బుధవారం 01 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 19, 2020 , 04:21:40

కరోనాపై కట్టుదిట్టం

కరోనాపై కట్టుదిట్టం

  • కరీం‘నగరం’లో వైరస్‌పై రాష్ట్ర సర్కారు హై అలర్ట్‌
  • ఇండోనేషియా నుంచి వచ్చిన ఎనిమిది మందికి పాజిటివ్‌ 
  • ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి జిల్లా యంత్రాంగం
  • ‘భయం వద్దు.. మేమున్నా’మంటూ ప్రజలకు భరోసా
  • కలెక్టర్‌, సీపీ, అధికారులతో మంత్రి గంగుల అత్యవసర సమావేశం
  • శరవేగంగా నివారణ చర్యలు
  • కలెక్టరేట్‌ చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి 
  • నేటి నుంచి వంద వైద్య బృందాలతో ఇంటింటా పరీక్షలు  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక బృందాలు     

‘ఇక సమష్టిగా పోరాడుదాం.. ఆరోగ్య తెలంగాణకు కృషి చేద్దాం..’ ఇది మన రాష్ట్ర సర్కారు నినాదం! కరీం‘నగరం’లో కరోనా కలకలంపై ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. తక్షణమే రంగంలోకి దిగి, ప్రజలకు మేమున్నామనే భరోసానిస్తున్నది. కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా దేశస్థుల్లో ఎనిమిది మందికి పాజిటివ్‌ రావడంతో కట్టుదిట్టుమైన చర్యలు చేపట్టింది. ఈ మేరకు వచ్చిన ఆదేశాలతో అధికారయంత్రాంగం వైరస్‌ కట్టడికి కదిలింది. ఇండోనేషియా వాసులు సంచరించిన కలెక్టరేట్‌ ఏరియాలోని దుకాణ సముదాయలను మూసి వేయించింది. వంద వైద్య బృందాలతో నేటి నుంచి ఇంటింటా పరీక్షలు చేయించే పనిలో నిమగ్నమైంది. మరోవైపు నగరమంతా శానిటైజేషన్‌ కార్యక్రమాలను చేపట్టింది. కలెక్టర్‌, సీపీ, జిల్లా స్థాయి అధికారులతో జిల్లా మంత్రి గంగుల కమలాకర్‌ అత్యవసర సమావేశం నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. కరోనా కట్టడికి పూర్తి స్థాయి చర్యలు చేపట్టామని, ప్రజలెవరూ భయపడవద్దని భరోసా ఇచ్చారు.

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఈ నెల 14న ఇండోనేషియాకు చెందిన పది మంది మత ప్రచారకులు కరీంనగర్‌కు వచ్చారు. రైలులో ఢిల్లీ నుంచి రామగుండం వచ్చిన సదరు వ్యక్తులు, నేరుగా ఆటో ద్వారా కరీంనగర్‌ చేరుకున్నారు. అనంతరం స్థానికంగా ఉండి వారి కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటికే కరోనా వైరస్‌ ఇండోనేషియాలో ప్రబలుతున్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు, సదరు మత ప్రచారకులను ఈ నెల 16 ఉదయం కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని ప్రధాన దవాఖానకు తరలించారు. అక్కడ కొన్ని వైద్య పరీక్షలు చేసిన అనంతరం వారిని హైదరాబాద్‌లోని గాంధీ వైద్యశాలకు తరలించారు. ఆ మేరకు సంబంధిత వ్యక్తుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లుగా 17న గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు మిగిలిన మత ప్రచారకుల నమూనాలను కూడా పుణెకు పంపించగా, బుధవారం మరో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారించారు. అయితే స్థానికంగా కొంతమంది మత ప్రచారకులు వీరితో కలిసి తిరిగారు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని సంబంధిత వ్యక్తులను కూడా పరీక్షల నిమిత్తం గాంధీ దవాఖానకు బుధవారం తరలించారు. 

సర్కారు అప్రమత్తం..

ఇండోనేషియా నుంచి వచ్చిన వారిలో ఎనిమిది మందికి పాజిటివ్‌ రావడం.. నగరంలో ఆందోళన నెలకొనడంతో రాష్ట్ర సర్కారు వెంటనే అప్రమత్తమైంది. ప్రజలకు భరోసా ఇవ్వడంతోపాటు కట్టడి కోసం చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం అలర్ట్‌ అయింది. ఆ మేరకు అధికారులు రంగంలోకి దిగారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తులు కరీంనగర్‌లో 48 గంటల పాటు ఎక్కడెక్కడ ఉన్నారు?,  ఏ ఆటోలో వచ్చారు?, ఎక్కడెక్కడికి వెళ్లారు?, ఎవరిని కలిశారు, ప్రచారం ఎక్కడ నిర్వహించారు?, ఏయే ఇళ్లలో నివాసం ఉన్నారు?.  ఇలాంటి తదితర పూర్తి వివరాలను సేకరించారు. ఆ మేరకు కొంతమందిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. 

శరవేగంగా ముందస్తు చర్యలు..

ప్రధానంగా ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తులు జిల్లా కలెక్టరేట్‌ పక్కన ఉన్న ఒక ప్రార్థనా మందిరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో కలెక్టరేట్‌ నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో శరవేగంగా నివారణ చర్యలు చేపట్టారు. వెంటనే కలెక్టరేట్‌ ఏరియాలో మొత్తం దుకాణాలను మూసివేయించారు. మూడు, నాలుగు రోజుల పాటు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని స్పష్టం చేస్తున్నారు. వంద వైద్య బృందాలను ఏర్పాటు చేసి, గురువారం నుంచి ప్రతి ఇంట్లో పరీక్షలు చేయనున్నారు. అలాగే, ఆలయాలు ప్రార్థనా మందిరాలకు వెళ్లద్దని అన్ని మతాల వారికీ విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతోపాటు నగరం మొత్తం శానిటైజేషన్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో బస్‌స్టేషన్లు, జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, ప్రజలు గుమిగూడి ఉండవద్దని సూచిస్తున్నారు. కరీంనగర్‌ జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి కరోనా త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలను అన్ని రకాలుగా అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు నేటి నుంచి పదో తరగతి పరీక్షలు యథావిధిగా కొనసాగించడానికి అవకాశం కల్పిస్తూనే, కేంద్రాల వద్ద జన సమూహం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు విద్యాశాఖ తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు కలెక్టర్‌ శశాంక ఆదేశాలు జారీ చేశారు. 

అన్ని దవాఖానల్లో ప్రత్యేక ఏర్పాట్లు

ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో 20 బెడ్లతో ఐసోలేషన్‌ వార్డు, పది బెడ్లతో ఐసీయూను అందుబాటులోకి తెచ్చారు. అలాగే, అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రతిమ, చల్మెడ వైద్యశాలల్లో 50 చొప్పున పడకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతోపాటు అత్యవసర చికిత్స అందజేసేందుకు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలను రంగంలోకి దింపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నుంచి గురువారం జిల్లా కేంద్రానికి ప్రత్యేక బృందాలు రానున్నాయి. ఇవి కూడా ఎప్పటికప్పుడు వైద్య సదుపాయాలను పర్యవేక్షించి కరోనా కట్టడికి చర్యలు తీసుకోనున్నాయి. 

 మంత్రుల ప్రత్యేక పర్యవేక్షణ..

కరీంనగర్‌ జిల్లాకేంద్రంలో నెలకొన్న పరిస్థితులను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటూనే, మరోవైపు ప్రజలకు పూర్తిస్థాయి భరోసాను ఇస్తున్నది. జిల్లా యంత్రాంగాన్ని రంగంలోకి దింపి, మేమున్నామని ధైర్యం కల్పిస్తున్నది. కరోనా తీవ్రత ఉందన్న విషయాన్ని వివరిస్తూనే భయపడాల్సిన అవసరం లేదని, కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచిస్తున్నారు. అలాగే, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. అధికారులకు మార్గనిర్దేశం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వైరస్‌ నివారణకు ప్రజలంతా సంపూర్ణంగా సహకరించాలని మంత్రి గంగుల కమలాకర్‌ బుధవారం విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ప్రజలకు నష్టం జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం తీసుకునే అన్ని రకాల చర్యలకు సహకరించాలని పిలుపునిచ్చారు. అయితే, కరోనా విషయంలో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం చేపట్టే అన్ని రకాల చర్యలు కేవలం ముందస్తులో భాగమేనని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాధి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్‌కు ఎలాంటి నష్టం వాటిల్లవద్దన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాలు, మతాలు ఎవరికి వారే వీలైనంత మేరకు బయటికి రాకుండా స్వీయ నియంత్రణ విధించుకోవాలని విజ్ఞప్తి చేశారు.


స్టేట్‌ కంట్రోల్‌ రూం నంబర్‌ 

040-24651119

జిల్లా కంట్రోల్‌ రూం నంబర్‌

98499 02501

జిల్లా ప్రధాన దవాఖాన నంబర్‌

98491 61949 

ఎం జ్యోతి, జిల్లా ఎపిడెమాలజిస్ట్‌ 

98854 32366

కృష్ణ ప్రసాద్‌, ఫిజీషియన్‌ 

99493 97284

సుజాత, డీఎంహెచ్‌వో (కరీంనగర్‌)

98499 02494

టోల్‌ ఫ్రీ నంబర్‌ 

104

ఈ జాగ్రత్తలు పాటిద్దాం

  1. కరోనా వైరస్‌ చేతులు, ముక్కు, కండ్లు, నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుంది.
  2. 80శాతం మందిలో సాధారణ ప్లూ, జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండి వారం పదిహేను రోజుల్లో అన్నీ తగ్గిపోతాయి. 20శాతం మందిలోనే కొంచెం తీవ్రంగా ఉండొచ్చు. 
  3. కరోనా ఎక్కువగా వృద్ధులు, బీపీ, షుగర్‌, క్యాన్సర్‌, గుండె, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు, వ్యాధి నిరోధకత తక్కువ ఉన్నవారిపై ప్రభావం చూపిస్తుంది. యువతలో కూడా ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంది. 
  4. జ్వరంతో ఉన్నవారికి దూరంగా ఉండడంతో పాటు జ్వరంలా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. విదేశాల నుంచి వచ్చిన వారు దగ్గు, జలుబు, జ్వరంతో ఉంటే వారిని 14 రోజుల పాటు ప్రత్యేక గదిలో ఉంచడంతో పాటు వారిని కలవకపోవడం మంచిది. దగ్గు, జలుబు లాంటి లక్షణాలు అన్నీ కరోనా వైరస్‌కు సంబంధించినవి కావు. వాటిలో సాధారణ ఫ్లూలు కూడా ఉండచ్చు. సరైన మందులు వాడి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. దగ్గు, తుమ్ములు వస్తుంటే వెంటనే ఖర్చీఫ్‌ అడ్డుపెట్టుకోవాలి. తుంపరలు ఎదుటివారిపై పడకుండా చూసుకోవాలి. 
  5. ముక్కు, నోరు, తలను చేతులతో తాకవద్దు. ఎక్కడికైనా బయటకు వెళ్లి వస్తే తప్పకుండా చేతులు కడుక్కోవాలి. శానిటైజర్లు వాడాలి. నీటితో శుభ్రం చేసుకునేటప్పుడు కనీసం 20సెకండ్ల పాటు చేతివేళ్లు, వేళ్ల సందులు, మోచేతి వరకు బాగా కడుక్కోవాలి. ఎవరినైనా కలిసేటప్పుడు షేక్‌హ్యాండ్‌ ఇవ్వకుండా నమస్కారంతో పలకరించడం మంచిది. 
  6. రోజూ సరిపడా నీటిని తాగాలి. పరిశుభ్ర ఆహారాన్ని తీసుకోవాలి. ఉడికీఉడకని ఆహారం, పచ్చి పదార్థాలు, పచ్చిపాలు, బయటి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. శీతల పానీయాలు, చల్లని నీరు, ఐస్‌ క్రీమ్‌లు తీసుకోవద్దు. చికెన్‌, మటన్‌, గుడ్డు వంటివి బాగా ఉడికించిన తర్వాతే తినాలి. 
  7. గృహిణులు ఇంట్లో ఎప్పుడూ పరిశుభ్ర వాతావరణం ఉండేలా చూసుకోవాలి. వంట పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. ఎంగిలి పదార్థాలను తినకపోవడం మంచిది. 
  8. వీలైనంత మట్టుకు దూర ప్రయాణాలను మానుకోవడం మంచిది. రద్దీ ప్రాంతాలకు వెళ్లకూడదు. ఉత్సవాలు, శుభకార్యాలను కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకోవాలి. ఒకవేళ ముందే బుక్‌చేసుకున్న శుభకార్యాలకు ఎక్కువ మందిని పిలవకపోవడం ఉత్తమం. ఫంక్షన్లకు వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖానికి మాస్కులు ధరించి వెళ్లాలి. 
  9. చాలామంది కరోనాపై ఏది నిజమో తెలుసుకోకుండానే మెసెజ్‌లు, వీడియోలు ఫార్వర్డ్‌ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై వెంటనే ఒక నిర్ణయానికి రావద్దు. 
  10. ఆఫీసులు, ఇతర ఉపాధి పనులు చేసే చోట ఉద్యోగులు తగు జాగ్రత్తలు పాటించాలి. వీలైనంత మట్టుకు ముఖానికి ఖర్చీఫ్‌ కట్టుకొని విధులకు హాజరుకావడం మచింది. విధుల సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే లోనికి వచ్చే ముందు చేతులను కడుక్కోవాలి. కొంత మంది ఒకే చోట విధులు నిర్వర్తించాల్సి వస్తే అక్కడి ప్రదేశాలు ఎప్పుటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎవరికైనా జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే ఇతరులకు దూరంగా ఉండాలి. 


 పిల్లలపై జాగ్రత్తలు

  1. పిల్లల చేతులను వీలైనప్పుడల్లా శానిటైజర్‌తో శుభ్రం చేయాలి. ఏసీలాంటి చల్లని ప్రదేశాలకు దూరంగా ఉంచాలి. చల్లని నీటిని తాగించవద్దు. గది, శరీర వాతావరణం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. 
  2. పిల్లలు అదేపనిగా కళ్లు, ముక్కు, నోటిని చేతులతో నలుసుకోకుండా చూడాలి. నోటిలో వేళ్లు పెట్టుకోవద్దని ఎప్పటికప్పుడు హెచ్చరించాలి. 
  3. బయటకు వెళ్లాల్సి వస్తే పిల్లల ముఖానికి పలుచని గుడ్డలాంటిది కట్టాలి. బయట ఆడుకుంటున్నా మాస్కులు, ఖర్చీఫ్‌లను ధరింపజేయాలి. ఎక్కువ మంది ఉన్న చోట ఉండకుండా చూసుకోవాలి. పెద్దలు కూడా బయటకు వెళ్లి వస్తే వెంటనే పిల్లలను తాకకుండా నీటితో చేతులు, కాళ్లు శుభ్రం చేసుకున్న తర్వాతే దగ్గరకు తీసుకోవాలి. 
  4. పిల్లలకు ఇచ్చే ఆహారంలో సీ విటమిన్‌ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. వారి బట్టలను వీలైతే రోజుకు రెండు సార్లు మార్చి వేయడం మంచిది. వెంటవెంటనే ఉతికి ఆరబెట్టుకోవాలి.
  5. దగ్గు, తుమ్ములు, జలుబు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలి.

మాస్కులతో రక్షణ

మాస్కులను ధరించడం వల్ల వైరస్‌ వ్యాప్తిని నిరోధించవచ్చని పలువురు వైద్యనిపుణులు చెబుతున్నారు. పలుచని మాస్కులు కాకుండా మేలి రకమైన, కాస్త మందపాటివి ధరించాలని సూచిస్తున్నారు. మాస్కులు అందుబాటులో లేకుంటే కనీసం ఖర్చీఫ్‌, లేకుంటే చీర కొంగులనైనా ముఖానికి అడ్డంగా పెట్టుకుంటే మంచిదని తెలుపుతున్నారు. అదేవిధంగా శుభ్రమైన న్యాప్కిన్లు వినియోగించి, ముఖాన్ని తుడుచుకో వాలని, చేతులతో ఇతరులను తాకకపోవడమే మంచిదని, కరచాలనం, ఆలింగనం ఇవ్వకపోవడం ఉత్తమని, తుమ్ములు, దగ్గులు వస్తే చేయికాకుండా, న్యాప్కిన్లు, టిష్యూలు వాడాలని చెబుతున్నారు. ముక్కు, కండ్ల ద్వారానే ఇది వ్యాప్తి చెందే అ వకాశం ఎక్కువగా ఉన్నందున, వాటిని చేతుల ద్వారా నలపకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. 

రద్దీ ప్రాంతాలకు వద్దు

అసలు ఈ వైరస్‌ గాలి ద్వారా వచ్చేది కాదు. అయినప్పటికీ జన సందోహానికి దూరంగా ఉండాలని, రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవడమే అత్యుత్తమమని నిపుణులు సూచించారు. ఎందుకంటే గుంపుగా ఉన్న వారిలో ఎవరికైనా కరోనా వైరస్‌ ఉంటే, వారు దగ్గినా, తుమ్మినా.. ఆ వచ్చే తుంపర్లలో కరోనా వైరస్‌ ఉంటుందని, అది మనపై పడితేనే ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇతరులకు కనీసం 2 మీటర్ల దూరంలో ఉండాలని తెలుపుతున్నారు.


logo
>>>>>>