శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 10, 2020 , 01:59:35

సమయం లేదు మిత్రమా..

సమయం లేదు మిత్రమా..

మీకు బీఎస్‌-4 వాహనం ఉందా..? ఇప్పటికీ పీఆర్‌ (పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌) చేయించుకోలేదా..? అయితే ఈ 31లోగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోండి! లేదంటే మీ వాహనం మీది కాకుండా పోతుంది. రోడ్డెక్కితే అధికారుల పరమై, తుక్కు కిందే మిగలనున్నది. వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం అధునాతన ప్రమాణాలతో బీఎస్‌-6 వాహనాలను తీసుకొచ్చిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఎస్‌-4 వెహికిల్స్‌పై నిషేధం విధించాయి. ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలనీ, లేకపోతే వాటిని తుక్కు కింద పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో రవాణాశాఖ కార్యాలయాలు వాహనదారులతో కిక్కిరిసిపోతున్నాయి. 

బీఎస్‌ అంటే..

బీఎస్‌ అనగా భారత్‌ స్టేజ్‌. ఇంజిన్ల వెలువడే కాలుష్య కారకాల మోతాదు ఇంత మొత్తంలో మాత్రమే ఉండాలని నిర్దేశిస్తుంది. భారత ప్రభుత్వం ఈ బీఎస్‌ ప్రమాణాలను 2001 సంవత్సరానికి ముందే అందుబాటులోకి తీసుకొచ్చింది. 2001లో బీఎస్‌-1, ఆ తర్వాత బీఎస్‌-2, బీఎస్‌-3, బీఎస్‌-4 రాగా.. బీఎస్‌-5 లేకుండా ఇటీవలే బీఎస్‌-6 అమల్లోకి వచ్చింది. 

పెద్దపల్లి ప్రతినిధి/హుజూరాబాద్‌, నమస్తే తెలంగాణ : కాలుష్యాన్ని వెదజల్లుతున్న బీఎస్‌-4 వాహనాలకు కాలం చెల్లింది. ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్‌ చేయించని ఆ వాహనాలు తుక్కుకింద అమ్ముకోవాల్సి ఉంటుంది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఆ వెహికిల్స్‌ను నిషేధించాలని ఇప్పటికే సుప్రీం కోర్టు అదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్‌ కాని బీఎస్‌-4 వాహనాలు ఏప్రిల్‌ ఒకటి నుంచి రోడ్డెక్కితే జప్తు చేయాలనీ, నూతన టెక్నాలజీతో తయారైన బీఎస్‌-6వాహనాలకే రిజిస్ట్రేషన్‌ చేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్‌ కాని బీఎస్‌-4 వాహనాలను ఈ నెలాఖరులోగా చేసుకోవాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు. మరో వైపు డీలర్లకు అవగాహన కల్పిస్తూ వాహనదారులు రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా చర్యలు చేపడుతున్నారు. 


 లీటర్‌ పెట్రోల్‌ ఉండాల్సిందే..

ప్రస్తుతం బీఎస్‌-4 వెహికిల్స్‌ ట్యాంకులో ఉన్న పెట్రోల్‌ చివరి బొట్టు వరకు బండి నడుస్తుంది. అప్పటికీ మొరాయిస్తే చౌక్‌ను లాగితే మళ్లీ ముందుకు వెళ్లవచ్చు. కానీ, బీఎస్‌-6 వాహనాల్లో మాత్రం అలా కుదరదు. కనీసం ట్యాంకులో లీటర్‌ పెట్రోల్‌ ఉండాల్సిందే. చౌక్‌ వ్యవస్థ లేకపోవడమే ఇందుకు కారణం. ఇంధనం ట్యాంకు నుంచి నేరుగా ఇంజిన్‌కు (ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌) చేరేలా కనెక్ట్‌ చేసి ఉంటుంది. దీనివల్ల ఇంధనం నేరుగా ఇంజన్‌లోకి వెళ్లి మండడం వల్ల కాలుష్యం తగ్గుతుంది. శుద్ధిచేసిన ఇంధనం వాడకం, బీఎస్‌-6 ఇంజిన్‌ కారణంగా.. సాధారణం కన్నా 12 నుంచి 14శాతం మైలేజీ కూడా అదనంగా వస్తుంది. ఇంజిన్‌ స్టార్ట్‌ చేసిన సమయంలో శబ్దం కూడా వెలువడదు. 

బీఎస్‌-6 పెట్రోల్‌, డీజిల్‌తో కాలుష్యం తక్కువ..

బీఎస్‌-4 వాహనాల నుంచి వచ్చే పొగ అధికంగా ఉంటున్నది. సల్ఫర్‌ 500 పీపీఎం (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) విడుదలవుతున్నది. ప్రస్తుతం వాహనాల్లో వాడుతున్న బీఎస్‌-4 ఇంధనంలో 50శాతం సల్ఫర్‌ ఉండడమే ఇందుకు కారణం. దీని వల్లే కాలుష్యం భారీగా వెలువడుతున్నది. దీనిని తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం ఏప్రిల్‌ 1 నుంచి మార్కెట్లోకి బీఎస్‌-6 పెట్రోల్‌, డీజిల్‌ను అందుబాటులోకి తెస్తున్నది. శుద్ధిచేసిన ఈ ఇంధనంలో సల్ఫర్‌ 10శాతం మాత్రమే ఉంటుంది. అందుకే కాలుష్యం తక్కవ. బీఎస్‌4తో పోలిస్తే బీఎస్‌6 వాహనాల్లో నైట్రోజన్‌ ఆక్సైడ్‌ విడుదల కూడా ఐదు రెట్లు తక్కువే. ఈ ఇంధనానికి అనుగుణంగా కేంద్రం బీఎస్‌-6 వాహనాలను తీసుకొచ్చింది. 

మార్కెట్లోకి బీఎస్‌-6 వాహనాలు..

బీఎస్‌-4 వాహనాలను నిషేధించిన నేపథ్యంలో కంపెనీలు బీఎస్‌ 6 పేరిట నూతన టెక్నాలజీతో కొత్త వాహనాలను తయారు చేశాయి. ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చాయి. పలు షోరూంలల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. దాదాపుగా ఒకటి అర తప్ప బీఎస్‌-4 వాహనాలు డీలర్ల దగ్గర లేవు. ఎట్టి పరిస్థితుల్లోనైనా అలాంటి వాహనాలు ఉంటే డీలర్లు అమ్ముకోవాల్సిందే. బీఎస్‌-4 వాహనాల తయారీని ఆయా కంపెనీలు రెండు మూడు నెలల క్రితమే ఆపేసింది. చిన్నచిన్న వాహనాల నుంచి పెద్ద వాహనాల వరకు ప్రతి షోరూంలో బీఎస్‌-6 వాహనాలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. కొందరు డీలర్లు బీఎస్‌-4 వాహనాలను విక్రయించేందుకు డిస్కౌంట్లు ఇస్తున్నారు.  

 కార్యాలయాల్లో రద్దీ

ప్రస్తుతం డ్రైవ్‌ నిర్వహిస్తుండడం, మార్చి తర్వాత రిజిస్ట్రేషన్లు కావని అధికారులు తేల్చిచెబుతుండడంతో వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల కోసం క్యూ కడుతున్నారు. సాధారణంగా కార్యాలయాల్లో మొన్నటి వరకు రోజుకు వంద లోపే రిజిస్ట్రేషన్లు చేసినా, ప్రస్తుతం అంతకంటే ఎక్కువే చేస్తున్నారు. రెండు, మూడేళ్ల కింద కొన్న వాహనాల పేపర్లు పట్టుకుని స్లాట్‌ బుకింగ్‌ చేసుకుని వాహనదారులు వస్తున్నారు. రోజూ 60 స్లాట్లు అయ్యే కార్యాలయాల్లో ఐదింతలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. 


logo