మంగళవారం 02 జూన్ 2020
Peddapalli - Mar 20, 2020 , 03:19:19

25వేల మందికి స్క్రీనింగ్‌ టెస్టులు

25వేల మందికి స్క్రీనింగ్‌ టెస్టులు

 • 6,126 ఇండ్లలో పరీక్షలు చేశాం
 •  ఏ ఒక్కరికీ కరోనా లక్షణాల్లేవు  
 • ఇది సంతోషకరమైన అంశం
 • నగరం మొత్తం స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తాం
 • విలేకరుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్‌
 • ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి

కరీంనగర్‌ ప్రధానప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌పై మొదటి రోజు వైద్యబృందాలు 25వేల మందికి స్క్రీనింగ్‌ టెస్టులు చేశాయని, ఎవరికీ కరోనా లక్షణాలు లేవని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. గురువారం ఉదయం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం వైద్య సిబ్బందికి కిట్లు పంపిణీ చేసి దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న వీధుల్లో స్వయంగా పర్యటించారు. మసీదులకు వెళ్లి పరిస్థితిని ఆరా తీశారు. తిరిగి రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. జిల్లా కేంద్రంలో కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని పిలుపునిచ్చారు. ఎవరైనా ఇతర దేశాల నుంచి వస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. 

 • ఇండోనేషియా నుంచి వచ్చిన పది మంది వ్యక్తులు తిరిగిన కిలోమీటర్‌ ప్రాంతంలో మొదటి రోజు వైద్య బృందాలు స్క్రీనింగ్‌ నిర్వహించాయి. మొత్తం 6,126  గృహాల్లోని 25 వేల మందిని స్క్రీనింగ్‌ చేశాయి. ఏ ఒక్కరికీ కరోనా వ్యాధి లక్షణాలు లేవు. ఇది సంతోషకరమైన అంశం.  
 • సర్వేలో భాగంగా వివిధ దేశాల నుంచి 20 మంది వచ్చినట్లు గుర్తించాం. వారికి కరోనా వ్యాధి లక్షణాలు లేకపోయినప్పటికీ ఇంటిలోనే స్వీయ నిర్బంధం చేసుకుని ఉండాలని సూచించగా, వారంతా అంగీకరించారు. మరో ఆరుగురు విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వారికి దగ్గు, జలుబు, ఉంది. వీరిని కూడా ఇంటికే పరిమితం చేస్తున్నాం. మరో ఇద్దరు వ్యక్తులు విదేశాల నుంచి వచ్చిన వారిని కలిసి వచ్చారు. వారిని కూడా ఇంటికే పరిమితం చేశాం. 
 • ఈ నెల 31 వరకు స్క్రీనింగ్‌ పరీక్షలు కొనసాగుతాయి. కరీంనగర్‌లో ఉన్న 90 వేల గృహాల్లో కచ్చితంగా స్క్రీనింగ్‌ చేస్తాం. ప్రజలందరూ సహకరించాలి. 
 • శానిటేషన్‌లో భాగంగా 65 సిలిండర్లతో హైపో క్లోరైడ్‌ స్ప్రే చేయిస్తాం. నగరం మొత్తం బ్లీచింగ్‌ చల్లిస్తాం. దాని తర్వాత ఫినాయిల్‌తోనే స్ప్రే చేయిస్తాం. ఇందుకోసం ఆదేశాలు జారీ చేశాం. 
 • ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులను కలిసిన వారిలో కొంతమందిని గాంధీ దవాఖానకు పంపించగా వారికి వ్యాధి నిర్ధారణ లేదని తేలింది. అయినప్పటికీ మరోసారి పరీక్ష కోసం చల్మెడ దవాఖానకు పంపించాం. మాస్క్‌ల కొరత ఉన్న విషయాన్ని గుర్తించాం. మెప్మా ద్వారా ఈ కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 
 • హోటళ్లు, టిఫిన్‌ సెంటర్ల వద్ద శానిటైజర్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి. 
 • నివారణలో భాగంగా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి. ఎక్కువ మంది గుమిగూడకూడదు. ఏమాత్రం అనుమానం వచ్చినా సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందజేయాలి. ఈ రోజు పాటించిన అన్ని జాగ్రత్తలు, అందించిన సహకారం ఈ నెల 31 వరకు కొనసాగాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 
 • ‘ఈ నగరం మనది-ఆరోగ్యకరమైన నగరాన్ని నిర్మించుకుందా’మనే నినాదంతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు సహకరించాలి. విలేకరుల సమావేశంలో నగర కమిషనర్‌ క్రాంతి, డీఎం అండ్‌ హెచ్‌వో సుజాత, పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

స్వచ్ఛందంగా సహకరిస్తున్న ప్రజలు

కరీంనగర్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల వ్యవహారం బయటకు రావడం.. ఇదే సమయంలో రాష్ట్ర సర్కారు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడం.. ఆ మేరకు ప్రజలకు సహకరించాలని మంత్రి గంగుల కమలాకర్‌, కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి విజ్ఞప్తి చేస్తుండడంతో ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజల నుంచి సంపూర్ణ సహకారం అందుతున్నది. గురువారం మెజార్టీ ప్రాంతాల్లో ప్రజలు స్వీయ నిర్బంధం చేసుకున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాలేదు. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు బోసిపోయి కనిపించాయి. ప్రధాన రహదారులతోపాటు గల్లీ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. షాపింగ్‌మాల్స్‌తో పాటు చిన్న, మధ్యతరహా దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రముఖ వ్యాపార కేంద్రమైన గంజ్‌, క్లాక్‌ టవర్‌ ప్రాంతాల్లో దుకాణాలను మూసి వేశారు. మరోవైపు గురువారం పదోతరగతి పరీక్షలు ప్రారంభం కాగా.. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులూ లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. చాలా మంది విద్యార్థులు మాస్కులు ధరించి పరీక్షలకు హాజరయ్యారు.


logo