ నిర్బంధంతోనే కట్టడి

స్వీయ నిర్బంధంతోనే కట్టడి

  • ప్రజలంతా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి
  • రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  • ఎంపీ వెంకటేశ్‌నేతతో కలిసి పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో పర్యటన 

గోదావరిఖని/ ధర్మపురి, నమస్తే తెలంగాణ/ జ్యోతినగర్‌/ ఫెర్టిలైజర్‌సిటీ/గోదావరిఖనిటౌన్‌/ పెగడపల్లి: వైరస్‌ నియంత్రణకు ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం పాటించాలని, ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పిలుపునిచ్చారు. ఎన్టీపీసీలోని అన్నపూర్ణ కాలనీ, ఖనిలోని జీఎం కాలనీలోని కంటైన్‌మెంట్‌ ఏరియాల్లో ఎంపీ వెంకటేశ్‌నేత, ఎమ్మెల్యే చందర్‌, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, మేయర్‌ అనిల్‌కుమార్‌తో కలిసి గురువారం ఆయన పర్యటించారు. ఆయాచోట్ల ప్రజలతో మాట్లాడారు. నిత్యావసర సరుకులు సరిగ్గా అందుతున్నాయా..? వైద్య సిబ్బంది సర్వే ఎలా ఉందని అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, బయటకు వెళ్తే కచ్చితంగా మాస్కు ధరించాలని సూచించారు. ఎంపీ వెంకటేశ్‌ నేత మాట్లాడుతూ, నియంత్రిత ప్రాంత ప్రజలు ఆందోళన చెందవద్దని, ఏ ఇబ్బందులు రాకుండా సరుకులతోపాటు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. అనంతరం మంత్రి ఈశ్వర్‌కు డీఎంహెచ్‌వో సుధాకర్‌ థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్ష చేశారు. ఆ తర్వాత ఖనిలోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ, ఎమ్మెల్యేతో కలిసి నాయీ బ్రాహ్మణ సంఘ సభ్యులకు మంత్రి నిత్యావసరాలు పంపిణీ చేశారు.  ఇటీవల సింగరేణి జీడీకే-11ఏ గనిలో మృతిచెందిన కోడెం సంజీవ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. చివరగా బల్దియా కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. ప్రభుత్వ ఆదేశాలతో యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకోవడం వల్లే జిల్లాలో కొత్త కేసులు లేవని, త్వరలోనే కరోనా రహిత జిల్లాగా పెద్దపల్లి అవతరిస్తుందని పేర్కొన్నారు. మే 7 వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా రామగుండంలో కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వగా,  మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, రామగుండం ఇన్‌చార్జి తాసిల్దార్‌ సురేశ్‌, ఏసీపీ ఉమేందర్‌, తదితరులు పాల్గొన్నారు.   

 ధర్మపురిలో విస్తృత కార్యక్రమాలు..

ధర్మపురి, వెల్గటూర్‌ మండలాల్లో ఎంపీ వెంకటేశ్‌తో కలిసి మంత్రి పర్యటించారు. ధర్మపురి టీటీడీ కల్యాణ మండపంలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పార్ట్‌ టైం ఉద్యోగులు 80 మందికి, వెల్గటూర్‌లో నియోజకవర్గంలోని 140 మంది చర్చి పాస్టర్లకు ఎల్‌ఎం కొప్పుట ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 1.32లక్షల విలువైన నిత్యావసర సరుకులను అందజేశారు. ధర్మపురి నియోజకవర్గానికి చెందిన పలువురు ముంబై, భీవండి ప్రాంతాల్లో చిక్కుకున్న దాదాపు వెయ్యి మందికి ట్రస్ట్‌ ద్వారా ఇప్పటి వరకు 10లక్షల దాకా సాయం పంపించినట్లు తెలిపారు. అనంతరం వెల్గటూర్‌ మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు 21,53,456 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం ధర్మపురి శ్రీలక్ష్మీ నర్సింహస్వామి వారి దేవాలయ పక్షాన పట్టణంలో చిక్కుకున్న వివిధ రాష్ర్టాలకు చెందిన వలసకూలీలు, యాచకుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకురోజూ రెండు పూటలా భోజనాన్ని అందిస్తామన్నారు. 

మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవాలి..

రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రైస్‌ మిల్లర్లు వరి ధాన్యం దిగుమతి చేసుకోవాలని మంత్రి సూచించారు. కరీంనగర్‌ క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి ఎంపీతో కలిసి జగిత్యాల జిల్లా రైస్‌ మిల్లర్‌ అసోసియేషన్‌ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిల్లర్లు రైతుల బాధలు దృష్టిలో పెట్టుకుని ధాన్యం దిగుమతులపై ఆంక్షలు పెట్టవద్దని సూచించారు.