సోమవారం 23 నవంబర్ 2020
Peddapalli - Mar 29, 2020 , 02:39:10

మూడు వారాలు అప్రమత్తంగా ఉండాలి

మూడు వారాలు అప్రమత్తంగా ఉండాలి

  • లక్షణాలు ఉన్న వాళ్లు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలి
  • నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వైరస్‌ విజృంభించే ప్రమాదం
  • కలెక్టర్‌ శశాంక పరిశీలన

కరీంనగర్‌ క్రైం : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జిల్లా ప్రజలు మరో రెండు, మూడు వారాల పాటు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ శశాంక సూచించారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో శనివారం సాయంత్రం కలెక్టర్‌ శశాంక, పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి కరీంనగర్‌లోని వివిధ ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నాకా చౌరస్తా వద్ద కలెక్టర్‌ శశాంక మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ దవాఖానలో వైరస్‌ అనుమానితుల కోసం 200 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చల్మెడ ఆనందరావు హాస్పిటల్‌లో 48, శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌లో 27 మంది వ్యక్తులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. హోం క్వారంటైన్‌లో ఉండి నిబంధనలు పాటించని ఐదుగురిని శాతవాహన యూనివర్సిటీ క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలన్నారు. స్థానికుడికి పాజిటివ్‌ నిర్ధారణ అయిన నేపథ్యంలో సదరు వ్యక్తితో అత్యంత సన్నిహితంగా మెదిలిన వ్యక్తులు కూడా వైరస్‌ లక్షణాలు కన్పించినా, కనిపించకపోయినా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి క్వారంటైన్‌లో ఉంటారని తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 641 మంది విదేశాల నుంచి జిల్లాకు వచ్చారని, వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 22న జరిగిన జనతా కర్ఫ్యూ తర్వాత దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌తో పాటు సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతున్నదన్నారు. బందోబస్తు కోసం వివిధ స్థాయిలకు చెందిన 750 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లా సరిహద్దులో 6 చెక్‌పోస్టులు, 15 పికెట్లు, 9 డైనమిక్‌ మొబైల్‌ పార్టీలతో పని చేస్తున్నాయని వెల్లడించారు. శనివారం నుంచి పోలీసులు మూడు షిప్టుల పద్ధతిలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డెక్కిన వాహనాలు స్వాధీనం చేసుకున్నామని, సదరు వాహనదారులతో భవిష్యత్‌లో తాము ఎలాంటి నిబంధనలూ విస్మరించబోమని హామీ పత్రాన్ని రాయించుకుని వాహనాలు అప్పగిస్తామన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి మాట్లాడుతూ ప్రజలు సామాజిక దూరం పాటించేందుకు మార్కెట్లను వివిధ ప్రాంతాలకు తరలించామని, ప్రస్తుతం 12 మార్కెట్లు కొనసాగుతున్నాయని, మరో 8 ప్రదేశాల్లో నూతనంగా మార్కెట్లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. శానిటేషన్‌ సిబ్బందికి శానిటైజర్లు, మాస్క్‌లు, 500 విలువ చేసే ప్రత్యేక సూట్లను అందించామని తెలిపారు. ఇండ్ల వద్దకు మొబైల్‌ మార్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వివిధ మార్కెటింగ్‌ సంస్థలతో మాట్లాడామని చెప్పారు. మెప్మా సహకారంతో ఇప్పటి వరకు 20వేల మాస్క్‌లు తయారు చేయించామని, ఒక్కో మాస్క్‌ను 10 రూపాయలకు విక్రయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు శ్రీనివాస్‌, చంద్రమోహన్‌, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.