సోమవారం 30 మార్చి 2020
Peddapalli - Mar 19, 2020 , 13:27:20

భయం వద్దు...కట్టడికి అన్ని రకాల చర్యలూ

భయం వద్దు...కట్టడికి అన్ని రకాల చర్యలూ

  • ‘కరోనా’ కట్టడికి అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నాం
  • కలెక్టరేట్‌ నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు  అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు
  • నేటి నుంచి ఇంటింటికీ వైద్య పరీక్షలు చేయిస్తాం
  • వంద బృందాలు ఏర్పాటు చేశాం
  • విలేకరుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్‌
  • సంపూర్ణంగా సహకరించాలి : కలెక్టర్‌ శశాంక

కరీంనగర్‌ పట్టణంలో కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నామని, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌పై కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, ఇతర అధికారులతో కలిసి కరీంనగర్‌ కలెక్టరేట్‌లో బుధవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 14న వివిధ పనుల నిమిత్తం ఇండోనేషియా నుంచి పది మంది వ్యక్తులు వచ్చినట్లు తెలిపారు. విదేశాల నుంచి వచ్చారు..కాబట్టి పరీక్షల నిమిత్తం ముందుగా జిల్లా కేంద్రంలోని దవాఖానకు తరలించిన తర్వాత వైద్య పరీక్షల కోసం గాంధీ వైద్యశాలకు ఈనెల 16న తరలించినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎనిమిది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వెల్లడించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కరోనా ప్రభావం కరీంనగర్‌లో ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించి అప్రమత్తమైందని, కట్టడి కోసం అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. ప్రధానంగా ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా కలెక్టరేట్‌ కేంద్రంగా మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప మూడు, నాలుగు రోజులు బయటికి రావద్దని కోరారు. పదో తరగతి పరీక్షలు ఉన్న నేపథ్యంలో సంబంధిత విద్యార్థులు, తల్లిదండ్రులు వెళ్లవచ్చని, అదే సమయంలో ఒకే దగ్గర జనం గుమిగూడకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. కరోనా తీవ్రత ఉందని చెప్పడమే ఇందులో ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అలాగే, మూడు, నాలుగు రోజులపాటు అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో నేటి నుంచి ప్రతి ఇంటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించడం కోసం వైద్య ఆరోగ్యశాఖ తరఫున వంద బృందాలను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యక్రమాలు చేసుకునే వారు తక్కువ మందితో ముగించుకోవాలని సూచించారు. ప్రజలు ఎవరికి వారే స్వీయ నియంత్రణ విధించుకుంటే వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సహకరించాలి : కలెక్టర్‌ శశాంక

కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టే ప్రక్రియ సజావుగా కొనసాగాలంటే అన్ని వర్గాలు, మతాలు సంపూర్ణంగా సహకరించాలని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ శశాంక కోరారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తులు కరీంనగర్‌లో నివాసం చేసిన 48 గంటల్లో ఎక్కడ తిరిగారు?, ఎవరిని కలిశారు?, అనే పూర్తి వివరాలు సేకరించడంతోపాటు ఆ మేరకు సంబంధిత వ్యక్తులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిత్యావసరాల సరుకులకు సంబంధించిన దుకాణాలు, వైద్యరంగానికి సంబంధించిన దవాఖానలు మినహా మిగిలిన అన్నింటిని మూడు, నాలుగు రోజులపాటు మూసి ఉంచేందుకు సహకరించాలని కోరారు. జిల్లా వైద్య బృందంతోపాటు రాష్ట్ర టీంలు కూడా రంగంలోకి దిగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే, గత 20 రోజులుగా వివిధ విదేశాల నుంచి కరీంనగర్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలనూ శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి సేకరించి సంబంధిత వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదే సందర్భంలో విదేశాల నుంచి వస్తున్న వ్యక్తులు, వచ్చిన తర్వాత 20 రోజలు పాటు ఇంటి నుంచి బయటికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా కరోనా వ్యాధి పరీక్షల నిమిత్తం జిల్లా కేంద్రంలో 20 ఐసోలేషన్‌ బెడ్స్‌ను, పది ఐసీయూ పడకలతోపాటు ప్రతిమలో 50, చల్మెడ దవాఖానలో 50 పడకలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ హాస్పిటళ్లతో కలిపి సంయుక్తంగా కరోనా కట్టడి కోసం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి చేసే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్‌, వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సుజాత పాల్గొన్నారు. 



logo