ఆదివారం 24 మే 2020
Peddapalli - Mar 20, 2020 , 02:21:50

మంథనిని మరో కోనసీమ చేస్తాం

మంథనిని మరో కోనసీమ చేస్తాం

  • మానేరుపై కొత్తగా ఆరు చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నాం
  • రైతన్నకు పుష్కలంగా నీరందించడమే లక్ష్యం
  • జడ్పీ చైర్మన్‌ మధు 
  • గోపాల్‌పూర్‌ శివారులో చెక్‌ డ్యాం  ప్రతిపాదిత స్థలం పరిశీలన

మంథని రూరల్‌ : కాళేశ్వరం జలాలతో మంథని ప్రాంతాన్ని మరో కోనసీమగా మారుస్తామని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే మానేరు వాగుపై చెక్‌ డ్యాంల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంథని మండలం గోపాల్‌పూర్‌ గ్రామ శివారులో గల మానేరు వాగుపై చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టనున్న క్రమంలో, నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని గురువారం అధికారులతో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా సాగు నీటి కోసం తండ్లాడిన రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మించి, జాతికి అంకితం ఇచ్చారన్నారు. ఇప్పుడు గోదావరి నిండు కుండలా ఉండడంతో పాటు రైతులకు సాగు నీరు పుష్కలంగా కాలువల ద్వారా అందుతున్నదన్నారు. అలాగే, కరీంనగర్‌ నుంచి మంథని వరకు మానేరు వాగులపై పెద్ద సంఖ్యలో చెక్‌ డ్యాంల నిర్మాణం చేపట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిధులు మంజూరు చేశారన్నారు. ఇందులో భాగంగా మంథని నియోజకవర్గంలో ఆరు చెక్‌ డ్యాం మంజూరయ్యాయని పేర్కొన్నారు. దీంతో అటు గోదావరి, ఇటు మానేరు వాగులు నిండు కుండలా ఉండి మంథని ప్రాంతంమంతా మరో కోనసీమగా మారుతుందని వివరించారు. మానేరు వాగుపై చెక్‌ డ్యాంకు మెడ రాజయ్య పేరు పెట్టేలా ప్రభుత్వంతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల కిరణ్‌, వైస్‌ చైర్మన్‌ బెల్లంకొండ ప్రకాశ్‌రెడ్డి, నాయకులు తగరం శంకర్‌లాల్‌, తిరుపతి, వంశీరాజ్‌, ఐబీ జేఈ తిరుపతి, ఉన్నారు. 


logo