గురువారం 09 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 08, 2020 , 01:39:25

‘డబుల్‌' స్పీడ్‌తో జరగాలి

‘డబుల్‌' స్పీడ్‌తో జరగాలి

పెద్దపల్లిరూరల్‌ : జిల్లాలోని పేదవర్గాల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెం చాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల పురోగతి, ప్రజావాణి సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు 2064 ఇండ్లు, పట్టణ ప్రాంతాలకు 1330 ఇండ్ల ను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఇందులో పను లు ప్రారంభించిన ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, టెం డర్లు పూర్తయిన ఇండ్ల పనులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 2,616 ఇండ్ల నిర్మాణాలకు టెండర్లు ఖరారు చేసుకోగా, 1,669 ఇండ్ల నిర్మాణ ప నులను ప్రారంభించామని, 142 ఇండ్లు పూర్తి స్థాయిలో నిర్మించామని సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అనుభవం కలిగిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పారు. రూ. 108 కోట్ల అంచనా వ్యయంతో జిల్లాలో ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించామని, ప్రభుత్వం సుమారు రూ. 33 కోట్లను విడుదల చేయగా రూ. 30 కోట్ల నిర్మాణ పనులకు సంబంధించిన యూసీలను సమర్పించామని తెలిపారు. నిర్మాణాల పురోగతిపై పది రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి సమస్యలున్నా తాసిల్లార్లు పరిష్కరించుకోవాలని చెప్పారు. 


ప్రజావాణి దరఖాస్తులపై స్పందించాలి..

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమ దరఖాస్తులపై అధికారులు ఎప్పటికప్పుడు స్పందించాలని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ ఏడాదిలో జిల్లాలో ఇప్పటి వరకు 203 దరఖాస్తులు రాగా, 82 దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించినట్లు తెలిపారు. మిగతా 121 పెండింగ్‌లో ఉన్నాయని వాటన్నింటినీ వెంటనే పరిష్కరించేలా అధికారులు పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వీ లక్ష్మీనారాయణ, ఇన్‌చార్జి డీఆర్వో కే నర్సింహమూర్తి, పెద్దపల్లి ఆర్డీఓ శంకర్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ఈఈ విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. 


ప్రభుత్వ దవాఖానలపై విశ్వాసం పెంచాలి..

ప్రభుత్వ దవఖానాలపై ప్రజల విశ్వాసం పెంచేలా వైద్య సేవలు ఉండాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 23 పీహెచ్‌సీల్లో ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. అవసరమైనవారికి వైద్య సేవలను సకాలంలో అందిస్తూ, ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. పీహెచ్‌సీ వైద్యాధికారులు అందుబాటులో ఉండడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, వారి పనితీరులో మార్పు రావాలని కలెక్టర్‌ సూచించారు. జీపీఎస్‌ ద్వారా వైద్యుల హాజరును తనిఖీ చేయాలని ఆదేశించారు. 


వైద్యాధికారికి షోకాజ్‌ నోటీసు.. 

విధులను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ రామగుండం అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. షోకాజ్‌ నోటీసుకు స్పందించకుంటే సదరు వైద్యుడిని తొలగించి, మరొకరిని నియమించాలని చెప్పారు. జిల్లాలోని గర్భిణుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. జిల్లాలోని దవాఖానల్లో ఇప్పటి వరకు 3366 ప్రసవాలు జరగగా, 3081 గర్భిణుల వివరాలు మాత్రమే కేసీఆర్‌ కిట్టులో నమోదు చేశారని, మిగతావి వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు. సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. 


శస్త్ర చికిత్సలపై ఆడిట్‌ నిర్వహించాలి..

జిల్లాలోని ప్రైవేట్‌ దవాఖానల్లో చేస్తున్న శస్త్ర చికిత్సలపై ఆడిట్‌ నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలో 2,277 (87శాతం) మందికి ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు చేయగా, కేవలం 335 మందికి (13శాతం) మందికి సాధారణ ప్రసవా లు జరిగాయని తెలిపారు. ప్రైవేట్‌ దవాఖానల్లో డబ్బుల కోసం ఆపరేషన్లు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వైద్యాధికారుల వద్ద 414 కేసీఆర్‌ కిట్లు పెండింగ్‌లో ఉన్నాయని వాటికి వెంటనే పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ఆదేశించారు. విధులను నిర్లక్ష్యం చేసేవారికి మెమోలు జారీ చేయాలని, పద్ధతి మార్చుకోని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీబీ వ్యాధి నిర్మూలన, ఎన్‌సీడీ సర్వే అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ కృపాబాయి, డాక్టర్‌ వసంత్‌రావు, ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.  logo