మంగళవారం 26 మే 2020
Peddapalli - Mar 13, 2020 , 16:20:12

సమష్టి కృషి.. గాడిన సంస్థ

సమష్టి కృషి.. గాడిన సంస్థ

ఆర్టీసీ కరీంనగర్‌ రీజియన్‌లో పది డిపోలున్నాయి. వీటి పరిధిలో 919 బస్సులు నడుస్తున్నాయి. ఇందులో 567 ఆర్టీసీ, 352 అద్దె బస్సులున్నాయి. మొత్తం 4,838 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. రోజుకు ఐదు లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. ఈ సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని.. సమ్మె సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ యాజమాన్యంతో కలిసి సంయుక్తంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిబ్బంది కొరతను అధిగమించడంతో పాటు, అధునాతన సౌకర్యం గల బస్సులను ప్రైవేట్‌గా తీసుకోవాలని నిర్ణయించారు. ఆ మేరకు సమ్మె కాలంలోనే రీజియన్‌ పరిధిలో 182 కొత్త బస్సులను తీసుకునేందుకు ఆర్టీసీ అధికారులు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో ఒక్కో డిపోకు 10 నుంచి 15 చొప్పున మొత్తం పది డిపోల పరిధిలో 143 బస్సులు కొత్తగా వచ్చాయి. ఆయా బస్సుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. ఇదే సమయంలో ఆర్టీసీ తన బస్సులను ఆధునికీకరించి నడుపుతున్నది. ఫలితంగా ఆదాయం కూడా పెరుగుతున్నది. అలాగే, మిగిలిన ప్రైవేట్‌, ఆర్టీసీ బస్సులను కూడా ఒక పద్ధతి ప్రకారం నడిపే విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. 

సమష్టి కృషి.. గాడిన సంస్థ

గత చరిత్రను ఒక్కసారి చూస్తే.. రాష్ట్రంలో అత్యధిక లాభాలు గడించే దానిలో కరీంనగర్‌ రీజియన్‌ ముందు వరుసలో ఉండేది. కానీ, రానురానూ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ యూనియన్లు గతేడాది అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో సమ్మెకు వెళ్లాయి. కార్మికులకు లేనిపోని ఆశలు కల్పించి, చేతులెత్తేశాయి. సమ్మె విరమణ తదుపరి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ సిబ్బందికి ఇచ్చిన అనేక వరాలు ప్రస్తుతం సంస్థను గాడిలో పెట్టేందుకు పనికి వస్తున్నాయి. ప్రైవేట్‌ బస్సులను యూనియన్లు వ్యతిరేకించాయి. కానీ, అవే బస్సులు ప్రస్తుతం ఆర్టీసీ బస్సులతో కలిపి ఆదాయం పెంచేందుకు ఉపయోగ పడుతున్నాయి. ఇవేకాదు, డిపోల వారీగా వెల్ఫేర్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. అలాగే మహిళా సిబ్బందికి అదనపు సౌకర్యాలు కల్పించారు. ఉద్యోగ విమరణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచారు. తాజా బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించారు. అలాగే సమ్మె కాలానికి వేతనాలను బుధవారమే విడుదల చేశారు. ఇలా ప్రభుత్వం ఆర్టీసీని కాపాడుకునేందుకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్న నేపథ్యాన్ని గుర్తించిన కార్మికులు.. యూనియన్లతో పని లేకుండా సమష్టిగా కృషి చేస్తున్నారు. డిపోల వారీగా పోటీ తత్వాన్ని అలవాటు చేసుకొని.. ఎప్పటికప్పుడు గేట్‌ మీటింగ్‌లు పెట్టుకుంటూ ఎక్కువ ఆదాయం తేవడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారులు, సిబ్బంది అన్న తేడా లేకుండా కలిసి పని చేస్తున్నారు. వీటితో పాటు.. చిన్నచిన్న స్టేజీల వద్ద కూడా ప్రయాణిలకు సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ లౌడ్‌ స్పీకర్‌ పట్టుకొని ఆర్టీసీ బస్సులు వచ్చిపోయే వేళలు చెప్పడంతోపాటు.. ప్రయణికులను తమ గమ్య స్థానాలకు చేరవేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆదాయం తక్కువగా వచ్చే రూట్లపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఆర్టీసీ బస్‌పాసులు.. వాటి ద్వారా సమకూరే సౌకర్యాల విషయాలను వివరిస్తున్నారు. యూనియన్ల ప్రభావం తగ్గడంతో కార్మికులు స్వేచ్ఛగా పని చేసుకుంటున్నారు. అలాగే అధికారులకు, సిబ్బందికి మధ్య మంచి సంబంధాలు మెరుగు పడుతున్నాయి. ఈ పరిస్థితులన్నీ ఆర్టీసీ ఆదాయం పెంపు వైపు తీసుకెళ్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఈ ఏప్రిల్‌ నుంచే ఆర్టీసీకి మరిన్ని మంచి రోజులు వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 పెరిగిన ఆదాయం..

గతేడాది ఫిబ్రవరితో పోల్చి చూస్తే.. ఈ యేడాది ఫిబ్రవరిలో ఆర్టీసీలో గణనీయమైన మార్పు కనిపించింది. గతేడాది ఫిబ్రవరిలో రోజుకు 3.62 లక్షల కిలోమీటర్లు తిప్పగా.. ఈ యేడాది మాత్రం 3.93 కిలోమీటర్లు తిప్పారు. అంటే బస్సులు రోజుకు సుమారు 31 వేల కిలోమీటర్లు అదనంగా తిరిగాయి. నెల వారీగా చూస్తే తొమ్మిది లక్షల కిలోమీటర్లు అదనంగా నడిచాయి. దీని ద్వారా ప్రయాణికులకు పూర్తిస్థాయిలో రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లయింది. అలాగే గతేడాది ఒక కిలోమీటర్‌కు ఆదాయం 30.84 వస్తే.. ఈ యేడాది ఫిబ్రవరిలో 35.18 వచ్చింది. అంటే అదనంగా ఒక్కో కిలోమీటర్‌పై 4.34 (నాలుగు రూపాయల ముప్పై నాలుగు పైసలు) ఆదాయం సమకూరింది. అలాగే గతేడాది ఫిబ్రవరి నెలలో రోజుకు ఆదాయం కోటీ 5 లక్షల 29 వేలు రాగా, ఈ యేడాది ఫిబ్రవరిలో రోజుకు కోటి 38 లక్షల 11 వేల ఆదాయం వచ్చింది. అంటే అదనంగా రోజుకు 32.82 లక్షలు సమకూరాయి. ఒక్కో రోజు సుమారు 31 శాతం అదనంగా ఆదాయం వచ్చింది. ఈ ఫిబ్రవరిలో సమ్మక్క-సారలమ్మ జాతరతోపాటు శివరాత్రి జాతరలు ఉపయోగపడ్డాయి. కాగా, రీజియన్‌ మొత్తంలో ఇతర పనిదినాల్లో చూసుకుంటే.. రమారమి.. రోజుకు 3.76 లక్షల కిలోమీటర్లు తిరగడమే కాకుండా, రోజుకు కోటీ 18 లక్షల 50 వేల ఆదాయం వస్తున్నది. ఏ లెక్కన చూసినా.. సమ్మె తదుపరి ఆర్టీసీ ఆదాయం క్రమంగా పెరుగుతున్నది.  

సంస్థ బాగుకు ఎంతైనా కష్టపడుతాం.. 

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు అహర్నిశలూ కష్టపడుతున్నాం. చెట్టు పచ్చగా ఉంటేనే నీడనిస్తుంది. మా సంస్థ బాగుంటేనే మేం బాగుంటాం. అందుకే సంస్థ ప్రగతికి అహర్నిశలూ కృషిచేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే సురక్షితంగా గమ్యానికి చేరుకుంటారనే నమ్మకాన్ని ప్రజల్లో కల్గిస్తున్నాం. ప్రయాణికులు చెయ్యి ఎత్తిన చోట ఆపుతున్నాం. కోరిన చోట దింపుతున్నాం. 

- ఎం రాంచందర్‌, ఆర్టీసీ డ్రైవర్‌, (గోదావరిఖని డిపో)

నాలుగు డబ్బులు  ఎక్కువొస్తే మాకే లాభం.. 

డ్యూటీ ఏ రూట్‌లో వేసినా ఓపిగ్గా పనిచేసి మంచి కలెక్షన్‌ తీసుకువస్తున్నాం. ఒక్క రూపాయి నష్టం రాకుండా ప్లానింగ్‌తో నడుచుకుంటున్నాం. ఒక్క టికెట్‌ తప్పిపోకుండా ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుంటున్నాం. సంస్థకు మంచి ఆదాయం వస్తే మాకే లాభం కదా. సమ్మె సమయంలో మా ఉద్యోగాలు పోతాయనే భయపడ్డాం. కానీ మమ్మల్ని సీఎం కేసీఆర్‌ అక్కున చేర్చుకొని ఆదరించి, భరోసా కల్పించారు. ఆయన నమ్మకానికి అనుగుణంగా సంస్థను ప్రగతిలోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నాం 

-జే. శ్రీలత, కండక్టర్‌,( గోదావరిఖని డిపో)

జట్టుగా పనిచేయడం వల్ల్లే ఆదాయం పెరుగుదల

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన స్ఫూర్తి.. ఆర్టీసీ అవసరాలు తీరుస్తున్న నేపథ్యం.. సిబ్బంది డిమాండ్ల పరిష్కారం వంటి అనేక అంశాల్లో డ్రైవర్‌, కండక్టర్‌తో పాటు ఆర్టీసీలో పనిచేసే ప్రతి సిబ్బందిలోనూ కొత్త ఉత్సాహం నింపాయి. ఇది మన సంస్థ.. మనం కాపాడుకోవాలన్న భావన ప్రతి సిబ్బందిలోనూ ఉన్నది. అందుకే.. ఎవరికి వారే.. తమ తమ రూట్లలో ఎక్కువ ఆదాయం తేవడానికి కష్టపడుతున్నారు. అలాగే ప్రయాణిలకు వీలైనంత ఎక్కువ సేవలు అందిస్తున్నారు. ప్రైవేటు బస్సుల రాకతో ప్రయాణికులకు అదనపు సౌకర్యాలు సమకూరుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆదాయం కూడా పెరుగుతోంది. ఇది ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు.. అందరి సమష్టి కృషితో రీజియన్‌ ప్రగతి పథంలో సాగుతోంది. ఏప్రిల్‌ నెల నుంచి మరింత ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నాం. 

- పీ జీవన్‌ప్రసాద్‌, ఆర్‌ఎం  


సమష్టిగా శ్రమిస్తున్నాం..

ఆర్టీసీలోని సిబ్బంది గతానికి భిన్నంగా పనిచేస్తున్నారు. సంస్థ మా జీవనాధారమేకాదు.. లక్షలాది మందిని సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చేది. దీనిపై ఎంతో మంది జీవితాలు అధారపడి ఉన్నాయి. గత సమ్మెకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటిన్నింటినీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓర్పు, సహనంతో పరిష్కరించారు. అంతేకాదు.. కష్ట పడి పనిచేస్తే వచ్చే లాభాలను కార్మికులకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఎన్నో ప్రయోజనాలు కల్పించారు. తాజా బడ్జెట్‌లోనూ వెయ్యి కోట్లు కేటాయించారు. ప్రభుత్వం ఆర్టీసీని కాపాడేందుకు చేస్తున్న ప్రతి పనిని సిబ్బంది గుర్తిస్తున్నారు. అందుకే.. కష్టించి పనిచేసి.. ఆర్టీసీని లాభాల బాటలోకి తేవాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. సీం సూచన మేరకు.. సంక్షేమ కమిటీలను మరింత బలోపేతం చేస్తాం. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటున్నాం.

- ఎం సత్తయ్య, రీజినల్‌ కమిటీ మెంబర్‌ (రెండో డిపో) 


లాభాలు సాధించడమే లక్ష్యం 

ఒకప్పుడు కరీంనగర్‌ రీజియన్‌ లాభాలకు నిలయం. పరిస్థితులు ఏవైనా.. ఆర్టీసీ నష్టాలను చవి చూసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇచ్చిన స్ఫూర్తితో సమష్టిగా పనిచేస్తున్నాం. సంస్థపరంగా ఉన్న లోపాలను సవరించుకంటూ ముందుకు వెళ్తున్నాం. మళ్లీ పూర్వవైభవం తీసుకు రావాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. ఇందు కోసం.. మా శక్తి మేరకు.. పని చేయడమేకాదు, ప్రయాణిలకు ఒక భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. సిబ్బంది సమష్టిగా కలిసి పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో.. మున్ముందు అందరికీ అర్థమవుతుంది. 

- పాతూరి శ్రీకాంత్‌ చరణ్‌రెడ్డి  కండక్టర్‌ (కరీంనగర్‌ 2 డిపో ) 


గొప్ప విషయం.. 

సమ్మెకాలానికి వేతనాలు ఇవ్వడం చాలా అరుదు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం మా కష్టాలను చూసి.. మమ్మల్ని కార్మికులుగా భావించకుండా.. ఒక కుటుంబ సభ్యులుగా భావించి వేతనాలు ఇచ్చిన విషయం ప్రతి సిబ్బంది గుండెల్లో చిరస్థాయిగా ఉండి పోతుంది. ఇంత ఆప్యాయతతో సిబ్బందిని అన్ని రకాలుగా ఆదుకుంటున్న తరుణంలో.. ఆర్టీసీని కాపాడుకునేందుకు అహర్నిశలూ కష్టపడి పనిచేస్తాం. సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసుకుంటే.. దాని ద్వారా ప్రయోజనం పొందేది కూడా మేమే. 

- మంద శ్రీనివాస్‌, కండక్టర్‌ (కరీంనగర్‌ 2డిపో )
logo