శనివారం 28 మార్చి 2020
Peddapalli - Mar 17, 2020 , 22:32:56

మరింత వేగం పెంచాలి

మరింత వేగం పెంచాలి
  • డబుల్‌ బెడ్రూం నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలి
  • పెండింగ్‌ పనులు, అవసరమైన సామగ్రి వివరాలు ఇవ్వాలి
  • కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌
  • కలెక్టరేట్‌లో రెండు పడకల ఇండ్ల నిర్మాణంపై సమీక్ష

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనుల్లో మరిం త వేగం పెంచాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణంపై సంబంధిత శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో సోమవారం కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం 2064 ఇండ్లను గ్రామీణ ప్రాంతాలకు, 1330 ఇండ్లను పట్టణ ప్రాంతాలకు మంజూరు చేసిందని వెల్లడించారు. వీటిలో టెండర్లు పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించిన వాటిని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 2616 ఇళ్ల నిర్మాణ టెండర్లు ఖరారు చేసుకోగా, 1669 పనులు ప్రారంభించామని అధికారులు తెలిపారు. 142 ఇళ్లు గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. మరో 168 ఇండ్ల పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. వాటిలో అక్కడక్కడా పనులు ఉన్నాయని వివరించారు. జిల్లాలో ఇప్పటి దాకా రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణానికి రూ. 32.91కోట్లు వెచ్చించామని వివరించా రు. నిర్మాణ పనుల్లో సమస్యలపై కలెక్టర్‌ మండలాల వారీగా కాంట్రాక్టర్లతో చర్చించారు. ఇసుక అందుబాటులో ఉండకపోవడం కొంత మేర పనులు జరగడంలేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. నీటి పారుదల ప్రాజెక్టుల్లో నీరు అందుబాటులోకి రావడంతో కొన్ని ఇసుక రీచ్‌ల్లో కొరత ఉందని, దీనిని అధిగమించేందుకు ఇటీవలే కొత్త రీచ్‌లను గుర్తించామని కలెక్టర్‌ తెలిపారు. అక్కడి నుంచి వెంటనే నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందిస్తామని, పనులను కొనసాగించాలని పేర్కొన్నారు. జిల్లాలో పలుమార్లు టెండర్లు పిలిచినా స్పందన రాని ఇండ్ల నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. సదరు వివరాలతో మంత్రి, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి వారికి వివరించి, వారి సలహాలతో తదుపరి టెండర్లు నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ మండలాల వారీగా అధికారులు, కాంట్రాక్టర్లతో డబుల్‌ బెడ్రూంల నిర్మాణానికి సం బంధించి సమీక్ష నిర్వహించారు. 1611  డబుల్‌ బెడ్రూంల ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 262 ఇండ్లలో విద్యుత్‌ సంబంధిత పనులు, 310 ఇండ్లలో పారిశుధ్య పనులు, 310 ఇండ్లలో ఫ్లోరింగ్‌ పనులు పూర్తి చేశామని తెలిపారు. ఆ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులు, వాటికి అవసరమైన సా మగ్రికి సంబంధించిన ప్రతిపాదనలివ్వాలని సూచించారు. మంథనిలో 92 ఇండ్లకు సంబంధించి 95 పనులు పూర్తి చేశామని, వా టిలో మిగిలి ఉన్న పనులను ప్రభుత్వం నుంచి నిధులు విడుదలై న 10 రోజుల్లో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. ఇక్కడ ఇన్‌చార్జి డీఆర్వో కె. నర్సింహమూర్తి, పంచాయతీరాజ్‌ ఈఈ విష్ణువర్ధన్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ, కాంట్రాక్టర్లు ఉన్నారు.


logo