గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 10, 2020 , 01:53:31

ఘనంగా హోలీ

ఘనంగా హోలీ

రాంమందిర్‌ ఏరియా / యైటింక్లయిన్‌కాలనీ / జ్యోతినగర్‌/ ఫెర్టిలైజర్‌సిటీ : హోలీ వేడుకలు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంతోపాటు రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాలతో పాటు కార్మిక వాడల్లో ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. సోమవారం ఉదయం నుంచే నగరంలోని వీధులన్నీ రంగులమయంగా మారాయి. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకల్లో మునిగిపోయారు. తెల్లవారు జామున నగరంలోని ఆయా వీధుల్లో చిన్నారులు, యువకులు బోగి మంటలు అంటించి అనంతరం ఇంటింటికి వెళ్లి జాజిరి ఆటల అనంతరం హోలీ వేడుకలను జరుపుకున్నారు. యువతీ, యువకులతోపాటు చిన్నారులు సంప్రదాయబద్ధమైన రంగులను మాత్రమే వినియోగించి ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకున్నారు. టౌన్‌షిప్‌లోని స్పందన క్లబ్‌లో జరిగిన చిన్నారుల  హోలీ సంబరాలు ఆకర్షణగా నిలిచాయి. ఎన్‌సీఓఏ క్లబ్‌లో అధికారులు, వారి కుటుంబ సభ్యులతో హోళీ వేడుకల్లో పాల్గొని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ రమేశ్‌ బాబు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇక్కడ ఎస్‌ఐలు నాగరాజు, సూర్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

వైరస్‌ ప్రభావం లేదు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావం ఏమి లేదనీ, ఒకవేళ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందినా ఎంత ఖర్చు చేసైనా మా ప్రజలను కాపాడుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే ప్రకటించారనీ, ఆ దీమాతోనే హోలీ వేడుకలను ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని నగర పాలక సంస్థ మేయర్‌ డా.బంగి అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని 48, 50 డివిజన్లలో ఆయన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే మన ప్రాంతానికి అలాంటి వైరస్‌ ఏవీ కూడా వ్యాప్తి చెందే అవకాశం లేదన్నారు. ఆయన వెంట ప్రముఖ వైద్యులు డా.క్యాస శ్రీనివాస్‌, డా.మోహన్‌ రావు, వైద్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.


logo