శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 21, 2020 , 02:52:47

‘బీ థర్మల్‌'కు మరో ఏడేళ్ల భవిత

‘బీ థర్మల్‌'కు మరో ఏడేళ్ల భవిత

  • మూసివేత జాబితా నుంచి తొలగింపు
  • అంతర్గతంగా నిర్ణయించిన సీఈఏ
  • 2026 దాకా విద్యుదుత్పత్తికి  అవకాశం 
  • ఫలించిన ఎంపీ వెంకటేశ్‌, ఎమ్మెల్యే చందర్‌ కృషి
  • ఉద్యోగుల్లో హర్షం 

గోదావరిఖని, నమస్తేతెలంగాణ: రామగుండం బీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం మరో ఏడేళ్లు కొనసాగనున్నది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా దేశవ్యాప్తంగా 200 మెగావాట్లలోపు చిన్న ప్లాంట్లను ఈ నెల 31తేదీన మూసివేయాలని సీఈఏ (సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ) నిర్ణయించగా, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేతకాని, ఎమ్మెల్యే చందర్‌ చేసిన కృషితో మూసివేత నిలిచిపోయింది. రామగుండం బీ థర్మల్‌ కేంద్రం 62.5 మెగావాట్ల సామర్థ్యంతో 1970లో ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట్రంలోనే తొలివెలుగులు పంచింది. అంతకుముందే నిజాంకాలంలో ఇక్కడ ‘ఏ థర్మల్‌' కేంద్రం కొనసాగగా, తదనంతర కాలం లో మూతపడింది. అయితే బీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం విజయవంతంగా కొనసాగుతున్నది. నాలుగేళ్లుగా విద్యుదుత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నది. 

అన్నీ అదుపులోనే.. 

పర్యావరణ పరిరక్షణకు ఇబ్బందిగా ఉండి, 200 మెగావాట్లలోపు ఉన్న పాత ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయించిన సీఈఏ కొన్నేళ్లుగా వాటిని సందరిస్తూ సాంకేతిక పరమైన అంశాలను పరిశీలిస్తూ మూసివేతకు నోటీసులు జారీ చేస్తున్నది. అయితే బీ థర్మల్‌ కేంద్రంలో అన్నీ అదుపులోనే ఉన్నాయి. హీట్‌రేట్‌ 3000 కేసీ/కేడబ్ల్యూలోపు ఉండాల్సి ఉండగా, 2600 నమోదవుతున్నది. ఎస్పీఎం వందలోపు ఉండాల్సి ఉండగా 90లో నడుస్తోంది. సీపీసీబీ మెథడ్‌ 600లోపు ఉండాల్సి ఉండగా 475 మాత్రమే ఉంది. ఎన్‌వో2 సీపీపీబీ మెథడ్‌ 300లోపు ఉండాల్సి ఉండగా 140 దాకా నమోదవుతున్నదని అధికారులు చెప్పారు. ఈ క్రమంలో గత డిసెంబర్‌లో పరిశీలనకు వచ్చిన  సీఈఏ, మినిస్త్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ ఫారెస్టు కోల్‌మైట్‌ చేంజ్‌(ఎంఈ ఎఫ్‌అండ్‌సీసీ), సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఎన్టీపీసీకి చెందిన ప్రతినిధులు బీ థర్మల్‌ కేంద్రాన్ని పరిశీలించగా, ప్లాంట్‌ నిబంధనలకు లోబడే ఉన్నదని అధికారులు వివరించారు. అయినా నిర్ణ యం వెలువరించకుండా ఉండడంతో మూసివేతపై ఆందోళన నెలకొంటూ వస్తున్నది. 

ఎంపీ, ఎమ్మెల్యే కృషి..

కేంద్ర ప్రభుత్వం చిన్న థర్మల్‌ కేంద్రాలను మూసివేస్తుందన్న సమాచారంతో బీ థర్మల్‌ కొనసాగింపు కోసం ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేతకాని, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అలుపెరగని కృషిచేశారు. ఢిల్లీలోని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్‌ ప్రకాశ్‌ మహాస్కేను ప్రత్యక్షంగా కలిసి బీ థర్మల్‌ ప్రత్యేకతను వివరించారు. దేశంలో తొలి విద్యుత్‌ ఉత్పత్తి రామగుండంలో మొదలైందని, 1947లో నిజాంరాజు ఏ థర్మల్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి విద్యుత్‌ ఉత్పత్తి చేశారని బీ థర్మల్‌తోనూ సత్ఫలితాలు వస్తున్నాయని, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేవని వివరించారు. మంత్రి కేటీఆర్‌ చొరవతో నాలుగు నెలలుగా కేంద్రప్రభుత్వంపై చాలా ఒత్తిడి చేయగా, అన్ని పరిశీలించిన సీఈఏ ఎట్టకేలకు మూసివేత జాబితా నుంచి తొలగించింది. మరో ఏడేళ్లు కొనసాగించుకోవాలని నిర్ణయించడంతోపాటు ఇటీవలే ఉద్యోగులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. 

2014లో నూతన ఈఎస్పీ ఏర్పాటు

మూసివేతకు సిద్ధంగా ఉన్న బీ థర్మల్‌కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా నడిపించి ఇక్కడి ఉద్యోగులకు భద్రత కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర సర్కారు 2014లోనే పర్యావరణ పరిరక్షణ కోసం రూ.100 కోట్లతో నూతన ఈఎస్పీ (ఎలక్ట్రోస్టాటిక్‌ ప్రిసిబిరేటర్‌)ను అనుసంధానించారు. స్థానిక ఇంజినీర్లు, కార్మికులు, అప్పటి ఆర్టిజన్లు సంయుక్తంగా కాంట్రాక్టర్‌కు సంబంధం లేకుండా ఈఎస్పీ నెలకొల్పారు. అప్పటి నుంచి సత్ఫలితాలు వస్తున్నాయి. అయితే 2026 దాకా ఈఎస్పీ సంబంధించిన రూ. 100 కోట్లు రాబట్టుకోవాల్సి ఉంది. అలాగే బీ థర్మల్‌కేంద్రానికి సం బంధించిన యాష్‌పాండ్‌ సుమారు 100 ఏండ్ల దా కా నిండే పరిస్థితిలేదు. ఇక్కడి యాష్‌పాండ్‌ నుంచి సిమెంట్‌ పరిశ్రమకు, ఇటుకల తయారీకి బూడిదను సరఫరా చేస్తున్నారు. 

ఉత్పత్తిలో నాలుగేళ్లుగా రికార్డు.. 

1970లో ప్రారంభమైన బీ థర్మల్‌ కేంద్రం 40 ఏళ్లుగా నిర్విరామంగా విద్యుదుత్పత్తి చేస్తున్నది. ఏటా మార్చి నాటికి నిర్దేశిత లక్ష్యాని కంటే అధికంగా ఉత్పత్తి చేస్తున్నది. 62.5 మెగావాట్ల బీ థర్మల్‌ కేంద్రం వార్షిక పీఎల్‌ఎఫ్‌(ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌) ఏటా మొదటి, రెండోస్థానాలు సాధిస్తున్నది. ఇప్పటికీ గడిచిన నాలుగు సంవత్సరాలుగా 100శాతం పీఎల్‌ఎఫ్‌ను సాధిస్తున్నది. 

బోర్డు సభ్యులకు వివరించాం..

బీ థర్మల్‌ కేంద్రం టెక్నాలజీ, కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను గత డిసెంబర్‌లో ఇక్కడికి వచ్చిన  కేంద్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సభ్యులకు వివరించాం. అన్ని నిబంధనలకు లోబడే ఉన్నాయని చెప్పాం. దేశంలో 200 మెగావాట్ల కన్నా తక్కువ విద్యుత్‌ ఉత్పతితోపాటు, 30 ఏళ్ల పైబడి పాత టెక్నాలజీ నడుస్తున్న కర్మాగారాలను ఈ నెల 31న మూసివేయాలని ఆదేశాలు వచ్చాయి. కానీ ప్రత్యేకంగా బీ థర్మల్‌ కోసం మాత్రం ఆదేశాలు రాలేదు. 

- విజేందర్‌, ఎస్‌ఈ, బీ థర్మల్‌ కేంద్రం  


logo