సోమవారం 30 మార్చి 2020
Peddapalli - Mar 21, 2020 , 02:57:18

అప్రమత్తంగా ఉండండి..

 అప్రమత్తంగా ఉండండి..

  • అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దు
  • అధికారులు, ప్రజాప్రతినిధులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి
  • ప్రజల్లో భయాన్ని పోగొట్టి, చైతన్యవంతుల్ని చేయాలి
  • రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  • పెద్దపల్లి, జగిత్యాల కలెక్టర్లతో హైదరాబాద్‌ నుంచి ఫోన్లో సమీక్ష 

ధర్మారం:  కరోనా వైరస్‌పై ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని, వైరస్‌కు ఇప్పటి వరకు మందు లేనందున, అది ప్రబలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పరిస్థితులపై శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రెండు జిల్లాల కలెక్టర్లతో మంత్రి ఫోన్‌లో సమీక్షించారు. వ్యక్తి గత, పరిసరాల శుభ్రత, జాగ్రత్త చర్యలతో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించవచ్చని, వైరస్‌పై ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, దీనిపై ప్రజలు పూర్తి చైతన్య వంతులు కావాలని సూచించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలకు వివరించాలని, అన్ని మున్సిపాలిటీలు, పం చాయతీల్లో క్లోరినేషన్‌ పనులు చేపట్టాలని ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన మన వాళ్ల వివరాలను సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేయాలని, వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి, వారు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా వైరస్‌ నిరోధానికి అం దరూ సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఓదెల: కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలే మేలని అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. ఓదెల మండలంలోని పొత్కపల్లిలో జామా మసీద్‌ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రైల్వే గేట్‌ వద్ద అవగాహన శిబిరాన్ని ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు, రోడ్డు వెంట వెళ్లే ప్రయాణికుల చేతులను శుభ్రం చేయించారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ ఆళ్ల రాజిరెడ్డి, మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు మీర్జా షాహెర్‌ అలీ బేగ్‌, ఉపసర్పంచ్‌ వంగ శ్రీనివాస్‌, నాయకులు రెడ్డి శ్రీనివాస్‌, అక్రం, మాచర్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు.  

ఓదెల మండలం కనగర్తిలో శుక్రవారం అధికారుల బృందం ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పించింది.  వైరస్‌ వ్యాప్తి చెందే విధానం, ముం దు జాగ్రత్తలపై ప్రజలకు వివరించి అప్రమత్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సత్తయ్య, సర్పంచ్‌ దామోదర్‌ రెడ్డి, కార్యదర్శి రాజేశం, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎలిగేడు(జూలపల్లి) : ఎలిగేడు మండలం ధూళికట్టలో స్వచ్ఛ శుక్రవారం పురస్కరించుకొని కరోనా వైరస్‌పై ప్రజలకు సర్పంచ్‌ గొల్లె కావేరి, వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఇంటింటికీ తిరిగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో డాక్టర్‌ సరిత, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పరిశుభ్రత పాటించాలి

కాల్వశ్రీరాంపూర్‌ : ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని డాక్టర్‌ మహేందర్‌ కుమార్‌ గ్రామస్తులకు సూచించారు. మండల కేంద్రంలో శుక్రవారం కరోనాపై అవగాహన కల్పించారు. అనంతరం బీపీ, షుగర్‌, క్యాన్సర్‌పై పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా 55 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఈఓ జెట్టి సుధాకర్‌, వైద్య సిబ్బంది అమరావతి, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. 

సుల్తానాబాద్‌రూరల్‌: గర్రెపల్లిలో శుక్రవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యు లు, వైద్య సిబ్బంది కలిసి ఇంటింటికీ తిరుగుతూ కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జేడీఏ రాజన్న అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వీరగోని సుజాత, ఎంపీటీసీ సభ్యురాలు పులి అనూష, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్‌, నాయకులు వీరగోని రమేశ్‌గౌడ్‌, ఆంజనేయులు, శ్రీనివాస్‌, హన్మంతరావు కార్మికులు, సిబ్బంది తదితరులున్నారు. 

ఎలిగేడు(జూలపల్లి) :‘గోదారి కాంతలక్ష్మి’ సేవా సమితి ఆధ్వర్యంలో కరోనా వైరస్‌ నియంత్రణపై ఎలిగేడు మండలం ధూళికట్టలో శుక్రవారం ప్రచా రం చేశారు. సంస్థకు చెందిన యువకులు ప్రధాన కూడళ్లల్లో వాల్‌ పోస్టర్లు అతికించారు. అలాగే శివపల్లిలో ఓ కుల సంఘం పోశమ్మ బోనాలు చేసుకునేందుకు సిద్ధపడగా, కరోనా వైరస్‌ అరికట్టేందుకు వేడుకలు నిలిపేసి సహకరించాలని గ్రామ పంచాయతీ తరఫున నోటీస్‌ జారీ చేశారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు జితేందర్‌, కొక్కిరాల దామోదర్‌ రావు, బత్తిని శ్రీనివాస్‌, భూసారపు ఎల్లయ్య, రంగు శ్రీనివాస్‌, దవెల్ల తిరుపతి, అక్కపెల్లి దిలీప్‌, రాజు, కొయ్యాడ రామాంజం, అక్కపెల్లి సంపత్‌ పాల్గొన్నారు. 

పెద్దపల్లి జంక్షన్‌: పెద్దపల్లి మండలం అప్పన్నపేట, బొంపెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయా ల్లో శుక్రవారం ప్రజలకు కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడిపై ఎంపీడీఓ రాజు ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో సర్పంచులు చీకటి స్వరూప, అరికిల్ల లక్ష్మయ్య, ఎంపీఓ సుదర్శన్‌, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ముందు జాగ్రత్తలు పాటిద్దాం

పెద్దపల్లిటౌన్‌: ముందు జాగ్రత్తలు పాటించి కరోనాను అరికడుదామని పెద్దపల్లి మున్సిపాలిటీ కమిషనర్‌ సీహెచ్‌ తిరుపతి పేర్కొన్నారు. పెద్దపల్లి 8వ వార్డులో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమాన్ని చేపట్టగా, వార్డు కౌన్సిలర్‌ బొంకూరి భాగ్యలక్ష్మి నేతృత్వంలో కరోనా వైరస్‌ నిర్మూలన వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనట్లు అనిపిస్తే తక్షణమే హెల్ప్‌లైన్‌ 040-2465119 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. అలాగే ఇంటింటికీ కరో నా వైరస్‌పై అవగాహన కల్పించే వాల్‌పోస్టర్లను అంటించారు.  కార్యక్రమంలో ఏఎంఐఎం జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ మస్రత్‌, నాయకులు బొంకూ రి సురేందర్‌, కోల కిషన్‌, రబ్బాని, పెర్క శ్రీనివాస్‌, కుక్క అనిత, కొండ్ర రాజేశ్వరి, శంకర్‌, రాజేందర్‌, సుమలత తదితరులున్నారు.

అవగాహన పెంచుకోవాలి

ఎలిగేడు(జూలపల్లి) : కరోనా వైరస్‌పై అవగాహన పెంచుకోవాలని డీఎల్‌పీఓ దేవకిదేవి సూచించారు. ఎలిగేడులో శుక్రవారం నిర్వహించిన ఓ పెళ్లి వేడుకలకు ఆమె హాజరై కరోనా వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలపై వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల దాకా కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే గడపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే డీఎల్‌పీఓ వీధుల్లో పర్యటించి మురుగు కాల్వలు, అంతర్గత రహదారులు పరిశీలించారు. 


logo