శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Mar 08, 2020 , 01:36:41

కంచే చేను మేసింది

కంచే చేను మేసింది

ఫెర్టిలైజర్‌సిటీ: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మ ధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం పంపిణీ చేసే సన్నబియ్యాన్ని కొందరు అక్రమార్కులు వాటిని పక్కదారి పట్టిస్తుండగా రామగుండం టాస్క్‌ఫోర్సు పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. ఈమేరకు 10క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, అక్రమంగా రవాణా చేస్తున్న పెద్దపల్లి పౌరసరఫరాల శాఖ గోదాం ఇన్‌చార్జి, డిప్యూటీ తాసిల్దార్‌, డీలర్లను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు గోదావరిఖనిలోని వంగర రాజమొగిలికి చెందిన రేషన్‌ దుకాణంపై టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి సిబ్బంది దాడులు నిర్వహించారని తెలిపారు. ఈ దాడుల్లో 20బస్తాల సన్నబియ్యం లభ్యమయ్యాయ నీ, అనంతరం రికార్డులను పరిశీలించి రేషన్‌ డీలర్‌ను విచారించగా పెద్దపల్లి పౌరసరఫరాల శాఖ గోదాం ఇన్‌చార్జి , డిప్యూటీ తహసీల్దార్‌ బొబ్బిలి సత్యనారాయణ కుమ్మక్కై ప్రభుత్వం పాఠశాలలకు పంపిణీ చేసే సన్నబియ్యాన్ని దొడ్డిదారిన బహిరంగ మార్కెట్‌లో విక్రయించేందుకు రేషన్‌ షాపులో నిల్వ ఉంచినట్లు వెల్లడైందని వివరించారు.


అనంతరం గోదాంతోసహా ఇతరాత్ర రికార్డులను పరిశీలించి బి య్యాన్ని, నిందితులను వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించగా, వన్‌టౌన్‌ రెండో సీఐ రాజ్‌కుమార్‌గౌడ్‌ కేసు నమోదు చేసి ప్రశాంత్‌నగర్‌కు చెందిన డీలర్‌ వంగర రాజమౌళి, కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండ లం అసిఫ్‌నగర్‌కు చెందిన డిప్యూటీ తాసిల్దార్‌, గోదాం ఇన్‌చార్జి బొబ్బిలి సత్యనారాయణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. ఇక్కడ ఖని సబ్‌ డివిజన్‌ ఏసీపీ ఉమేందర్‌, వన్‌టౌన్‌ సీఐ పర్స రమేశ్‌, రెండో సీఐ రాజ్‌కుమార్‌, ఎస్‌ఐ అప్పాని వెంకటేశ్వర్లు ఉన్నారు.