సోమవారం 06 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 10, 2020 , 01:54:17

వరికి చీడ పీడ

వరికి చీడ పీడ

కమాన్‌పూర్‌ : జిల్లాలో కొద్దిరోజులుగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో  వరి పంటను అగ్గి తెగులు పీడిస్తున్నది. ప్రధానంగా వరిపైనే ప్రతాపం చూపుతుండగా, మక్క రైతులను ఆగమాగం చేస్తున్నది. పంటపై అగ్గి తెగులు, ఆకు ముడుత పురుగులు విస్తరిస్తూ అతలాకుతలం చేస్తున్నది. సమస్యను తెలుసుకున్న వ్యవసాయ శాఖ రైతులకు సూచనలు సలహాలు ఇస్తున్నది. అధికారులతోపాటు శాస్త్రవేత్తలు పంటలను పరిశీలిస్తూ రైతులు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరిస్తూ వారిలో మనోధైర్యం కల్పిస్తున్నారు. 

ఈ ఏడు రికార్డుస్థాయిలో సాగు..

జిల్లాలో ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో వరి పంట సాగు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవడం, చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీరు చేరింది. భూగర్భ జలాలు పెరిగి బావులు, బోర్లలో సమృద్ధిగా నీరు ఉండడం, దీనికి తోడు ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి వారబంధీ పద్ధతిన నీరు వదలండంతో రైతులు విస్తృతంగా సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 1.98లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతం పొట్టదశలో ఉండగా, కొద్దిరోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులు, నత్రజని ఎక్కువవాడడం వంటి కారణాలతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 20వేల ఎకరాల వరికి అగ్గితెగులు సోకినట్లు అధికారులు తెలిపారు. 

ఎందుకీ విపత్తు.. 

వరిలో నత్రజని మోతాదుకు మించి అధికంగా వాడడం, రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు తక్కువగా ఉండడం, పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 30 డిగ్రీల దాకా ఉండి గాలిలో తేమ 90 శాతం కంటే ఎక్కువగా ఉండడం వల్ల అగ్గి తెగులు సోకుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. తరుచుగా మబ్బులు, చిరుజల్లులు, మంచు వాతావరణం ఉండడం వల్ల కూడా ఇందుకు కారణమవుతుందని చెబుతున్నారు. పొలం గట్లపైన ఉండే గడ్డి జాతి మొ క్కల వల్ల అగ్గితెగులు వస్తుందని పేర్కొంటున్నారు. 

లక్షణాలివే.. 

ఆకు వెన్నుపైన కణుపులు కనిపిస్తాయి. నూలు కండె ఆకారపు మచ్చలు ఏర్పడుతాయి. మచ్చల చివర్లు మొనదేలి అంచులు మాత్రం ముదురు గోదుమ రంగులో ఉంటాయి. మచ్చల మధ్యలో బూడిద రంగు ఉంటుంది. ఈ మచ్చలు పెద్దవై కలిసిపోయి ఆకు అంతటా వ్యాపిస్తాయి. మొక్కలు ఎండిపోయి ఉండడంతోపాటు దూరం నుంచి చూస్తే పంట తగలబడినట్లుగా కనిపిస్తుంటుంది. ప్రస్తుతం జిల్లాలో వరి పంట వివిధ దశల్లో ఉంది. ప్రధానంగా పిలకల దశ నుంచి చివరి పొట్ట దశలో ఉన్న వరి పంటలో అగ్గి తెగులు ఉధృతి ఎక్కువగా కనిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

నివారణకు మార్గాలివే.. 

పొలంలో, పొలం గట్లపైన గడ్డి జాతి కలుపు మొక్కలు తుంగ, గరిక, ఒలిపిరి లాంటి మొక్కలు లేకుండా చూసుకోవాలి. సిఫారసు చేసిన మేరకు నత్రజని ఎరువులను మూడు లేదా నాలుగు సార్లు వేసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు అగ్గి తెగులు ఆశించడానికి అనుకూలంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో రైతులు నత్రజని ఎరువులను వేయడం కొద్దిరోజులపాటు నిలిపివేయాలని సూచిస్తున్నారు. ముందుగా తెగులును నివారించుకుని మళ్లీ మాములు పరిస్థితులు నెలకున్నప్పుడే నత్రజని ఎరువును మోతాదులో వేయాలని సూచిస్తున్నారు. పైరులో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు వీలుగా పొటాషియం ఎరువులను మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ రూపంలో ఎకరానికి 10 లేదా 15 కిలోలు రెండు దఫాలుగా అంటే దమ్మలో ఒక్కసారి, చిరుపొట్ట దశలో ఒక్కసారి వేసుకోవాలి. నివారణకు ట్రై సైక్లోజోల్‌+మాంకోజెబ్‌ మిశ్రమ మందును 2.5 గ్రాములను లీటరు నీటిలో కలిపి వాడాలి. లేదా ఐసోపోథయోలిన్‌ 1.5 మిల్లి లీటర్లు లేదా కాసుగ మైసీన్‌ 2.5 మిల్లి లీటర్లు నీటిలో కలిపి తెగులు ఉధృతిని బట్టి, వాతావరణ పరిస్థితుల ఆధారంగా 7 నుంచి 10 రోజుల వ్యవధిలో రెండు మార్లు పిచికారి చేయాలి.


logo