బుధవారం 05 ఆగస్టు 2020
Peddapalli - Mar 27, 2020 , 02:41:06

సలాం పోలీస్‌..

సలాం పోలీస్‌..

 • లాక్‌డౌన్‌లో పోలీస్‌శాఖ కీలకపాత్ర
 • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నాలుగు వేల మందికిపైగా సేవలు
 • ఆరు చెక్‌ పోస్టులు.. ఐదు అవుట్‌ పోస్టులతో నిఘా
 • జనం అదుపునకు అలుపెరుగని పోరాటం
 • ప్రతికూల పరిస్థితుల్లో కంటిమీద కునుకు లేకుండా డ్యూటీలు
 • రెడ్‌జోన్‌లో నిర్భయంగా విధులు
 • విదేశాల నుంచి వచ్చిన వారిపై కన్ను
 • హోం క్వారంటైన్‌పై నజర్‌
 • వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు
 • ఆపదలో ఉన్నవారికీ సాయం
 • శభాష్‌ అంటున్న ప్రజానీకం 

ఇప్పుడు ఎక్కడ చూసినా నిశ్శబ్దం.. ఏ దారి చూసినా నిర్మానుష్యం.. కరోనా దెబ్బకు జనమంతా ఇంటి నుంచి బయట కాలు పెట్టడానికే భయపడుతోంటే, పోలీసన్న మాత్రం నిర్భయంగా రోడ్డెక్కాడు. వైరస్‌ ప్రమాదకరమని తెలిసినా.. ప్రజాస్వామ్య పరిరక్షణే పరమావధిగా.. సమాజ శ్రేయస్సే ఊపిరిగా మరో యుద్ధం చేస్తున్నాడు. వైద్యులతో కలిసి ‘కొవిడ్‌ కట్టడి’కి కదిలి, ‘లాక్‌డౌన్‌'ను విజయవంతం చేస్తున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి రాత్రీపగలు తేడా లేకుండా పనిచేస్తూ, జనం అదుపునకు అహర్నిశలూ శ్రమిస్తున్నాడు. తీవ్రత ఎక్కువగా ఉన్న కరీంనగర్‌లోని రెడ్‌జోన్‌లో ఏమాత్రం జంకు లేకుండా విధులకు అంకితమయ్యాడు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించడంతోపాటు హోం క్వారంటైన్‌పై నిఘా పెట్టాడు. అత్యవసర పరిస్థితుల్లో సాయం చేస్తూ, ప్రతి ఒక్కరితో శభాష్‌ అనిపించుకుంటున్నాడు.

- రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, పెద్దపల్లి ప్రతినిధి, 

నమస్తే తెలంగాణ/ కరీంనగర్‌ క్రైం/ జగిత్యాల క్రైం: కరోనా కట్టడికి ఉమ్మడి జిల్లా పోలీసులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. వ్యాధి నియంత్రణకు సుమారు 4వేల మంది షిఫ్టులవారీగా 24గంటలూ పనిచేస్తున్నారు. రాత్రీ పగలు తేడా లేకుండా రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు లాక్‌డౌన్‌ను విజయవంతం చేస్తున్నారు. ఇండ్ల నుంచి వచ్చే ప్రజలకు అవగాహన కల్పించి, ఇంటికే పరిమితం చేస్తున్నారు. కరీంనగర్‌తోపాటు జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రాల చుట్టూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, కట్టడి చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పట్టణాల్లోకి రాకుండా చూస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సడలింపు ఇస్తున్నారు. నగరాలతోపాటు పట్టణాల్లో జనం రోడ్లపైకి రాకుండా నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో మినహాయింపు ఇచ్చి, కర్ఫ్యూ సమయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటు ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిపోయే వారి వివరాలు సేకరిస్తూ, కొత్తగా ఎవరైనా వస్తే రికార్డు చేస్తున్నారు. అనుమానితులు, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యశాఖకు సమాచారం ఇస్తున్నారు. ఇటు అంతటా విస్తృతప్రచారం నిర్వహిస్తున్నారు. వాహనదారులు రోడ్లపైకి రాకుండా కట్టడి చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వారి వివరాలు సేకరించడంతోపాటు హోం క్వారంటైన్‌ చేసి నిఘా పెడుతున్నారు. ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందిస్తున్నారు. 

కరీంనగర్‌లో వెయ్యి మంది..

కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో సీపీ వీబీ కమలాసన్‌రెడ్డి పర్యవేక్షణలో సుమారు వెయ్యి మంది సిబ్బంది మూడు విడతల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్‌ కూడా నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిపోయే వారి వివరాలు సేకరిస్తూ, కొత్తగా ఎవరైనా వస్తే రికార్డు చేస్తున్నారు. వాహనదారులు రోడ్ల పైకి రాకుండా కట్టడి చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉన్న కరీంనగరం చుట్టూ ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి ప్రవేశించే అన్ని దారులనూ మూసివేసి రక్షణ వలయంగా నిలబడ్డారు. ప్రధాన రహదారులపైకి జనం రాకుండా నిరంతరం 12 ‘డైనమిక్‌ మొబైల్‌ టీం’లతో గస్తీ నిర్వహిస్తున్నారు. ఒక్కో టీంలో ఇద్దరు ఉండగా, మూడు షిఫ్టుల్లో మొత్తం 64 మంది పనిచేస్తున్నారు. అలాగే, ఎక్కడికక్కడ స్థానికులతో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్నారు. లాక్‌డౌన్‌కు సహకరించాలని పిలుపునిస్తున్నారు. 

కర్ఫ్యూ సమయంలో బయటకు రావద్దు..

ఇండోనేషియా వాసులు కరీంనగర్‌కు వచ్చి సుమారు 70 నుంచి 80 మందిని కలిసినట్లు గుర్తించాం. వారందరినీ దవాఖానలకు తరలించి క్వారంటైన్‌లో ఉంచగలిగాం. విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఏర్పాటు చేశాం. పోలీసులకు మాస్క్‌లు, శానిటైజర్స్‌ ఉపయోగిస్తున్నాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెడ్‌ జోన్‌ పరిధిని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాం. ప్రతి కుటుంబం హోం క్వారంటైన్‌లో ఉండేలా అవగాహన కల్పిస్తూ సూచనలు జారీచేశాం. అన్ని శాఖల సమన్వయంతో అత్యవసర సేవలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. నిత్యావసరాలు సమకూరితే రోడ్లపైకి ఎవరూ రారన్న కారణంతో సమన్వయంతో ముందుకెళ్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌ సమయంలో కొంత సడలింపు ఇస్తున్నాం. ఎవరూ బయటికి రాకుండా ఉండేందుకు చెక్‌పోస్టులతోపాటు డైనమిక్‌ మొబైల్‌ టీంలను ఏర్పాటు చేశాం. అత్యవసర సేవలకు మాత్రమే కొంత మినహాయింపు ఇస్తున్నాం. వ్యాధి నియంత్రణ కోసం జిల్లాను ఇప్పటికే ఒక మోడల్‌గా గుర్తించి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు ప్రజలకు అందించే విధంగా ఏర్పాట్లు చేశాం. ప్రజలందరికీ మేము చేసే విజ్ఞప్తి ఒక్కటే. నిత్యావసరాల కోసం తప్ప బయటికి రావద్దు. లాక్‌డౌన్‌ సమయంలో ఒకరికి మాత్రమే వెసులుబాటు ఉంటుంది. కర్ఫ్యూ సమయంలో నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సి ఉంటుంది. బయటికి వస్తే బల ప్రయోగం తప్పదు. అందుకే ప్రజలెవరూ రోడ్లపైకి రావద్దు.  

- కమలాసన్‌రెడ్డి, కరీంనగర్‌ కమిషనర్‌  

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా 21 రోజుల వరకు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రాకూడదు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలకైనా వెనుకాడం. అనవసరంగా వాహనాలపై బయట తిరిగితే సీజ్‌ చేయడంతోపాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలి. ప్రజలకు అత్యవసర వేళల్లో సహాయం అందించడానికి 24 గంటలూ పోలీస్‌యంత్రాంగం అందుబాటులో ఉంటుంది. ఇండ్లలో ఉండి కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు సహకరించాలి. ఆరోగ్యవంతమైన జిల్లాను సాధించుకుందాం.

- రాహుల్‌ హెగ్డే, ఎస్పీ (రాజన్న సిరిసిల్ల జిల్లా)

పెద్దపల్లి జిల్లాలో 650 మంది..

రామగుండం సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. జిల్లాతోపాటు మండలాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసుకొని కంటిమీద కునుకులేకుండా గస్తీ కాస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి జిల్లాలోకి ప్రజలెవరూ ప్రవేశించకుండా జిల్లా సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ జిల్లా సరిహద్దు ప్రాంతమైన సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి, భూపాలపల్లి జిల్లా సరిహద్దులు ఓడెడు, మంథని పట్టణ పెట్రోల్‌ బంకు వద్ద, మంచిర్యాల జిల్లా సరిహద్దు గోదావరిఖని బ్రిడ్జి, జగిత్యాల జిల్లా సరిహద్దు ధర్మారం మండల కేంద్రం శివారులో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి మూడు షిఫ్టుల వారీగా సిబ్బందిని నియమించి బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే జిలాతో పాటు మొత్తం 30కి పైగా చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటల పాటు తనిఖీలు చేస్తున్నారు. ఇక సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ పర్యవేక్షణలో పోలీసు అధికారులు, సిబ్బంది మొత్తం 650 మంది పనిచేస్తున్నారు. ఇందులో 10మంది సీఐలు, 25మంది ఎస్‌ఐలు సహా హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు.

సిరిసిల్ల జిల్లాలో 370 మంది.. 

ఎస్పీ రాహుల్‌ హెగ్డే పర్యవేక్షణలో జిల్లాలో దాదాపు 370 మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఒక ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 24 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, దాదాపు 200 మంది పోలీస్‌ కానిస్టేబుళ్లు, 101 మంది హోంగార్డులు, 20 మంది జిల్లా గార్డులు ఉన్నారు. బోయినపల్లి మండలం నర్సింగాపూర్‌, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, రుద్రంగి సమీపాన, గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజీ వద్ద, వేములవాడ సమీపంలో వేములవాడ-జగిత్యాల ప్రధాన రహదారిపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీసు అధికారుల సూచనలను పాటిస్తూ ప్రజలకు అత్యవసరమైన సేవలకు సడలింపు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో  మాత్రమే బయటకు రావాలని ప్రచారం చేస్తూ, అమలు చేస్తున్నారు. 

చర్యలు కట్టుదిట్టం.. 

జీవో 45ను తు.చ తప్పకుండా జిల్లాలో అమలు చేస్తున్నాం. లాక్‌డౌన్‌ చర్యలు కట్టుదిట్టం చేశాం. విదేశాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారిని హోం క్వారంటైన్‌ చేసేందుకు రెవెన్యూ, హెల్త్‌ శాఖలకు సహాయ సహకారాలు అందిస్తున్నాం. హోం క్వారంటైన్‌లో ఉన్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచాం. బయటకు వస్తే కేసులు నమోదు చేస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన 500 వాహనాలను సీజ్‌ చేశాం. చాలా మట్టుకు ప్రజలు ఇండ్లలోంచి బయటకు రావడంలేదు. పోలీసులకు సహకరిస్తున్నారు. నిత్యావసర సరుకుల రవాణా, సరఫరాకు ఆటంకం కలగకుండా చూసుకుంటున్నాం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ బారిన ప్రజలు పడకూడదంటే ఎవరికి వారు స్వీయనిర్బంధం పాటించాలి. పోలీసులు ఇదంతా చేసేది ప్రజలకోసమేనని గమనించాలి. పోలీస్‌ సిబ్బంది తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్నారు. దయచేసి ప్రజలు మా సిబ్బందికి సహకరించాలి.

-దక్షిణామూర్తి, అదనపు ఎస్పీ (జగిత్యాల)

అధిక రేట్లకు అమ్మితే పీడీ యాక్ట్‌ పెడతాం.. 

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలూ చక్కగా సహకరిస్తున్నారు. క్వారంటైన్‌పై పెద్దపల్లి ప్రజలకు సంపూర్ణమైన అవగాహన ఉంది. ఎందుకు ఇండ్లల్లో ఉండాల్సి వస్తుందో వారికి తెలుసు. కాబట్టే ప్రజలు బాగా రిసీవ్‌ చేసుకుంటున్నారు. ఇక జిల్లాలో ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే అలాంటి వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసేందుకు వెనుకాడబోం. ఈ విషయాన్ని ప్రతి వ్యాపారి గుర్తించాలి. అధిక ధరల విషయంలో టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తాం.

-సత్యనారాయణ, రామగుండం పోలీస్‌ కమిషనర్‌

రెడ్‌జోన్‌లో ఐదు అవుట్‌ పోస్టులు..

ఇండోనేషియా మత ప్రచారకులు నగరంలో తిరిగిన ముకరం పుర, కశ్మీర్‌గడ్డ కలెక్టరేట్‌ ఏరియాలను రెడ్‌ జోన్‌లుగా ప్రకటిం చిన విషయం తెలిసిందే. ఈ జోన్‌ పరిధిలో 5 అవుట్‌ పోస్టులు ఏర్పాటు చేసి, పటిష్ట భద్రత కల్పించారు. ఒక్కో అవుట్‌ పోస్టు లో నలుగురు చొప్పున పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. జనం రోడ్లపైకి రాకుండా కట్టడి చేస్తున్నారు. ఎవరైనా వస్తే సూచనలు చేసి, తిప్పి పంపుతున్నారు.  

జగిత్యాలలో 480 మంది.. 

ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. కరీంనగర్‌ జిల్లా సరిహద్దు ప్రాంతమైన దొంగల మర్రి, నిజామాబాద్‌ సరిహద్దు ఇబ్రహీంపట్నం మండలం గండి హన్మాన్‌ వద్ద, మంచిర్యాల జిల్లా సరిహద్దు రాయపట్నం వద్ద, రాయికల్‌ మండలం సరిహద్దు వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మూడు షిఫ్టుల వారీగా సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో మూడు ప్రాంతాలతో పాటు ప్రతి మండల పరిధిలో కలిపి మొత్తం 30కి పైగా చెక్‌ పోస్టులు పెట్టి 24గంటలు తనిఖీలు చేస్తున్నారు. జగిత్యాల, మెట్‌పల్లి డీఎస్పీలు వెంకటరమణ, గౌస్‌బాబా, ఆరుగురు సీఐలు, 25 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఆర్‌, డిస్ట్రిక్ట్‌ గార్డ్‌, స్పెషల్‌ పార్టీ, మహిళా పోలీసులు, హోం గార్డులు కలిపి మొత్తం 480 మంది సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉన్నారు. logo