ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Mar 23, 2020 , 01:59:12

జిల్లాలో విజయవంతమైన కర్ఫ్యూ

జిల్లాలో విజయవంతమైన కర్ఫ్యూ

 • ఉదయం నుంచే నిర్మానుష్యంగా జిల్లా 
 • పల్లెల్లోనూ అదే వాతావరణం
 • రోడ్లపై పోలీసులు తప్ప కనిపించని జనం 
 • సింగరేణిలోనూ నిలిచిన బొగ్గు ఉత్తత్తి.. 
 • ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌  పిలుపునకు విశేష స్పందన
 • స్వచ్ఛందంగా పాల్గొన్న జిల్లాప్రజలు
 • వైద్య ఆరోగ్య సిబ్బందికి సంఘీభావ సంకేతంగా చప్పట్లు
 • స్వీయ నిర్బంధంలో ప్రజాప్రతినిధులు, ప్రముఖులు
 • కరీంనగర్‌లోని స్వగృహంలోనే గడిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 
 • మంథనిలో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
 • రామగుండంలో ఎమ్మెల్యే చందర్‌  

వేలాది వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే జిల్లా ప్రధానదారులు ఆదివారం బోసిబోయాయి.. పెద్దపల్లి, మంథని, గోదావరిఖనిలోని పలు ప్రధాన ప్రాంతాలూ వెలవెలబోయాయి.. దవాఖానలు, మెడికల్‌షాపులు, మార్కెట్లు, వ్యాపారసముదాయాలు అన్నీ మూతపడ్డాయి.. మండల కేంద్రాలు, పల్లెల్లోనూ అవే దృశ్యాలు కనిపించాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునివ్వగా, జిల్లా ప్రజానీకం స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమైంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా నిర్మానుష్య వాతావరణం నెలకొనగా, జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. సింగరేణి సంస్థ బంద్‌ పాటించడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓసీపీలు, భూగర్భ గనులు బోసిబోయాయి. కాగా, సాయంత్రం వేళ ప్రజలు ఇంటి ముంగిళ్లలో నిలబడి వైద్య ఆరోగ్య సిబ్బందికి సంఘీభావ సంకేతంగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, ఎమ్మెల్యే చందర్‌ తమ ఇళ్లలోనే కుటుంబసభ్యులతో గడిపారు. 

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా స్పందించారు. జనతా కర్ఫ్యూలో పాల్గొని విజయవంతం చేశారు. ఆదివారం ఉదయం నుంచే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా దుకాణ సముదాయాలను మూసివేశాయి. పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం, రైతు క్షేత్రమైన మంథనిల్లోని ప్రధాన వీధులన్నీ జనం లేకబోసిపోయాయి. వ్యాపార కూడళ్లను పూర్తిగా మూసివేయడంతో ప్రతి రోజు రద్దీగా ఉండే వ్యాపార కేంద్రాలేవీ తెరుచుకోలేదు. జిల్లాలోని కూరగాయల మార్కెట్లను సైతం పూర్తిగా మూసివేశారు. చికెన్‌, మటన్‌, ఫిష్‌ వ్యాపారులు సైతం వారి వ్యాపారాలను నిలిపివేసి ఇండ్లకే పరిమితమయ్యారు. ఆర్టీసీ బస్సులు జిల్లాలోని గోదావరిఖని, మంథని డిపోల నుంచి నడవకుండా డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లాలో  ఏ ప్రాంతం చూసినా నిర్మానుష్యంగా కనిపించింది. అక్కడక్కడా విధులు నిర్వహించిన పోలీసులు మినహా సాధారణ జనం కనిపించ లేదు. సీపీ సత్యనారాయణ పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అధికారులు, పోలీసులకు పలు సూచనలు చేశారు. 

సింగరేణిలో సక్సెస్‌.. 

ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు పిలుపు మేరకు సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్‌ సింగరేణి సంస్థకు సెలవు ప్రకటించిన దరిమిలా ఆదివారం రామగుండం డివిజన్‌ వ్యాప్తంగా బొగ్గు గనులు, ఓపెన్‌కాస్టుతోపాటు జీఎం కార్యాలయాలు బోసిపోయాయి. ఆర్జీ-1,2,3 ఏరియాల వ్యాప్తంగా అధికారులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లకే పరిమితం కావడంతో బొగ్గు గనులన్నీ బోసిపోయాయి.  

మారుమోగిన చప్పట్లు.. 

కరోనా వైరస్‌ సోకిన వారిని రక్షించేందుకు సేవలందిస్తున్న వైద్యులు, పోలీసులు, వివిధ శాఖల ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు సంఘీభావం తెలపాలని ప్రధాని, సీఎం పిలుపు మేరకు జిల్లాప్రజలు సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టారు. ఎవరి ఇండ్లలో వారు ఉండి కొందరు, మరి కొందరు వీధుల్లోకి వచ్చి, ఇంకొందరు గ్రామాల్లోని చౌరస్తాలు, ప్రధాన కూడళ్లల్లోకి వచ్చి చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు. 

స్వీయ నిర్బంధంలో మంత్రి కొప్పుల 

కరోనా వైరస్‌ను నియంత్రణలో తలపెట్టిన జనతా కర్ఫ్యూకు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదివారం కరీంనగర్‌లోని తన ఇంట్లో కుటుంబ సభ్యులతో గడిపారు. భార్యా పిల్లలలో కలిసి టీవీ చూశారు. సాయంత్రం 5 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు. ఇటు జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ మంథనిలోని తన స్వగృహంలో , ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ రామగుండంలోని తన స్వగృహంలో తన కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూశారు. సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.