శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Apr 11, 2020 , 02:45:26

మాస్క్‌.. మస్ట్‌

మాస్క్‌.. మస్ట్‌

  • కరోనా నియంత్రణకు తప్పనిసరి
  • బయటకు వెళ్తే ఖర్చీఫ్‌ అయినా కట్టుకోవాల్సిందే
  • తాజాగా సర్కారు ఉత్తర్వులు  
  • నిబంధనలు పాటించాలని కలెక్టర్‌ విజ్ఞప్తి 

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా కట్టడికి కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర సర్కారు, అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నది. వైరస్‌ నియంత్రణకు అన్ని రకాలుగా చర్యలు చేపడుతూనే, ప్రజలను అలర్ట్‌ చేస్తున్నది. అంటువ్యాధుల ముప్పును సమర్థవంతంగా అడ్డుకునేందుకు సింగపూర్‌ తరహాలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడాన్ని బుధవారం నుంచి నిషేధించింది. ఇప్పటికే ప్రజలందరూ మాస్కులు ధరిస్తున్నా, బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ధరించాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కరీంనగర్‌ కలెక్టర్‌ కే శశాంక శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చిన్నాపెద్దా తేడాలేకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. మెప్మా స్వయం సహాయక బృందాలు మాస్కులు తయారు చేసి తక్కువ ధరకు అందజేస్తున్నాయని తెలిపారు. కొనలేనివారు ఖర్చీఫ్‌ లేదా తెల్లని బట్టను ముక్కు, నోటికి కట్టుకోవాలని సూచించారు. అన్ని శాఖల ఉద్యోగులు విధిగా మాస్క్‌లతో రావాలని ఆదేశించారు. మాస్కులు వేసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, ఒకసారి వినియోగించిన తర్వాత మరోసారి వాడాలంటే నీటితో శుభ్రపరచాలని సూచించారు. మాస్కు తీసి వేసే సమయంలో శానిటైజర్‌ లేదా సబ్బుతో 40 సెకన్ల వరకు చేతులను శుభ్రం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, వైద్యులు, పోలీసులు, ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ప్రజలు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు.