శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Peddapalli - Mar 08, 2020 , 01:41:34

సుల్తానాబాద్‌ దవాఖాన నిర్వహణ భేష్‌

సుల్తానాబాద్‌ దవాఖాన నిర్వహణ భేష్‌

సుల్తానాబాద్‌ : జిల్లాలోని సుల్తానాబాద్‌ ప్రభుత్వ దవాఖానాలో అందిస్తున్న సేవలు బాగున్నాయని రాష్ట్ర కాయకల్ప బృందం సభ్యులు కితాబునిచ్చారు. స్థానిక సర్కారు దవాఖానాను వారు శనివారం సందర్శించారు. ఈ బృందంలో రాష్ట్ర వైద్యవిధాన పరిషత్‌ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ జయరామ్‌రెడ్డి, డాక్టర్‌ నరేశ్‌, ఏడుకొండలు, బద్రినాథ్‌ ఉన్నారు. ఈ సందర్భంగా దవాఖానలో ఉన్న వసతులు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం రాష్ట్ర వైద్యవిధాన పరిషత్‌ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ జయరామ్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో 13 దవాఖానాలు కాయకల్ప కింద ఎంపిక చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా సుల్తానాబాద్‌ దవాఖానాను పరిశీలించామని పేర్కొన్నారు. దవాఖానలో అత్యాదునిక పరికరాలు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను ప్రమాణికంగా తీసుకుంటామని చెప్పారు. 


ఇప్పటి వరకు పరిశీలించిన దవాఖానల్లో సుల్తానాబాద్‌ దవాఖాన పనితీరు బాగున్నదని కొనియాడారు. కాయకల్ప కింద ఎంపికైన మొదటి రెండు దవాఖానాలకు ఏటా రూ.15 లక్షల అభివృద్ధి నిధులు అందిస్తారని, 3వ స్థానంలో నిలిచిన దవాఖాను రూ.10 లక్షలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ మేనేజర్‌ అనిల్‌, డాక్టర్‌ శ్రీరాంశ్రీనివాస్‌, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


logo